బంగారు కాదు.. అప్పుల తెలంగాణ

CPI leader chada venkat reddy criticize KCR government  - Sakshi

సీపీఐ 21వ నల్లగొండ జిల్లా మహాసభల ప్రారంభసభలో చాడ

ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సమాయాత్తం కావాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో పునాదులు వేయాలని శ్రేణులకు పిలుపు

నల్లగొండ టౌన్‌ : ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయం చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అప్పుల తెలంగాణగా మార్చాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని బొడ్డుపల్లి రామశర్మ ప్రాంగణంలో నిర్వహించిన సీపీఐ నల్లగొండ జిల్లా 21వ మహాసభలను ఆయన జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రం లో అసమర్ధత, ఆహంకార పూరిత పాలన సాగుతుం దని విమర్శించారు. ప్రభుత్వం అక్రమార్కులు భూ ములను కబ్జా చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.

గోదావరి, కృష్ణా జలాలతో రాష్ట్రాన్ని సస్యశామలం చేస్తామన్న హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాల ఊసే లేదన్నారు. ప్రజా సమస్యలను విస్మరించి ముఖ్యమంత్రి ప్రగతిభవన్, ఫాంహౌజ్‌కు మాత్రమే పరిమితమయ్యాదని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడిని తేవడానికి సీపీఐ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం ఉద్యమించాలన్నారు. వ్యవసాయ సంక్షోభంపై పార్టీ రాష్ట్ర మహాసభల్లో చర్చించి.. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో ప్రజలతో చర్చించి వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి బలమైన పునాదులను వేయాలని.. ఎక్కువ స్థానాలను గెలుచుకునేందుకు కృషి చేయాలని అన్నారు. నల్లగొండకు ఉద్యమ నేపథ్యం ఉందని.. తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ జిల్లా మహాసభలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తొలుత ఇటీవల జిల్లాలో మృతిచెందిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటిం చారు. అనంతరం జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి తన నివేదకను ప్రవేశపెట్టడంతో పాటు పార్టీ 27 మండలాల మహాసభలు, కమిటీల నివేదికను రాష్ట్ర కార్యదర్శికి అందజేశారు.

మహాసభకు నెల్లికంటి సత్యం, పల్లా దేవేందర్‌రెడ్డి, ఎల్‌.శ్రవన్‌కుమార్‌ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లెపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని రత్నాకర్‌రావు, సృజన, ఉజ్జిని యాదగిరిరావు, గుజ్జ రామచంద్రం, నర్సింహారెడ్డి, వీరస్వామి, అంజిరెడ్డి, అంజా నాయక్, పొదిలి శ్రీనివాస్, పి.వెంకటేశ్వర్లు, బరిగల వెంకటేశ్, నూనె రామస్వామి పాల్గొన్నారు.

పట్టణంలో భారీ బైక్‌ర్యాలీ..
మహాసభల సందర్భంగా సీపీఐ కార్యకర్తలు పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బొడ్డుపల్లి రామశర్మ ప్రాం గణం నుంచి ప్రారంభమైన ర్యాలీ గడియారం సెంటర్,  రామగిరి ప్రకాశం బ జార్, భాస్కర్‌టాకీస్, దేవరకొండ రో డ్డుమీదుగా మహాసభల ప్రాంగణానికి చేరుకుంది. ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top