'కన్నీళ్లు పెట్టిన మంత్రులు' ! | ' Cried the ministers' ! | Sakshi
Sakshi News home page

'కన్నీళ్లు పెట్టిన మంత్రులు' !

Mar 28 2015 8:39 AM | Updated on Sep 2 2017 11:28 PM

'కన్నీళ్లు పెట్టిన మంత్రులు' !

'కన్నీళ్లు పెట్టిన మంత్రులు' !

శాసనమండలి సమావేశాల చివరి రోజైన శుక్రవారం చైర్మన్ స్వామిగౌడ్ జూబ్లీహాలు ప్రాంగణంలో మంత్రులు, సభ్యులతో ఫొటోషూట్ ఏర్పాటు చేయిం చారు.

హైదరాబాద్: శాసనమండలి సమావేశాల చివరి రోజైన శుక్రవారం చైర్మన్ స్వామిగౌడ్ జూబ్లీహాలు ప్రాంగణంలో మంత్రులు, సభ్యులతో ఫొటోషూట్ ఏర్పాటు చేయిం చారు. మండలి చైర్మన్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ సభ్యులంతా ఫొటోలు దిగడానికి వచ్చారు. మిట్ట మధ్యాహ్నం కావడంతో  దానికితోడు అంతా ఎదురెండకు కూర్చోవడంతో.. ఎండతీవ్రత, వెలుతురుకు కళ్లు మూతపడకుండా ఉండడానికి నానా తంటాలు పడ్డారు.

హరీశ్‌రావు మధ్యలో ఓసారి లేచి, మళ్లీ కూర్చున్నారు. ఈ సమయంలో ఎండ తీవ్రతకు ఈటెల, హరీశ్‌రావు కళ్లలో నీళ్లు వచ్చాయి. త్వరగా ఫొటోలు దిగి లాబీల్లోకి వచ్చిన మంత్రి ఈటెల.. ‘సూర్యుడి కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం ఎవరు చేస్తారు.’ అని సరదాగా అన్నారు. వెంటనే కొందరు మీడియా ప్రతినిధులు.. ‘కన్నీళ్లు పెట్టుకున్న మంత్రులు..’ అనడంతో నవ్వులు పూశాయి.


గ్రాఫిక్స్‌లో కలిపేస్తే సరి..
మంత్రులు, ఎమ్మెల్సీలంతా ఫొటోలు దిగేట ప్పుడు.. పదవీకాలం త్వరలో ముగియబోతున్న పలువురు ఎమ్మెల్సీలు ముందు వరుసలో చైర్మన్, మంత్రులు, విపక్షనేత డీఎస్‌తో కుర్చీల్లో కూర్చున్నారు. మిగతా ఎమ్మెల్సీలు వెనుక నిలబడ్డారు. అయితే ఈ గ్రూప్ ఫొటో తీసే సమయంలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్, పొంగులేటి సుధాకరరెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు అక్కడలేరు. టీ బ్రేక్ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వెళ్లిన వారంతా.. ఫొటోలు తీయడం పూర్తయ్యాక వచ్చారు. దీంతో ఈ ముగ్గురూ విడిగా ఫోటో దిగారు.ప్రస్తుతం మారిన సాంకేతిక యుగంలో విడిగా తీసిన ఫొటోలను కూడా గ్రూపు ఫొటోలో జత చేయవచ్చని ఫోటోగ్రాఫర్ చెప్పడంతో.. తమ ఫోటోలనూ అందు లో కలపాలని చెప్పారు. ‘ఆఖరిరోజు సీఎం ఎలాగూ రాలేదు.. ఆయన ఫొటోను కూడా కలపవయ్యా..’ అని టీడీపీ సభ్యుడు అరికెల నర్సారెడ్డి అనడంతో అందరూ నవ్వేశారు.
 

17 మంది ఎమ్మెల్సీలకు వీడ్కోలు
పదిమంది శాసనమండలి సభ్యుల పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. మరో ఏడుగురు సభ్యుల పదవీకాలం మే ఒకటో తేదీతో ముగియనుంది. ఈ పది హేడు మంది శాసనమండలి సభ్యులకు మం డలి చివరిరోజు శుక్రవారం వీడ్కోలు పలికారు. డి.శ్రీనివాస్‌తో పాటు కె.ఆర్.ఆమోస్, నాగపురిరాజలింగం, కె.యాదవరెడ్డి, నేతి విద్యాసాగర్, వి.భూపాల్‌రెడ్డి ,భానుప్రసాద్‌రావు, ఎస్.జగదీశ్వర్‌రెడ్డి రిటైరయ్యే వారిలో ఉన్నారు.


వీరితో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, బోడకుంటి వెంకటేశ్వర్లు, పి.నరేందర్‌రెడ్డి, పొట్ల నాగేశ్వర్‌రావు, పీర్‌షబ్బీర్ అహ్మద్, అరికెల నర్సారెడ్డి, డాక్టర్ కె.నాగేశ్వర్, కపిలవాయి దిలీప్‌కుమార్, బి.వెంకట్రావుల ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తోంది. మార్చి 29న కొందరు, మే ఒకటో తేదీన మరికొందరు.. మొత్తంగా నెల రోజుల వ్యవధిలోనే పదిహేడుమంది సభ్యులు మాజీలుగా మారుతున్నారు. కాగా, ఇటీవలే ముగిసిన పట్టభద్రుల నియోజక వర్గ ఎన్నికల్లో విజయం సాధించిన రామచందర్‌రావు (బీజేపీ), పల్లారాజేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్)లు కొత్త సభ్యులుగా వచ్చే సమావేశాలకు హాజరు కానున్నారు. మళ్లీ సమావేశాలు జరిగే నాటికి అటు ఎమ్మెల్యే కోటా, ఇటు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement