అత్యవసరమైతేనే బయటకు రండి..

Covid 19: Telangana Government Issues Guidelines To Public - Sakshi

కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం

ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి.. ప్రభుత్వ ఆఫీసులకు రావొద్దు: ఈటల

ప్రజలు టూర్లు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లొద్దు.. విదేశాల్లోని వారు రావొద్దు

సాక్షి, హైదరాబాద్‌: ‘కోవిడ్‌ వైరస్‌ ఆషామాషీగా లేదు. తేలిగ్గా తీసుకోవద్దు. అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లలోంచి బయటకు రావొద్దు. ప్రజలు సాధారణ పనుల కోసం పది, పదిహేను రోజులపాటు ప్రభుత్వ కార్యాలయాలకు రావడం మానుకోవాలి. మసీదులు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలకు వెళ్లకూడదు. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి’ అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. గల్ఫ్‌ దేశాల్లోని మసీదుల్లో నమాజు చేసుకోకూడదని, ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ఆదేశించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. శ్రీరామనవమిని లక్షలాది మందితో నిర్వహించేవారమని, అలాంటిది ఇప్పుడు కేవలం గుడికే పరిమితం చేశామని ఆయన పేర్కొన్నారు. 

చేయి దాటితే ఇంకేం చేయలేం..
ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలని, పరిస్థితి చేయిదాటితే ఇంకేమీ చేయలేమని మంత్రి ఈటల చెప్పారు. మనిషి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. ప్రజల క్షేమం కోసమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కోవిడ్‌ వైరస్‌ దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ బుధవారం విలేకరులతో మాట్లాడారు. నిన్నా మొన్నటివరకు సాధారణంగా మాట్లాడిన ఆయన.. ఇప్పుడు మాత్రం పరిస్థి తి తీవ్రతను మీడియా ముందుంచారు. పాఠశాలలు, కాలేజీలు, ఇతర కోచింగ్‌ సెంటర్లు, థియేటర్లు తదితరమైన వాటిని మూసేశామ ని, ఈ పరిస్థితుల్లో ప్రజలు టూర్లు పెట్టుకోవద్దని విన్నవించారు. చుట్టాల ఇళ్లకు, పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లొద్దన్నారు. 

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను కలిసేందు కు రావొద్దని స్పష్టం చేశారు. పిల్లలను మాల్స్‌ కు, పార్కులకు, చుట్టాల ఇళ్లకు తీసుకెళ్లవద్దని, వారిని ఇళ్లలోనే జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఎవరి ఇళ్లలో వారు ఉండాలని, పత్రికలు, టీవీల్లో ప్రభుత్వం ఇచ్చే సూచనల ను పాటించాలని ఆయన వేడుకున్నారు. అం దరూ అప్రమత్తంగా ఉండాలని, తేలిగ్గా తీసుకోవద్దన్నారు. ఆషామాషీగా తీసుకోవడం వల్ల ఇటలీలో ఏం జరుగుతుందో అందరం చూస్తున్నామన్నారు. అమెరికాలో కర్ఫ్యూ వాతావర ణం నెలకొందన్నారు. ఆ దేశం అనేక కార్యకలాపాలను నిషేధించిందన్నారు. పెళ్లిళ్లు ముం దుగా నిర్ణయించుకున్నందున 200 మంది కం టే ఎక్కువ మందితో చేయొద్దని సూచించారు. 

ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి..
ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఐటీ కంపెనీలు, ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాల్లో శానిటైజర్లు, సోప్‌లు అందుబాటులో ఉంచాలని ఈటల చెప్పారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని.. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే తప్ప, వైరస్‌ సోకే అవకాశమే ఉండదన్నారు. బస్సులు, రైళ్లల్లో ప్రయాణించాల్సి వస్తే మనిషికి మనిషికి దూరం పాటించాలన్నారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది సెలవులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు మంత్రి ఈటల ప్రకటించారు. వయసు పైబడిన వారు, బీపీ, షుగర్, కిడ్నీ, గుండె వ్యాధులున్న వారికే ఈ వైరస్‌తో ప్రమాదమన్నారు. తీవ్రతను బట్టి పక్క రాష్ట్రాలతో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌ పోస్టుల వద్ద తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

టెన్త్‌ సహా ఏ బోర్డు ఎగ్జామ్స్‌ రద్దు చేయలేదు..
రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మందికి ఒక ఆశ వర్క ర్‌ ఉన్నారని, అలాగే గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలు, ఇతర ఉద్యోగులు ఉన్నారని మంత్రి ఈటల తెలిపారు. వీరంతా అప్రమత్తమైతే కోవిడ్‌ వైరస్‌ను కట్టడి చేయవచ్చన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారన్న దానిపై ఆరా తీయాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో కాంటాక్ట్‌ ఉన్నవారిని, విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించాలని ఆయన వారికి విన్నవించారు. రిటైర్డ్‌ డాక్టర్లు, ఇతర సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఇప్పటివరకు ఏ డాక్టర్, నర్సుకు కూడా కోవిడ్‌ పాజిటివ్‌ సోకలేదన్నారు. పదో తరగతి పరీక్షలు సహా ఎటువంటి బోర్డు ఎగ్జామ్స్‌ రద్దు చేయలేదని తెలిపారు. 

25 వేల మందిని క్వారంటైన్‌ చేసేలా ఏర్పాట్లు...
కోవిడ్‌ నేపథ్యంలో ముందస్తు అంచనాతో 25 వేల మందిని కూడా క్వారంటైన్‌ చేసేలా ఏర్పాట్లు చేశామని మంత్రి ఈటల వెల్లడించారు. ఒక్కో క్వారంటైన్‌ కేంద్రానికి ఒక డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఉంటారన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ క్వారంటైన్‌ కేంద్రాలు ఆయా జిల్లాల్లో నడుస్తాయన్నారు. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్న దానిపై నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇప్పటికే వికారాబాద్‌ హరిత హోటల్, హైదరాబాద్‌ దూలపల్లిలోని ఫారెస్ట్‌ అకాడమీని ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో సైబరాబాద్‌ కమిషనర్, మరో ఇద్దరు ఐఏఎస్‌లను నియమించామన్నారు. వారు అక్కడ పర్యవేక్షణ చేస్తారన్నారు. ఎయిర్‌పోర్టు వద్ద 40 బస్సులు సిద్ధంగా ఉంచామన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్‌కు తరలించేందుకు ఈ ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చే వారిని గుర్తిస్తున్నామన్నారు. క్వారంటైన్‌లో ఉండేవారెవరూ బయటకు వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

కోవిడ్‌పై ముఖ్యమంత్రి సమీక్ష... 
కోవిడ్‌కు యంత్రాంగం చేపడుతున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం సమీక్ష నిర్వహించారని ఈటల తెలిపారు. కోవిడ్‌ నియంత్రణకు తీసుకునే ఏర్పాట్లలో ఏ మాత్రం సీరియస్‌నెస్‌ తగ్గకూడదని సీఎం ఆదేశించారన్నారు. 24 గంటలూ పనిచేయాలని సీఎం సూచించారన్నారు. ప్రభుత్వ యంత్రాం గం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారని చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కూడా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారన్నారు. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నివేదిక ప్రకారం కోవిడ్‌ వైరస్‌ ఇప్పటివరకు విదేశాల నుంచి మాత్రమే వచ్చిందని, వారితో అనుబంధంగా ఉన్నవారికి మాత్రమే సోకిం దని నివేదిక ఇచ్చిందని తెలిపారు. అంటే స్థాని కంగా సామూహికంగా ప్రజల్లోకి వైరస్‌ సోకలేదని ఐసీఎంఆర్‌ పేర్కొందని వివరించారు.

వెయ్యి మందికి వచ్చినా  చికిత్స చేసేలా ఏర్పాట్లు..
రాష్ట్రంలో వెయ్యి మందికి కోవిడ్‌ వచ్చినా చికిత్స చేసేలా.. 5 వేల మందిని సైతం ఐసోలేషన్‌లో ఉంచేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటివరకు ఆరు పాజిటివ్‌ కేసుల్లో ఐదు కేసులకు చెందిన వారి కుటుంబాలకు నెగెటివ్‌ వచ్చిందన్నారు. గుల్బర్గా కేసుకు సంబంధించిన వ్యక్తి మృతి చెందగా, ఆయన అంత్యక్రియలకు ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్లారన్నారు. వారిని పరీక్షించగా, వారికి కూడా నెగెటివ్‌ వచ్చిందన్నారు. జిల్లాల్లోనూ ఐసీయూలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఎస్‌ ఆధ్వర్యంలోని కమిటీ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి తగు ఆదేశాలు ఇచ్చిందని వెల్లడించారు. విలేకరుల సమా వేశంలో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మన దేశ ప్రజలకు ద్రోహం చేసినట్లే..
ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విదేశా ల్లో ఉన్న భారతీయులు ఇక్కడకు రావొద్దని మంత్రి ఈటల సూచించారు. ఆయా దేశాల్లో నే అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో క్వారంటైన్‌ కావాలని, వారు ఏర్పాటు చేసే కేంద్రాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైరస్‌ తీ వ్రంగా ఉన్న దేశాల నుంచి ఇక్కడకు వస్తే, ఇక్కడి ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అం తర్జాతీయ విమానాశ్రయాలన్నింటినీ మూ సేయాలని తాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కోరినట్లు తెలిపారు.

ఒకవేళ అత్యవసరమైన వారు వస్తే, వారిని ఢిల్లీలో క్వారంటైన్‌ చేయాలని కేంద్రానికి సూచించినట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఆయా దేశాల్లోని వారికి అన్ని ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ విషయాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. అంతేకాదు అక్కడి ప్రభుత్వాలు ఏం చేయాలన్న దానిపై కేంద్రం సరైన సూచనలు చేస్తుందన్నారు. కొందరు విదేశాల నుంచి వచ్చి దాచిపెడుతున్నారని, ఇది మన దేశ ప్రజలకు ద్రోహం చేసినట్లు లెక్కేనని మంత్రి తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.

చదవండి:
ఆ బ్లడ్‌ గ్రూపు వాళ్లు తస్మాత్‌ జాగ్రత్త!

ప్లీజ్‌ .. పెళ్లికి అనుమతించండి..

రాష్ట్రంలో హై అలర్ట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top