ఆగని అవినీతి..! | Corruption In Sub Registrar Office Nizamabad | Sakshi
Sakshi News home page

ఆగని అవినీతి..!

Feb 2 2019 9:59 AM | Updated on Feb 2 2019 9:59 AM

Corruption In Sub Registrar Office Nizamabad - Sakshi

బాన్సువాడలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన కొనుగోలుదారులు 

బాన్సువాడ: రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ విధానంతోనూ అవినీతికి చెక్‌ పడడం లేదు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అమ్మకందారు, కొనుగోలుదారుకు మధ్య జరిగే ఒప్పం దం, రిజిస్ట్రేషన్‌ తంతు మొత్తం వీడియో కెమెరాల్లో బంధించి, వాటి సీడీలను కొనుగోలుదారుకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా ప్రి రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్లు వెబ్‌సైట్‌లో పెట్టడం తదితర చర్యలు చేపట్టింది. ఈ మేరకు గతేడాది ఉమ్మడి జిల్లాలోని 9 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ సీసీ కెమెరాలను బిగించారు.

ఆస్తులను కొనుగోలు చేసిన వ్యక్తులు మీ సేవ కేంద్రంలో వివరాలు నమోదు చేసి, స్లాట్‌ బుక్‌ చేసుకొన్న తర్వాత నిర్ణీత తేదీలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్ళి తమ పేరిట డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ శాఖ ఆస్తుల వివరాలను, మార్కెట్‌ విలువను, స్టాంప్‌ డ్యూటీని, అమ్మకం దస్తావేజులను, స్థిరాస్థి విక్రయం, గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్లను, ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికేట్లను ఉంచడంతో ప్రజలకు సౌకర్యంగా మారింది. అయితే కొందరు సబ్‌ రిజిస్ట్రార్ల నిర్లక్ష్యంతో సీసీ కెమెరాల నిర్వహణ సరిగా జరగడం లేదు. క్రయవిక్రయాల సీడీలను అందించడం లేదు. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం సదుద్దేశంతోనే చర్యలు చేపట్టింది. అయితే దస్తావేజు లేఖరులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
 
యథేచ్ఛగా కార్యకలాపాలు 
అధికారులు, దళారుల మధ్య ఉన్న అవగాహన కారణంగా నిఘా కొరవడుతోంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నా, అవినీతి మాత్రం ఆగడం లేదు. వీరు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో యథేచ్ఛగా తిరుగుతూ దరఖాస్తుదారుడికి, అధికారులకు మధ్య మంతనాలు జరిపి, అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. దస్తావేజు లేఖరులు లేనిదే రిజిస్ట్రేషన్‌ తతంగం పూర్తి కావడం లేదు. సబ్‌ రిజిస్ట్రార్లు స్పందిస్తేనే మధ్యవర్తులను నియంత్రించవచ్చు. నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి పట్టణాల్లోన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద ఉదయం 9 గంటలకే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వచ్చి సాయంత్రం 5గంటల వరకు మధ్యవర్తులు అక్కడే తిష్టవేస్తున్నారు.

 అధికారులు, కొనుగోలుదారులకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. డాక్యుమెంట్‌ రైటర్లు దస్తావేజులను తయారు చేసి ఇవ్వడం వరకే పని చేయాలి. అయితే అధికారుల వద్దకు తమ డాక్యుమెంట్లు తీసుకెళ్తూ యథేచ్ఛగా తమ పని చేస్తున్నారు. తమ ద్వారా వెళితేనే ఫలానా సబ్‌ రిజిస్ట్రార్‌ సంతకాలు చేస్తారని, లేకుంటే మీ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయని తమవైపు తిప్పుకొంటున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాలతో పాటు బాన్సువాడ, బోధన్, బిచ్కుంద, ఎల్లారెడ్డి, ఆర్మూర్‌ పట్టణాల్లో ప్రస్తుతం ప్లాట్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే కొత్తగా స్థలాలు కొన్న, అమ్మినవారు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే అమ్యామ్యాలు ఇవ్వనిదే పనులు పూర్తి కావడం లేదు.  

నేరుగా వస్తే రిజిస్ట్రేషన్లు చేస్తాం 
ఆన్‌లైన్‌ విధానంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సులభంగా మారింది. ఇల్లు, ప్లాటు, వ్యవసాయ భూమి తదితర విక్రయాలకు సంబంధించిన నమూనా దస్త్రాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. నేరుగా వాటి ద్వారా డాక్యుమెంట్లు తయారు చేసుకొని స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. అవినీతికి ఎక్కడా తావు లేదు. కొనుగోలుదార్లు కోరితే క్రయవిక్రయాలకు సంబంధించిన సీసీలను అందిస్తాం.   –స్వామిదాస్, సబ్‌ రిజిస్ట్రార్, బాన్సువాడ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement