‘కౌంట్‌’డౌన్‌

Countdown Starts For Lok Sabha Elections Counting - Sakshi

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

హైదరాబాద్‌ జిల్లాలో 14 కేంద్రాల్లో కౌంటింగ్‌  

ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14 టేబుళ్లు

జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు

సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందికి రెండు విడతల శిక్షణ కార్యక్రమాలతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం. దానకిశోర్‌ తెలిపారు. ఈనెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగే విషయం తెలిసిందే. లెక్కింపు పనులకు అవసరమైన సిబ్బందితో పాటు మరో 20 శాతం మంది రిజర్వులో ఉంచినట్టు ఆయన వివరించారు. జిల్లా పరిధిలోని రెండు లోక్‌సభ స్థానాల్లో వెరసి 14 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను 14 కేంద్రాల్లో లెక్కించనున్నారు. ఒక్కో సెగ్మెంట్‌ ఓట్లు లెక్కించేందుకు 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు. 

ఆర్‌ఓల సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు
ఓట్ల లెక్కింపులో తొలుత ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారని దానకిశోర్‌ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలోని పోస్టల్‌ బ్యాలెట్లను సదరు  నియోజకవర్గాల  రిటర్నింగ్‌ అధికారులైన హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో పరిశీలకుల సమక్షంలో లెక్కిస్తారని వివరించారు. హైదరాబాద్‌ పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు నిజాం కాలేజీలోను, సికింద్రాబాద్‌ ఓట్ల లెక్కింపు ప్రొఫెసర్‌ జి. రామిరెడ్డి దూర విద్యాకేంద్రంలో ఉంటాయన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి గందరగోళానికి తావులేకుండా, పొరపాట్లకు ఆస్కారం లేకుండా లెక్కింపు సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు.

ఇందులో భాగంగా తొలి విడత శిక్షణ కార్యక్రమం గురువారం సికింద్రాబాద్‌ హరిహర కళాభవన్‌లో జరిగింది. తొలివిడత శిక్షణ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా రెండు నియోజకవర్గాలకు వెరసి రెండు బ్యాచ్‌లుగా జరగ్గా, 22వ తేదీన నిర్వహించే రెండో విడత శిక్షణలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 14 బ్యాచ్‌లకు శిక్షణ ఉంటుందన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లకు ఓట్ల లెక్కింపు సిబ్బందిని కేటాయించేందుకు 22వ తేదీ ఉదయం 6 గంటలకు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ర్యాండమైజేషన్‌ జరుగుతుందని వివరించారు. 23వ తేదీన లెక్కింపు కేంద్రంలో ఏ టేబుల్‌కు ఎవరిని నియమించాలో కూడా ర్యాండమైజేషన్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారన్నారు. అనంతరం 8.30 నుంచి అసలు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్‌లను లెక్కించనున్నట్లు ఆయన తెలిపారు. సంబంధిత అసెంబ్లీ సెగ్మెంట్‌ ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే వీవీప్యాట్‌ స్లిప్‌లను ప్రత్యేక చాంబర్‌లో లెక్కిస్తారని తెలిపారు. 

జిల్లాలో ఓట్ల లెక్కింపు ఇలా..
కౌంటింగ్‌ సెంటర్లు: 14
ఒక్కో సెంటర్‌లో టేబుళ్లు: 14  
ఒక్కో టేబుల్‌ వద్ద ఒక కౌంటింగ్‌సూపర్‌వైజర్, కౌంటింగ్‌ అసిస్టెంట్‌తో పాటు ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు.
మొత్తం కౌంటింగ్‌ సిబ్బంది: 588
వీరితో పాటు మరో 20 శాతం మందిరిజర్వులో ఉంటారు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top