ప్రాజెక్ట్ కోసం వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.960 కోట్లు ఖర్చు చేసింది వాస్తవం కాదా?
హైకోర్టు, ఎన్జీటీ కేసులు ఎవరి హయాంలో అధిగమించారు?
మీడియా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన మంత్రులు బీసీ, కింజరాపు
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వేసిన ప్రశ్నలకూ జవాబివ్వలేక కస్సుబుస్సు
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు నీళ్లు నమిలారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దాటవేత ధోరణి అవలంబించారు. సచివాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌కు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని భజన చేశారు. ఈ విషయం చిన్న పిల్లాడిని నిద్రలో లేపి అడిగినా చెబుతాడని ప్రగల్భాలు పలికారు. దీంతో మీడియా ప్రతినిధులు కల్పించుకుని ‘ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన వారికి పునరావాసం, భూసేకరణ కోసం గత ప్రభుత్వంలో రూ.960 కోట్లు ఖర్చు చేశామని వైఎస్సార్‌సీపీ చెబుతోంది.’ వాస్తవం కాదా? అని మీడియా ప్రశి్నంచగా మంత్రులు నీళ్లు నమిలారు.
ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై హైకోర్టు, ఎన్జీటీల్లో కేసులను ఎవరి హయాంలో అధిగమించారు? అన్న ప్రశ్నకు సమాధానం దాట వేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం గత ప్రభుత్వంలోనే పూర్తయినట్టు ప్రతిపక్షం చెబుతోందని మీడియా ప్రస్తావించగా అచ్చెన్నాయుడు కస్సుబుస్సులాడారు. వాస్తవాలను అంగీకరించలేక మాజీ సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణకు దిగారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత అంతా బాబుకే దక్కాలన్నారు. సీమ ఎత్తిపోతల పథకంపై మీడియా వేసిన ప్రశ్నలతో అచ్చెన్నాయుడు అసహనానికి గురయ్యారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చంద్రబాబుతో మాట్లాడి ఆపించేశానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని దీనిపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రతినిధులు అచ్చెన్నను ప్రశ్నించగా ‘వెళ్లి ఆయన్నే అడుక్కోండి’ అని వారిపై కస్సుమన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తమకు లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన వెంటనే చంద్రబాబు సీమ ద్రోహి అని రాసేస్తారా? అంటూ చిందులు తొక్కారు.


