సాయుధపోరాట యోధుడు యాదగిరిరెడ్డి ఇకలేరు

CPI Senior Leader Yadagiri Reddy Is No More - Sakshi

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఐ నేత

సాక్షి, హైదరాబాద్‌/యాదాద్రి: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి (88) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్వగ్రామమైన సుద్దాలలో ఉంటున్న ఆయనకు 4రోజుల క్రితం జ్వరం రావడంతో చికిత్స చేయించుకునేందుకు హైదరాబాద్‌లోని తన కుమారుడి వద్దకు వచ్చారు. శుక్రవారం ఓవైసీ ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే గుండెపోటుతో మరణించారు. ప్రజల సందర్శనార్థం యాదగిరిరెడ్డి భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం మఖ్దూం భవన్‌కు తీసుకొచ్చారు. పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.

ఆయనకు భార్య యాదమ్మ, కుమారులు రాజశేఖరరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కుమార్తెలు రాజమణి, భారతి ఉన్నారు. మఖ్దూంభవన్‌లో ఆయన పార్థివదేహంపై పార్టీ నాయకులు సురవరం సుధాకర్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, కె.రామకృష్ణ తదితరులు అరుణ పతాకాన్ని కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. యాదగిరిరెడ్డి పార్థివదేహాన్ని శుక్రవారం రాత్రి స్వగ్రామమైన సుద్దాలకు తరలించారు. శనివారం ఉదయం 11గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు తెలిపారు.

సాయుధ పోరాటం నుంచి రాజకీయాల్లోకి.. 
ఉమ్మడి నల్లగొండ జిల్లా సుద్దాల గ్రామంలో గుర్రంరామిరెడ్డి, మల్లమ్మ దంపతులకు 1931 ఫిబ్రవరిలో యాదగిరిరెడ్డి జన్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన యాదగిరిరెడ్డి బాల్యంలోనే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పని చేశారు. 15 ఏళ్ల వయసులో గుత్ప దళంలో పనిచేశారు. గ్రామానికి చెందిన ప్రజా వాగ్గేయకారుడు తెలంగాణ పోరాట యోధుడు సుద్దాల హన్మంతు వెంట నడిచారు. సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావినారాయణరెడ్డి నేతృత్వంలో భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభకు హాజరయ్యారు. సాయుధ పోరాటంలో రాచకొండ సూర్యనారాయణ దళం లో పనిచేశారు.

అప్పటి ప్రభుత్వ పోలీసుల కాల్పు ల్లో దళంలోని ముగ్గురు సభ్యులు చనిపోగా, యాదగిరిరెడ్డి ఒక్కరే బయటపడ్డారు. కట్కూరి రామచంద్రారెడ్డి నాయకత్వంలో భూ పోరాటాల్లో పాల్గొని రామన్నపేట పరిధిలో 600 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుంచి యాదగిరిరెడ్డి 1985, 1989, 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రైతాంగ సమస్యలు, రైతు కూలీ సమస్యలపై పోరాడారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో అప్పట్లో వెలుగు చూసిన రూ.3 కోట్ల కుంభకోణంపై శాసనసభలో లేవనెత్తి విచారణ చేయించారు. నీతి, నిజాయితీతో పార్టీ నియమావళికి అనుగుణంగా పని చేస్తూ అతి సాధారణ జీవితాన్ని గడిపారు.

సీఎం కేసీఆర్‌ సంతాపం... 
గుర్రం యాదగిరి రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సంతాపం తెలిపారు. యాదగిరిరెడ్డి నిరాడంబరుడనీ, చివరి వరకూ సీపీఐ  సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top