- ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు దారుణంగా ఖూనీ చేసి ఎన్నికలను బల ప్రదర్శనకు వేదికగా చేశారు
- ప్రభుత్వ తీవ్ర దురహంకారం, ప్రమాదకర స్వభావం బట్టబయలైంది...
- పోలీసులు టీడీపీ చేతిలో కీలుబోమ్మలై ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో విఫలమవుతున్నారు
- ఎన్నికల ప్రక్రియను అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ ప్రభుత్వంలో సర్వసాధారణమైంది
- ఈ సర్కారు ఎంతటి అధికార దుర్వీనియోగం చేస్తోందో తేటతెల్లం అవుతోంది
- ‘ఎక్స్’లో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం
- వింజమూరు, బొమ్మనహాళ్ ఘటనలను ప్రస్తావిస్తూ పోస్ట్
సాక్షి, అమరావతి: ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మండిపడ్డారు. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే సీఎం చంద్రబాబు... రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సోమవారం ఆయన పోస్ట్ చేశారు. ‘‘ఒక చిన్న ఎంపీపీ ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేస్తున్న తీరు, ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బల ప్రదర్శన వేదికగా మార్చిన వైనం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని బట్టబయలు చేస్తోంది’’ అని అన్నారు.
‘‘ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికలో ఓటు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా, వారిపై దాడి చేశారు. దీంతో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు. మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం... ఎంపీపీ ఎన్నికలో వారిని ఓటు వేయకుండా ఆపడమే.
ఒక భయాందోళన పరిస్థితి సృష్టించి, బల ప్రయోగంతో వారి ఓటు హక్కును అడ్డుకోవడమే. ప్రజల గొంతును అణచివేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతరేయడానికి ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనల సమయంలో... పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి బహిరంగంగా మద్దతిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడడంలో విఫలమవుతున్నారు’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.
మౌన ప్రేక్షకుల్లా ఎన్నికల అధికారులు
‘‘రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో కూడా అదే పరిస్థితి చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిలిచి, ఎంపీపీ ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారు’’ అని జగన్ ధ్వజమెత్తారు.
‘‘ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల కిడ్నాప్, వారిపై బహిరంగంగా దాడి, పోలీసు వ్యవస్థను దుర్వీనియోగం చేయడం, ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయింది. ఒక చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఎన్నికలోనే ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత అధికార దుర్వీనియోగం చేస్తోందో తేటతెల్లం అవుతోంది. ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకిగా మారింది అన్న విషయాన్ని చాటుతోంది’’ అని జగన్ అన్నారు.


