సింగపూర్‌లో ఉద్యోగాలంటూ టోకరా

 Couple held in job fraud racket - Sakshi

వ్యాపారంలో ఆర్థికంగా నష్టాలు రావడంతో దంపతుల   మోసాల బాట 

నగరానికి చెందిన యువతికి ఏడు లక్షలపైనే కుచ్చుటోపీ 

బాధితురాలి ఫిర్యాదుతో అరెస్టు చేసిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 

సాక్షి, సిటీబ్యూరో:  సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన కేసులో దంపతులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా నిందితుల మాటలు నమ్మి రూ.7.65 లక్షలు బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసి మోసపోయానట్టు నగరానికి చెందిన రమ్య రశ్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు మణికొండలో ఉంటున్న నిందితులు శృతి, నవీన్‌కుమార్‌లను అరెస్టు చేశారు. క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా తెలిపిన మేరకు.. మిర్యాలగూడలో టైర్, లారీ రవాణా వ్యాపారంలో భార్యభర్తులు  శృతి, నవీన్‌కుమార్‌ ఆర్థికంగా చితికిపోయారు. దీంతో నగరానికి వచ్చారు.

 భర్త నవీన్‌ కుమార్‌ ఓ దినపత్రికలో ప్రకటనలో విభాగంలో పనిచేసి ఇటీవలే మానేశాడు. భార్య శృతి ప్రైవేట్‌ టీచర్‌గా పనిచేసింది. నవీన్‌ కుమార్‌ గోవాకు వెళ్లిన సమయంలో బాధితురాలు రమ్య రశ్మీతో పరిచయం ఏర్పడింది. విదేశాల్లో ఉద్యోగాలుంటే చూడమని కోరింది. అప్పటికే గతేడాది జూన్‌లో శృతి నాయుడు స్టడీ వీసాపై సింగపూర్‌కు వెళ్లి ప్రైవేట్‌ ఉద్యోగం చేసి నవంబర్‌లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చేసింది. అయితే ఆర్థికంగా అన్నివిధాలా చతికిలబడిన శ్రుతి నాయుడు ఈ ఏడాది మార్చిలో రమ్మ రశ్మీని ఫేస్‌బుక్‌ ద్వారా సంప్రదించింది. 

సింగపూర్‌లో తన చిన్నాన్న కుమారుడు రెస్టారెంట్‌ నడుపుతున్నాడని శృతి మాటలతో నమ్మించింది. అక్కడ ఉద్యోగం కావాలనుకునేవారికి ఇప్పిస్తానని, ఒక్కొక్కరికి రూ.నాలుగు లక్షల ఖర్చు అవుతుందంటూ చెప్పింది. అయితే నాతో పాటు నా భర్తకి కూడా ఉద్యోగం కావాలంటూ చెప్పడంతో అందుకు సరేనన్న శృతి నాయుడు 20 రోజుల వ్యవధిలో ఇప్పిస్తానంటూ నమ్మించింది. నెలకు 2,500 సింగపూర్‌ డాలర్ల జీతం ఉంటుందని వాట్సాప్‌ నంబర్‌ ద్వారా చాట్‌చేసిన శృతి నాయుడు ఆ ఉద్యోగం కోసం డబ్బులివ్వాలంటూ నాలుగు బ్యాంక్‌ ఖాతాలను పంపించింది. 

ఆ వెంటనే 20 రోజుల వ్యవధిలో సింగపూర్‌కు వీసాతో పాటు విమాన టికెట్లు కూడా పంపిస్తామని చెప్పింది. కొన్నిరోజులు కాగానే నకిలీ వీసా డాక్యుమెంట్లు, నకిలీ విమాన టికెట్లను బాధితురాలి మెయిల్‌కు పంపడంతో విచారణ చేయగా అవి నకిలీవని తేలింది. ఈ మేరకు బాధితురాలు రమ్య రశ్మీ సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఈ నెల 2న  ఫిర్యాదుచేసింది. బాధితురాలిచ్చిన బ్యాంక్‌ ఖాతాలు. వాట్సాప్‌ నంబర్‌ సహకారంతో నిందితులు శృతి నాయుడు, నవీన్‌ కుమార్‌లు మణికొండలో ఉన్నట్టుగా గుర్తించి అరెస్టు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top