ఎవరికో.. స్నేహ‘హస్తం’?!

Congress MLA Candidates Applications Karimnagar - Sakshi

పదిరోజుల్లో అభ్యర్థుల తొలిజాబితాను వెల్లడిస్తామని కాంగ్రెస్‌ పార్టీ  ప్రకటించినప్పటికీ.. అధిష్టానం మాత్రం అంతకంటే ముందుగానే వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. పదిరోజుల్లో అభ్యర్థుల జాబితా వెల్లడిస్తామని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ.కుంతియా ఈనెల 23న ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ.. నిన్నామొన్నటి పరిణామాలను పరిశీలిస్తే రెండు మూడు రోజుల ముందే తొలివిడత జాబితా విడుదల చేసే అవకాశాలు  ఉన్నట్లు చెప్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆశావహులు, తొలి జాబితాలో పేర్లుండే అవకాశం ఉన్న నేతలకు అధిష్టానం నుంచి సంకేతాలు కూడా అందినట్లు సమాచారం.

నవంబర్‌ 1 తర్వాత అభ్యర్థుల పేర్లను ప్రకటించాలన్న నిర్ణయం మేరకు జిల్లా, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలకు అందిన దరఖాస్తులపై పరిశీలన జరిపిన ఈరెండు కమిటీలు.. స్క్రీనింగ్‌ కమిటీకి పంపించినట్లు ఇదివరకే ప్రకటించారు. ఈమేరకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ కూడా కసరత్తు పూర్తి చేయగా.. రాహుల్‌గాంధీ ఆమోదముద్రే తరువాయిగా మారింది. ఇదంతా ఒకటిరెండు రోజులు పూర్తి చేస్తే.. వచ్చేనెల ఒకటి తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ : జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల నుంచి డీసీసీ, టీ పీసీసీలకు పోటాపోటీగా దరఖాస్తులు అందాయి. అన్ని స్థానాలకూ మూడు నుంచి 14 మంది వరకు ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్‌ నుంచి 11 మంది, చొప్పదండి నుంచి 14, హుజూరాబాద్‌ నుంచి ఐదుగురు, మానకొండూరు నుంచి ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సామాజిక సమీకరణలు, సీనియర్‌ నేతలను దష్టిలో పెట్టుకుని ఇద్దరు, ముగ్గురి పేర్లను ఏఐసీసీకి ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందులో ఇటీవల పార్టీలో చేరిన నేతల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, చొప్పదండి నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి నుంచి 11, 14 మంది అభ్యర్థులు పార్టీ టికెటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

వడబోత అనంతరం నియోజకవర్గానికి రెండు, మూడేసి పేర్ల చొప్పున జాబితాలో చేర్చినట్లు సమాచారం. కరీంనగర్‌ నుంచి మూడు, మానకొండూర్‌ నుంచి రెండు పేర్లు పంపినా.. ఇక్కడ అభ్యర్థులుగా పొన్నం ప్రభాకర్, ఆరెపల్లి మోహన్‌ పేర్ల ప్రకటన లాంఛనమే అంటున్నారు. హుజూరాబాద్, చొప్పదండి నుంచి మాత్రం మూడేసి పేర్లను స్క్రీనింగ్‌ కమిటీకి పంపినట్లు తెలిసింది. దసరా తర్వాత.. దీపావళికి ముందుగా అధికారికంగా అభ్యర్థులపై ప్రకటన ఉంటుందని ప్రకటించినా ఇప్పటికీ వెల్లడికాలేదు. అయితే మిత్రపక్షాలతో కాంగ్రెస్‌ «అధిష్టానం చర్చలు శనివారం సాయంత్రం కొలిక్కివచ్చిన నేపథ్యంలో నవంబర్‌ 1న, లేదా ఆ తర్వాత ప్రకటించేందుకు సిద్ధం కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది.

మిత్రపక్షాల సీట్లపై ఇంకా పీటముడి 
ఉమ్మడి జిల్లాలో మహాకూటమికి ఐదుస్థానాలు కోరుతుండగా, మొదట కరీంనగర్‌ జిల్లాలో హుజూరాబాద్‌ను టీడీపీ, టీజేఎస్‌లు, కరీంనగర్‌ కోసం టీజేఎస్‌ గట్టిగా పట్టుబట్టాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి హుజూరాబాద్‌ నుంచి పోటీచేసేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. దీంతో ఇప్పుడా స్థానాన్ని పొత్తుల్లో భాగంగా తెలంగాణ జన సమితికి కేటాయించాలని పట్టుబడుతున్నారు. ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ముక్కెర రాజు కోసం టీజేఎస్‌ అడుగుతోంది. అదేవిధంగా కరీంనగర్‌ స్థానాన్ని టీజేఎస్‌ అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు చెప్తున్నారు.

నరహరి జగ్గారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తూ.. ఇప్పటికే కరీంనగర్‌ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవలే కరీంనగర్‌ సర్కస్‌గ్రౌండ్‌ ధూంధాం పేరిట భారీ సదస్సు నిర్వహించిన జగ్గారెడ్డి.. టీజేఎస్‌ అధినేత కోదండరాంను మెప్పించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ స్థానంపైనా టీజేఎస్‌ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరెండు స్థానాలపై ఇంకా ఏమీ తేలకపోగా మిత్రపక్షాల స్థానాల కేటాయింపు ఇంకా పీటముడిగానే ఉంది. నవంబర్‌1 లోగా వీటన్నింటిపై స్పష్టత రావడమే తరువాయి.. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. దీపావళి ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలన్న నిర్ణయంతో కసరత్తు వేగం పెంచిన కాంగ్రెస్‌ పార్టీ నవంబర్‌ ఒకటిన లేదా ఆ తర్వాత ప్రకటించనుందన్న సమాచారం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top