పార్టీని వీడేందుకేనా కార్పొరేటర్ల అలక!


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడేందుకు పలువురు నేతలు తమకు తగిన మార్గాలను అన్వేషించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడే వారే సంఖ్య క్రమేపి పెరిగినా.. తాజా పరిస్థితులను చూస్తే నగర పరిధిలో మరికొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ కు హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటమికి దారితీసిన కారణాలను సమీక్షించుకొని లోపాలు సరిదిద్దుకునేందుకు శనివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి జూబ్లీహిల్స్ కార్పొరేటర్ మామిడి లక్ష్మీబాయి, జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ నేత మామిడి నర్సింగరావు డుమ్మా కొట్టారు. ఇదే విషయం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గానికి చెందిన అయిదుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లలో నలుగురు త్వరలోనే జంప్ జిలానీలుగా మారనున్నారని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మొదటి సమావేశానికే జూబ్లీహిల్స్ కార్పొరేటర్ లక్ష్మీబాయి హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. తమకు సమాచారం ఆలస్యంగా అందిందని అనుకోకుండా బయటికి వెళ్లడం వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేకపోయామని కార్పొరేటర్ పేర్కొంటూన్నా.. ఇందులో నిజమెంత అన్నది ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.

 


జూబ్లీహిల్స్ కార్పొరేటర్ మామిడి ఎప్పటి నుంచో ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. ఇదే అనుబంధం త్వరలో పెనవేసుకోనుందని తెలుస్తున్నది. వచ్చే కార్పొరేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలిచే ఛాన్స్ చాలా తక్కువగా ఉండటంతో చాలా మంది కార్పొరేటర్లు ఇతర పార్టీల్లోకి వెళ్తారని భావిస్తున్న నేపథ్యంలో ఆమె గైర్హాజరు ఇందుకు మరింత ఊతమిచ్చినట్లు అయ్యింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే మామిడికి, మాజీ మంత్రి దానంకు మధ్య విభేదాలు పొడసూపాయి. మామిడిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ బాధ్యతలు ఇక్కడ సంబంధం లేని బోజిరెడ్డికి అప్పగించడంతో వివాదం మరింత ముదిరింది. మొన్నటి ఫలితాల్లో ఇక్కడ బీజేపీకి 5 వేల పైచిలుకు మెజారిటీ రావడం కూడా ఆ వివాదానికి ఆజ్యం పోసింది. దీంతో ఇద్దరి మధ్య అగాథం పెరిగిందని వచ్చే కార్పొరేటర్ టిక్కెట్‌ను కూడా మామిడికి ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సహజంగానే ఆమె మరో పార్టీవైపు చూస్తున్నట్లు స్పష్టమవుతున్నది. దానం నాగేందర్ పార్టీ ఓటమిలో భాగంగా నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరు కాకుండా అలక పూనడానికి ప్రధాన కారణం మాత్రం కాంగ్రెస్ వీడేందుకేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top