ఏ కాలనీలో ఎవరెవరికి..

Coronavirus Spread From Three Markets in Jiyaguda Hyderabad - Sakshi

ఆ మూడు మార్కెట్ల నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరణ

మలక్‌పేట్‌ గంజ్, జియాగూడమేకల మండి, సబ్జిమండి

జియాగూడలో 11 మంది నుంచే 71 మందికి..

మలక్‌పేటగంజ్‌లో ఇద్దరితో మరో 75 మందికి వ్యాప్తి

కరోనా గుప్పిట్లో జియాగూడ, మలక్‌పేట, వనస్థలిపురం కాలనీలు

వామ్మో.. జియాగూడ జియాగూడలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. పలు బస్తీల్లో రోజురోజుకూ కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరగడంబెంబేలెత్తిస్తోంది. తాజాగా బుధవారం మరో పది మందిలో పాజిటివ్‌ లక్షణాలు కనిపించాయి. ఇంద్రానగర్‌లో ఇటీవల కరోనా మృతి చెందిన  68 ఏళ్ల వృద్ధుడి కుటుంబంలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంకటేశ్వర నగర్‌లో మృతి చెందిన 75 ఏళ్ల వృద్ధుడి ఇంట్లో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. జియాగూడ పరిసర ప్రాంతాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతుండటంతో స్థానికులుప్రాణ భయంతో ఇతర ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు.   

సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి కొన్ని కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్‌లో 860 మంది వైరస్‌ బారిన పడగా, వీరికి సన్నిహితంగా మెలిగిన మరో ఎనిమిది వేల మంది కార్వంటైన్‌కు కారణమైంది. మర్కజ్‌ కేసుల గుర్తించి, చికిత్సల తర్వాత వైరస్‌ తగ్గుముఖం పట్టినట్టే పట్టి.. ఇటీవల ఒక్కసారిగా మళ్లీ విజృంభించింది. మలక్‌పేట్‌ గంజ్, జియాగూడ మేకలమండి, సబ్జిమండి మార్కెట్లు వైరస్‌కు కేంద్ర బిందువుగా నిలిచాయి. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఇద్దరు వ్యక్తుల ద్వారా మలక్‌పేట్‌గంజ్‌ మార్కెట్లోని ముగ్గురు వ్యాపారులకు, వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు వైరస్‌ విస్తరించింది.

ఇలా ఒక్క పల్లి నూనె వ్యాపారి ద్వారానే వనస్థలిపురం, హుడాసాయినగర్‌ కాలనీ, ఎస్‌కేడీకాలనీ, తిరుమలానగర్‌లో కేవలం నాలుగైదు కుటుంబాల్లో 45 మందికి వైరస్‌ విస్తరించగా..ముగ్గురు మృతి చెందారు. ఇక మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 11 మంది మేకలమండి, సబ్జిమండి మార్కెట్లలో పని చేశారు. వీరి ద్వారా జియాగూడ, దుర్గానగర్, ఇందిరానగర్, వెంకటేశ్వర కాలనీల్లో 71 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 500 మందికిపైగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. కుటుంబంలో ఒకరికి వైరస్‌ సోకితే.. ఆ తర్వాత ఇతర సభ్యులంతా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది. తండ్రి ఒకచోట.. తల్లి మరోచోట.. పిల్లలు ఇంకో చోట.. ఇలా విడివిడిగా ఒక్కొక్కరు ఒక్కో వార్డులో రోజుల తరబడి ఉండాల్సి రావడం, వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌వచ్చిన ఇతర కుటుంబ సభ్యులు కూడా 28 రోజుల పాటు ఇంట్లోనే బందీ కావాల్సి వచ్చింది. అత్యవసర సమయంలో అండగా నిలవాల్సిన బంధువులు కూడా భయంతో ముఖం చాటేస్తుండటం ఆయా కుటుంబాలను తీవ్రంగా కలచివేసింది.

జియాగూడలోనే ఎందుకంటే?
జియాగూడ: మాంసం, కూరగాయలు, ఇతర మార్కెట్లకు ప్రధాన కేంద్రం ఇది. ఇక్కడ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌కు చెందిన వారంతా ఇక్కడే ఎక్కువగా ఉంటారు. బస్తీలు కూడా ఇరుకుగా జనం రద్దీతో కిటకిటలాడుతుంటాయి. ఒక్కో కాలనీలో 350 నుంచి 500 నివాసాలు ఉంటాయి. ఒక్కో ఇంట్లోని ఇరుకు గదుల్లో 10 నుంచి 25 మంది వరకు ఉంటారు. వీరంతా మేకలమండి, సబ్జిమండి మార్కెట్లపై ఆధారపడి జీవిస్తుంటారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో 11 మంది ఇక్కడే పని చేస్తుంటారు. వీరి ద్వారా ఇతరులకు వైరస్‌ విస్తరించింది. ఇక్కడ పని చేస్తున్న తోటి కూలీలు, వ్యాపారులకు కనీస ఆరోగ్య స్పృహ లేక పోవడం, చిన్న వైరస్‌ తమనేం చేస్తుందిలే? అనే నిర్లక్ష్యమే వీరి కొంప ముంచింది. ఒకవైపు చాపకింది నీరులా వైరస్‌ విస్తరిస్తుంటే..మరో వైపు మార్కెట్ల చు ట్టు విచ్చలవిడిగా తిరిగారు. దీంతో ఒక్కసారిగా వైరస్‌ విజృంభించింది. ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ 71 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా, వందలాది మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.  ప్రస్తుతం ఇక్కడ కేసులు తీవ్రరూపం దాల్చడంతో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు. బస్తీల్లోకి వచ్చే అంబులెన్స్‌ల సైరన్లతో గుండెల్లో దడ పుడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

జియాగూడ వెంకటేశ్వర్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఓ గృహిణి (45) ప్రభుత్వం ద్వారా అందే రూ.1500 కోసం బ్యాంకు వద్ద క్యూలో నిల్చుంది. దీంతో ఆమె కరోనా పాజిటివ్‌తో చనిపోయింది. కుటుంబ సభ్యులు అక్క, భర్త, మనవరాలిని క్వారంటైన్‌కు తరలించారు.
ఇదే కాలనీకి చెందిన రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి (75)కు పాజిటివ్‌ వచ్చి మృతిచెందారు. ఇతని కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లోఉన్నారు. వెంకటేశ్వర్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి (31)కి, అతడి తమ్ముడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మిగతా కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.
దుర్గానగర్‌లో ఓ వ్యక్తి (75) ఇంటికి మటన్‌ తెచ్చుకుని వండుకుని తిన్నాడు. దీంతో అతనికి మటన్‌ ద్వారా కరోనా పాజిటివ్‌ వచ్చి మృతిచెందారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. దుర్గానగర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి (50) వృత్తిరీత్యా మటన్‌ విక్రయదారు. ఆయన కూడా కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు.  
జియాగూడ కేసరి హనుమాన్‌ ప్రాంతంలో వడ్రంగి పనిచేస్తున్న ఓ వ్యక్తి (45), అతని కుమారుడు ఢిల్లీ నుండి మర్కజ్‌ యాత్రికులతో ప్రయాణించి జియాగూడకు చేరుకున్నారు. దీంతో అతనికి, అతని కుమారుని కరోనా పాజిటివ్‌ వచ్చింది. సబ్జిమండిలో నివాసం ఉంటున్న ఓ మహిళ తన కొడుకుతో కలిసి నార్త్‌లో ఉన్నటువంటి బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మర్కజ్‌ యాత్రికులతో ట్రైన్‌లో నగరానికి చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులలో కోడలికి, కొడుకుకు పాజిటివ్‌ రాగా మిగతా వారిని క్వారంటైన్‌కు తరలించారు.  
సబ్జిమండిలో కూరగాయలు విక్రయించే ఓ వ్యక్తి (51) కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు. ఆయన భార్యకు కూడా పాజిటివ్‌ వచ్చింది.
సాయిదుర్గానగర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి (26) లంగర్‌హౌజ్, గోల్కొండ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ముందుగా ఇతనికి కరోనా పాజిటీవ్‌ రాగా మిగతా 7 మందిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. దాదాపు అందరికి పాజిటివ్‌ వచ్చింది.  
ఇందిరానగర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి (68)కి  మొదట టైఫాయిడ్‌ రావడంతో పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్‌ అని తేలింది. అనంతరం అతడు మృతిచెందాడు.  ఇదే ప్రాంతంలో కూరగాయలు విక్రయించే ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో పాటు ఆమె కొడుకు కోడలికి కూడా కరోనా పాజిటివ్‌ సోకింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top