చిటికెలో నేరస్తుల చిట్టా | Criminals data are enclosed in the central home network | Sakshi
Sakshi News home page

చిటికెలో నేరస్తుల చిట్టా

Feb 25 2018 12:17 AM | Updated on Aug 21 2018 6:02 PM

Criminals data are enclosed in the central home network - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరిగే అంతర్రాష్ట్ర నేరస్తులను పోలీసులు ఇకపై గుర్తించడం, వారి వివరాలు సేకరించడం సులభం కానుంది. కేంద్ర హోంశాఖ అమలు చేస్తున్న క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎస్‌) ప్రాజెక్టు దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలోనూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో క్రిమినల్స్‌ వివరాలన్నీ డేటా బేస్‌లోకి వచ్చేశాయి. దీంతో నేరస్తుల వివరాలను అన్ని రాష్ట్రాల పోలీసులు సులువుగా తెలుసుకోనున్నారు. 

తొమ్మిదేళ్ల సమయం... 
కేంద్ర హోంశాఖ 2009లో ప్రారంభించిన సీసీటీఎన్‌ఎస్‌ ప్రాజెక్టును ఇప్పటివరకు దశలవారీగా అమలు చేస్తూ వచ్చారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఇంటర్నెట్‌ సౌకర్యం, కంప్యూటర్లు, ఎఫ్‌ఐఆర్‌ల అప్‌లోడ్, నేరస్తుల వివరాలు...ఇలా తొమ్మిది రకాల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో అప్‌డేట్‌ చేస్తూ వచ్చారు. తొమ్మిదేళ్ల తర్వాత ప్రతి రాష్ట్రంలోని నేరస్తుల డేటా, వారికిపడ్డ శిక్షలు, పెండింగ్‌లో ఉన్న కేసులు, నిందితులు, పరారీలో ఉన్న నేరస్తుల వివరాలు, ప్రస్తుతం ఆ కేసుల స్టేటస్‌ వంటివన్నీ సీసీటీఎన్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. 

మార్చి మొదటి వారం నుంచి... 
దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని పోలీసుస్టేషన్లకు మార్చి మొదటి వారం నుంచి సీసీటీఎన్‌ఎస్‌ డేటా బేస్‌ అందుబాటులోకి రానుంది. రూ. 2 వేల కోట్లతో అభివృద్ది చేసిన ఈ ప్రాజెక్టులో 20 వేల పోలీస్‌స్టేషన్ల నుంచి డేటా అప్‌లోడ్‌ అయింది. 5 వేల మంది అధికారులు డేటాను చూసేలా అవకాశం కల్పించారు. ఎఫ్‌ఐఆర్, ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్, చార్జిషీట్, ఇంటర్‌లింక్‌ పోలీస్‌స్టేషన్, రాష్ట్ర, దేశ డేటాబేస్‌ సెంటర్‌ లింకులు, వాహనాల డేటా, వాటికి అనుసంధానమైన ఆధార్‌ వివరాలు, పాస్‌పోర్టు డేటా, మొదలైన 44 రకాల వివరాలను ఈ ప్రాజెక్టు ద్వారా పొందేలా సమకూర్చారు. ఈ డేటా బేస్‌ను 10 లక్షల మంది పోలీసులు నిత్యం ఉపయోగించుకునే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. 

20 లక్షల మంది నేరస్తులు... 
దేశవ్యాప్తంగా సీసీటీఎన్‌ఎస్‌ ప్రాజెక్టులో అప్‌లోడ్‌ అయిన వివరాలు పోలీసులను నివ్వెరపరిచాయి. దేశవ్యాప్తంగా ఏకంగా 20 లక్షల మంది ఆర్గనైజ్డ్‌ అఫెండర్స్‌ (వ్యవస్థీకృత నేరస్తులు) ఉన్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణలో 1.8 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 2.2 లక్షల మందికిపైగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే నిందితులున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక నేరస్తులుండగా మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానాల్లో నిలిచినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement