రేవంత్‌ వ్యాఖ్యలపై దుమారం

Controversy in Congress Over Huzurnagar Ticket - Sakshi

హుజూర్‌నగర్‌ అభ్యర్థిత్వంపై పేచీ 

నిశితంగా పరిశీలిస్తున్న టీఆర్‌ఎస్‌ 

సాక్షిప్రతినిధి, సూర్యాపేట : ఉప ఎన్నిక ముంగింట్లో కాంగ్రెస్‌ పార్టీలో హుజూర్‌నగర్‌ అభ్యర్థిత్వంపై కయ్యం తారస్థాయికి చేరింది. ‘అభ్యర్థిగా పద్మావతిని.. ఉత్తమ్‌ ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు’ అని పార్టీ వర్కింVŠ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆపార్టీ జిల్లా శ్రేణుల్లో దుమారం లేపాయి. ఆయన వ్యాఖ్యలపై హుజూర్‌నగర్, సూర్యాపేటలో పార్టీ నేతలు మండిపడ్డారు. అయితే జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఆపార్టీలో జరిగిన పరిణామాలను టీఆర్‌ఎస్‌ నిశితంగా పరిశీలిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం.
 
రేవంత్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు.. 
రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లాలో ఆపార్టీ ముఖ్య నేతలు.. నేరుగా ఆయన్ను టార్గెట్‌ చేసి ఘాటుగా విమర్శలు సంధించారు. పార్టీ అగ్రనేతల నిర్ణయం మేరకే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌.. పద్మావతిని హుజూర్‌నగర అభ్యర్థిగా ప్రకటించారని, దీనికి రేవంత్‌రెడ్డి అభ్యంతరం ఎందుకు చెబుతారని ప్రశ్నించారు. రేవంత్‌పై విమర్శలు గుప్పించడంపై.. ఆయనతో పాటు పార్టీలోకి వచ్చిన జిల్లా ముఖ్య నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్‌ వేదికగా ఆపార్టీలో జరిగిన పరిణామాలు జిల్లాలో పాత.. కొత్త నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు తీసుకొచ్చాయి. ఇదిలా ఉండగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్‌ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో రూ.వేల కోట్లు ఖర్చు చేశాడని, ఆయన సతీమణి పద్మావతికి టికెట్‌ ఇస్తే గెలిపిస్తామన్నారు. ఆమెకు టికెట్‌ ఇస్తే కేడర్‌ ఎటూ వెళ్లదన్నారు.

ఎక్కడి వారినో ఇక్కడికి తీసుకొచ్చి పోటీ చేయిస్తే గెలవడం అసాధ్యమన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ నేతలు.. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి.. ఉత్తమ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఉప ఎన్నికల్లో పద్మావతే తమ పార్టీ అభ్యర్థి అన్నారు. ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక రేవంత్‌రెడ్డికి సంబంధం లేదన్నారు. హుజూర్‌నగర్‌ టికెట్‌పై రేవంత్‌రెడ్డి జోక్యం మంచి పద్ధతి కాదని, ఆయన నియోజకవర్గానికే పరిమితం కావాలని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకటన్నయాదవ్‌ విలేకరుల సమావేశంలో.. రేవంత్‌పై ధ్వజ మెత్తారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ పార్టీని విమర్శించడం సమంజసం కాదన్నారు.
 
గులాబీలో చర్చ.. 
కాంగ్రెస్‌ పార్టీలో హుజూర్‌నగర్‌ అభ్యర్థిత్వంపై జరుగుతున్న కయ్యాన్ని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల గణం నిశితంగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్‌లో ఈ పరిణామాలు ఎటు వైపు వెళ్తాయోనని అంచనా వేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి ఎవరన్నది త్వరలో ప్రకటిస్తే నోటిఫికేషన్‌ రాకున్నా దూకుడుగా ప్రచారానికి వెళ్లొచ్చని ఆపార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. గత నెల రోజులుగా మంత్రి జగదీశ్‌రెడ్డి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు ఇంకా ప్రకటించలేదు. ఈ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రకటించనున్నారు. అయితే కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలపై మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌దే విజయమని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌లో గలాటాను టీఆర్‌ఎస్‌ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఏయే మండలాల్లో నేతలు అసంతృప్తిగా ఉన్నారని పార్టీ ముఖ్య నేతలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top