తెలంగాణలో మరో 43 మందికి కరోనా

Corona For Another 43 People In Telangana State - Sakshi

రాష్ట్రంలో 809కి చేరిన కేసులు

ఇప్పటివరకు 18 మంది మృతి.. 186 మంది డిశ్చార్జి

వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శనివారం కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 809కి చేరింది. ఇప్పటివరకు 186 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా ప్రస్తుతం 605 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. అలాగే 18 మంది కరోనా బారినపడి మరణించారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు బులెటిన్‌ విడుదల చేశారు. శనివారం అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. 

ఇప్పటివరకు 12,269 మందికి పరీక్షలు
రాష్ట్రంలో ఇప్పటివరకు 12,269 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ శనివారం మధ్యాహ్నం ప్రభుత్వానికి అందజేసిన అంతర్గత నివేదికలో వెల్లడించింది. అందులో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, వారి కాంటాక్ట్‌లకు ఎంత మందికి వచ్చిందో పేర్కొంది. అలాగే మర్కజ్‌కు నేరుగా వెళ్లొచ్చిన వారిలో ఎందరికి పాజిటివ్‌ వచ్చిందో, వారి ద్వారా ఇంకెంత మంది వైరస్‌బారిన పడ్డారో కూడా వెల్లడించింది. మొత్తంగా మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు 1,247 కాగా వారందరికీ పరీక్షలు పూర్తయ్యాయి. వారి ద్వారా నేరుగా కాంటాక్ట్‌ అయినవారు 2,593 మంది ఉండగా వాళ్లకు కూడా పరీక్షలు నిర్వహించారు.

ఇప్పటివరకు నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో 34 మందికి, వారి కాంటాక్టులకు 30 మందికి, అంటే మొత్తంగా 64 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిలో 232 మందికి, వారి కాంటాక్టులకు 432 మందికి పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన వారిలో ఆరోగ్య సిబ్బంది, సెకండరీ కాంటాక్టు వచ్చినవారు తదితరులు ఉన్నారు. అయితే ఆరోగ్య సిబ్బంది ఎవరనేది నివేదికలో ప్రస్తావించలేదు. కాగా, హైదరాబాద్‌లో కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు తాజాగా వైరస్‌బారిన పడ్డారు. చదవండి: కరోనా కొనసాగితే కష్టమే.. 

172 కంటైన్మెంట్‌ ఏరియాల్లో 1.09 లక్షల ఇళ్ల సర్వే... 
సర్కారుకు ఇచ్చిన నివేదికలో 172 కంటైన్మెంట్‌ ఏరియాల్లో 1.09 లక్షల ఇళ్లలో సర్వే చేసినట్లు వెల్లడైంది. 89,227 ఇళ్లలో సర్వే చేసి కాంటాక్ట్‌లను గుర్తించాల్సి ఉందని నివేదిక పేర్కొంది. మరోవైపు 33 జిల్లాల్లో 121 క్వారంటైన్‌ సెంటర్లు నడుస్తున్నాయని, వాటిలో 1,017 మంది ఉన్నారని, మరో 209 మంది శాంపిళ్లను సేకరించాల్సి ఉందని నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3.55 లక్షల ఎన్‌–95 మాస్కులు, 2.92 లక్షల పీపీఈ కిట్లు, 17,246 టెస్టింగ్‌ కిట్లు ఉన్నాయని తెలిపింది. ల్యాబ్‌లలో ప్రస్తుతం 600కుపైగా పెండింగ్‌ టెస్ట్‌లు ఉన్నాయని తెలిపింది. 

ఏపీ లారీ డ్రైవర్‌కు పాజిటివ్‌.. 
తానూరు (ముథోల్‌): నిర్మల్‌ జిల్లా తానూరు మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్న లారీ డ్రైవర్‌ను పోలీసులు శని వారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా మోటివాడి మండలానికి చెందిన లారీ డ్రైవర్‌ తనకు కరోనా లక్షణాలు ఉండటంతో ఐదు రోజుల క్రితం స్థానిక ఆస్పత్రిలో చూపించుకున్నాడు. ఈ నె ల 15న నూజివీడు నుంచి మామిడి పండ్ల లోడ్‌తో మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాకు వెళ్లాడు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో అతనికి కరోనా పాజిటివ్‌ గా తేలడంతో వైద్యాధికారులు అతన్ని ఫోన్లో సంప్రదించారు. తాను బుల్డానా జిల్లా నుంచి ఉల్లిగడ్డ లోడ్‌ తో తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు పేర్కొనడంతో వారు తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు. దీం తో తానూరు మండల పోలీసు, వైద్యాధికారులు శనివారం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బెల్‌తరోడా వ ద్ద లారీని ఆపి డ్రైవర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించా రు. క్లీనర్‌ను నిర్మల్‌లోని క్వారంటైన్‌కు తీసుకెళ్లారు. 

రెండు నెలల చిన్నారికి కరోనా.. 
నాంపల్లి: నారాయణపేట్‌ అభాంగాపూర్‌కు చెందిన రెండు నెలల చిన్నారి అస్వస్థతకు గురవడంతో నిలోఫర్‌కు తరలించారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ చిన్నారి గాంధీ ఆస్పత్రికి ఆ కుటుంబంలోని ఆరుగురిని క్వారంటైన్‌కు తరలించారు.  చదవండి: ఎడారి దేశాల్లో వలసజీవి దిగాలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top