‘స్థానిక సంస్థల ఎన్నికలు.. సార్వత్రిక పోరులో ఓటమికి పూర్తి బాధ్యత పార్టీదే. గెలిచే సత్తా ఉన్న వారికి కాకుండా ఏమాత్రం ప్రాబల్యం లేని వారికి టికెట్లిచ్చారు.
కాంగ్రెస్ బృంద చర్చల్లో నేతల ఆభిప్రాయాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘స్థానిక సంస్థల ఎన్నికలు.. సార్వత్రిక పోరులో ఓటమికి పూర్తి బాధ్యత పార్టీదే. గెలిచే సత్తా ఉన్న వారికి కాకుండా ఏమాత్రం ప్రాబల్యం లేని వారికి టికెట్లిచ్చారు. మరోవైపు పార్టీకి నష్టం చేసేవారిని ప్రోత్సహించారు. ఇలాంటి ఘనకార్యాల వల్లే పార్టీ ఓటమిపాలైంది’ అంటూ కాంగ్రెస్ కార్యాచరణ సదస్సులో భాగంగా జరిగిన బృంద చర్చల్లో నేతలు అభిప్రాయపడ్డారు. ఆదివారం సదస్సులో నేతలంతా వివిధ అంశాలపై బృందాలుగా విడిపోయారు. ఒక్కో అంశంపై ఒక్కో ముఖ్య నేత ఆధ్వర్యంలో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేసి అందులో 100 నుంచి 120 మంది కార్యకర్తలకు చోటు కల్పించారు. విడివిడిగా సమావేశమైన ఈ బృందాల వద్ద కార్యకర్తలు, నాయకులు స్థానిక పరిస్థితులను వివరిస్తూ తమ తమ అభిప్రాయాలు తెలిపారు.
మమ అనిపించారు..: పార్టీ ఓటమికి కారణాలు విశ్లేషించి భవిష్యత్ కార్యాచరణ కోసం అమూల్యమైన సమాచారాన్ని పార్టీ శ్రేణుల నుంచి సేకరించాలనే ప్రధాన లక్ష్యంతో తలపెట్టిన బృంద చర్చలపై అగ్రనేతలు అనాసక్తి ప్రదర్శించారు. బృంద చర్చల్లో కార్యకర్తల నుంచి కీలక సమాచారాన్ని సేకరించాలని సీనియర్ నేతలను హైకమాండ్ ఆదేశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చర్చల మధ్యలో నుంచే పలువురు నేతలు నిష్ర్కమించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ మధ్యాహ్న భోజన సమయంలోనే సదస్సు నుంచి వెళ్లిపోగా, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి సైతం అర్ధంతరంగా సదస్సును వీడారు.