ప్లీజ్‌ .. పెళ్లికి అనుమతించండి..

Corona Virus Effect To wedding Of A Young Man from US  - Sakshi

అమెరికా నుంచి వచ్చిన అబ్బాయి

చావు బతుకుల్లో పెళ్లి కుమారుడి తండ్రి

పెళ్లి ఆపాలంటున్న అధికారులు, అనుమతించాలంటున్న పెళ్లివారు

సాక్షి, యాదాద్రి: చావుబతుకుల మధ్య ఉన్న తండ్రి కళ్ల ముందే పెళ్లి చేసుకోవాలన్న తపనతో అమెరికా నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా వైరస్‌ దెబ్బ పడింది. ఈ పెళ్లి వాయిదా వేసుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తుం డగా.., అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం.. పెళ్లి ఎలా ఆపగలమని పెళ్లివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. వలిగొండకు చెందిన యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి పోచంపల్లి మండలానికి చెందిన యువతితో ఏడాది క్రితం పెళ్లి నిశ్చయమైంది. కాగా, పెళ్లి కుమారుడి తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఏప్రిల్‌లో జరగాల్సిన పెళ్లిని మార్చి 20వ తేదీకి మార్చారు. దీంతో పెళ్లి కుమారుడు అమెరికా నుంచి నాలుగు రోజుల క్రితం అబుదాబి మీదుగా ఇండియాకు చేరుకొని స్వగ్రామమైన వలిగొండకు వచ్చాడు. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు.

అయితే కోవిడ్‌ ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమెరికా నుంచి వచ్చిన ఆ యువకుడు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అవేవీ పట్టించుకోకుండా శుభలేఖలు పంచుతూ హడావుడిగా ఉన్నాడు. పెళ్లి పత్రికలను తెలిసిన ప్రజాప్రతినిధులకు కూడా పంచారు. అయితే ఈ విషయం అధికారుల వద్దకు చేరడంతో వెంటనే రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి పెళ్లి వాయిదా వేసుకోవాలని ఆదేశించారు. లక్షల రూపాయల అడ్వాన్స్‌లు ఇచ్చి పెళ్లి పనులు ప్రారంభించామని, ఎలాగైనా పెళ్లికి అనుమతి ఇవ్వాలని రెండు కుటుంబాల వారు అధికారులను వేడుకుంటున్నారు. ఈ లోపు పెళ్లి కుమారుడికి పరీక్షలు నిర్వహించడంతో కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఈ వ్యవహారంపై అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top