నేడు కీలక భేటీ

Covid 19: CM KCR To Hold Emergency Meeting On Thursday - Sakshi

మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్‌ అత్యున్నత స్థాయి సమావేశం

కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భేటీలో విస్తృత చర్చ

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ పిలుపు

విదేశాల నుంచి వచ్చేవారికి సంపూర్ణ వైద్య పరీక్షలు తప్పనిసరి

ప్రజలు గుమిగూడే అన్నికార్యక్రమాల రద్దుకు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గురువారం ప్రగతిభవన్‌లో అత్యవసర, అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలను ఆహ్వానించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

ఇండోనేసియా నుంచి కరీంనగర్‌ వచ్చిన కొందరు విదేశీయులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియడంతో రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పాటించాల్సిన నియంత్రణ పద్ధతులను గురువారం నాటి సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతున్నందున, వారు సంపూర్ణ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తమై ప్రభుత్వానికి సమాచారం అందించాలని, స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన ఎవరినైనా సరే సంపూర్ణ పరీక్షలు జరిపిన తర్వాతే ఇళ్లకు పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు.

మరిన్ని నియంత్రణ చర్యలు
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అంశాల్లో 15 రోజుల కార్యాచరణ, మరికొన్ని అంశాల్లో వారం రోజుల కార్యాచరణ ప్రకటించి అమలు చేస్తోంది. గురువారం అత్యవసర సమావేశం నిర్వహించి మరిన్ని నియంత్రణ చర్యలు ప్రకటించే అవకాశముంది. రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడే కార్యక్రమాలన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయించింది. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకుని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, జనం ఒకేచోట గుమిగూడొద్దని సీఎం పిలుపునిచ్చారు. 

చదవండి:
ప్లీజ్‌ .. పెళ్లికి అనుమతించండి..

రాష్ట్రంలో హై అలర్ట్‌

మన దేశ ప్రజలకు ద్రోహం చేసినట్లే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top