జూనియర్లకు సీనియర్ల సెల్యూట్‌! | Controversy in police postings | Sakshi
Sakshi News home page

జూనియర్లకు సీనియర్ల సెల్యూట్‌!

Nov 3 2017 1:15 AM | Updated on Sep 17 2018 6:18 PM

Controversy in police postings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూనిఫాం సర్వీస్, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న పోలీసుశాఖలో రెండు రోజుల క్రితం కల్పించిన పదోన్నతులు, పోస్టింగ్‌ల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. జూనియర్లకు సీనియర్లు సెల్యూట్‌ కొట్టడంతోపాటు వారి కిందే పని చేసే పరిస్థితి తలెత్తుతోంది. అగ్జిలేటరీ ప్రమోషన్ల పేరుతో ఇష్టారాజ్యంగా కల్పించిన పదోన్నతులు పోలీసుశాఖను కుదిపేస్తోంది.

జూనియర్ల కింద సీనియర్లు..  
సీనియర్‌ అధికారులు డీఎస్పీలుగా పనిచేస్తుంటే జూనియర్‌ అధికారులు అదనపు ఎస్పీలుగా, నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా పదోన్నతులు, పోస్టిం గ్‌లు పొందడం కలకలం రేపుతోంది. 1989 బ్యాచ్‌కు చెందిన 27 మంది అధికారులు డీఎస్పీలుగా పనిచేస్తుండగా వారిపైన సూపర్‌ విజన్‌గా 1985 లేదా డైరెక్ట్‌ రిక్రూటీస్‌ అధికారులను నియమిస్తే సమస్య ఉండేది కాదు. కానీ వారిపై ఇన్‌చార్జిలుగా 1991, 1995 బ్యాచ్‌లకు చెందిన అధికారులను నియమించడం వివాదాస్పదమవుతోంది. ఇలా 12 మందికి పదోన్నతులు, పోస్టింగులు కల్పించి పోలీసుశాఖ వివాదంలో ఇరుక్కుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

పదోన్నతులకు ఓకే.. పోస్టింగ్స్‌పై వివాదం...
మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి పనిచేసినందుకు అగ్జిలేటరీ పదోన్నతులు కల్పించారు. ఇక్కడ తప్పు లేదనుకున్నా కనీసం పోస్టింగులు కల్పించే క్రమంలో సంబంధిత ప్రాంతాల్లో సీనియర్లున్నారా లేక జూనియర్లున్నారా, అక్కడ నియమిస్తే వివాదం ఏర్పడే అవకాశం ఉందా అనే అంశాలను ఉన్నతాధికారులు కసరత్తు చేయాల్సి ఉంటుంది. వారం పది రోజులుగా పదోన్నతులు, పోస్టింగ్‌లపై కసరత్తు చేసినా అధికారులు ఇలాంటి వివాదాస్పదమయ్యే అంశాలపై దృష్టి సారించకపోవడం ఆందోళనకు గురిచేసిందని 1989 బ్యాచ్‌కు చెందిన 27 మంది అధికారులు అభిప్రాయపడ్డారు. సీనియర్లమైన తాము ఏళ్ల పాటు తమ కింద పనిచేసిన వారికి సెల్యూట్‌ చేయాల్సి రావడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.  

ఐదేళ్ల పేరుతో...  
పదోన్నతులను సీనియారిటీ, బ్యాచ్‌నుబట్టి కల్పిస్తారు. పోలీసుశాఖలో మాత్రం ఐదేళ్ల సర్వీసు పేరుతో అడ్‌హాక్‌ పద్ధతిలో పదోన్నతులు కల్పించారు. ఇందులోనూ అగ్జిలేటరీ పేరుతో జూనియర్‌ బ్యాచ్‌లకు అదనపు ఎస్పీలు, నాన్‌ క్యాడర్‌ ఎస్పీలను అంటగట్టారు. రాష్ట్ర పోలీసుశాఖలో బ్యాచ్‌ల సీనియారిటీ కాకుండా రేంజ్‌ల సీనియా రిటీ పేరుతో పదోన్నతులు కల్పించడం, అగ్జిలేటరీ పేరుతో కావాల్సిన వాళ్లని అందలం ఎక్కించ డం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు అభిప్రాయపడ్డారు.  

మార్పుచేర్పులు చేస్తాం
‘‘గతంలో అగ్జిలేటరీ పద్ధతి ద్వారా కొందరు అధికారులు సీనియర్లకన్నా ముందు పదోన్నతులు పొందారు. దీంతో తదుపరి పదోన్నతికి కావాల్సిన అర్హత ముందుగానే పొందడంతో వారికి పదోన్నతి కల్పించాం. ఐదేళ్ల కనీస సర్వీసుపెట్టి అడ్‌హాక్‌ పద్ధతిలో పదోన్నతులు ఇచ్చాం. అయితే పోస్టింగ్‌ల విషయంలో సీనియర్లు ఉన్న చోట జూనియర్‌ బ్యాచ్‌ల అధికారులను నియమించడం ఇబ్బందికరమే. దీనిపై ఉన్నతాధికారులతో పునఃసమీక్షించి మార్పుచేర్పులు చేస్తాం.’’   
 – అనురాగ్‌శర్మ, డీజీపీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement