‘మల్టీపర్పస్‌’ పంచాయితీ!

Confusion over gram panchayat staff in the state - Sakshi

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బంది విషయంలో గందరగోళం

జనాభా దామాషా ప్రకారం నియమించుకుని కొత్త వేతనమివ్వాలని ఉత్తర్వులు

జీవో వచ్చి 4 నెలలు దాటినా జీపీల్లోని సిబ్బందికి ఇంకా పాత వేతనాలే..

కొత్త వారిని నియమించుకున్నట్టు రికార్డుల్లో రాసుకుని స్వాహా చేస్తున్న వైనం

విషయం తెలియడంతో సమగ్ర విచారణకు ఆదేశించిన పీఆర్‌ కమిషనర్‌  

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలకు పాలక వర్గాలు ఎసరు పెడుతున్నాయి. అరకొర జీతాలిస్తూ.. పెరిగిన వేతనాలను నొక్కేస్తున్నాయి. బహుళ ప్రయోజన సిబ్బంది (మల్టీ పర్పస్‌వర్కర్‌) నియామకాల్లో స్పష్టత కొరవడటంతోనే ఈ అక్రమాలకు తెరలేచినట్టు తెలుస్తోంది. నిర్దేశిత జనాభా కంటే అధికంగా ఉన్న సిబ్బందిని ఇతర గ్రామాల్లో సర్దుబాటు చేయకపోవడం.. జనాభా కంటే తక్కువ ఉన్న చోట్ల కొత్తగా నియమించుకోకుండా ప్రభుత్వ ఖజానాకు జెల్లకొడుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. ఇప్పటివరకు అనేక జిల్లాల్లో పెంచిన వేతనాలు ఇవ్వకుండా స్వాహా చేస్తున్నట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.  

కోత పెట్టాలన్నా.. కొత్తగా పెట్టుకోవాలనుకున్నా.. 
రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం 2.04 కోట్ల జనాభా ఉంది. ఈ జనాభాకు అనుగుణంగా మల్టీపర్పస్‌ వర్కర్‌ను నియమించుకోవాలి. ఇందులో 4,380 గ్రామ పంచాయతీల్లో 500 జనాభానే ఉంది. వీటిలో మాత్రం కనిష్టంగా ఇద్దరిని నియమించుకునే వెసులుబాటుంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో 36 వేల మంది పనిచేస్తుండగా.. మరో 17 వేల మందిని అదనంగా నియమించుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా సిబ్బందిని నియమించుకోవాలనుకున్నా.. అదనంగా ఉన్నవారికి కోతపెట్టాలన్నా.. పక్క పంచాయతీల్లో సర్దుబాటు చేయాలనుకున్నా స్థానిక రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అధికంగా ఉన్నవారు పక్క గ్రామాలకు వెళ్లేందుకు ససేమిరా అనడమేగాక.. ప్రభుత్వం పెంచిన వేతనాన్ని సమానంగా పంచుకుంటామని, అందరం ఇక్కడే పనిచేస్తామని మొండికేస్తున్నారు. దీంతో అంతర్గత సర్దుబాటు చేసుకుని వారి చేత అక్కడే పనిచేయించుకుంటున్నారు. ఇక, గోల్‌మాల్‌ కూడా ఈ అంశం ఆధారంగానే జరుగుతోంది. కొన్ని జీపీల్లో జనాభా దామాషా ప్రకారం ఉండాల్సిన సిబ్బంది కన్నా తక్కువ మంది పనిచేస్తున్నారు. జనాభా దామాషాకు అనుగుణంగా ఆయా జీపీల్లో తగినంత మంది సిబ్బందిని నియమించుకుని వారందరికీ కొత్త వేతనాలు చెల్లించాలి. కానీ, అలా చేయకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై తక్కువ మందితోనే నెట్టుకొస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సిబ్బంది వేతనాలను డ్రా చేసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

మరికొన్ని చోట్ల పాత వేతనాలిస్తూ కొత్తజీతాలిస్తున్నామని రికార్డుల్లో రాసుకుంటూ మిగిలింది నొక్కేస్తున్నారనే సమాచారం కూడా పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో గ్రామపంచాయతీల వారీగా పనిచేస్తున్న సిబ్బందికి గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం నెలకు రూ.8,500 అందుతున్నాయో లేదో నివేదిక తెప్పించుకుని తమకు పంపాలని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు ఇటీవల లేఖ రాసింది. కచ్చితంగా విచారణ జరిపి తగిన సమాచారం ఇవ్వాలని ఈ నెల 6న పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మెమో నం: 4978 జారీ చేశారు.  

500 జనాభాకు ఒకరు..
ప్రతి 500 జనాభాకు ఒక బహుళ ప్రయోజన సిబ్బంది (మల్టీపర్పస్‌ వర్కర్‌)ని నియమించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామంలో 500 జనాభా మాత్రమే ఉంటే కనిష్టంగా ఇద్దరిని నియమించుకునే వెసులుబాటు కల్పించింది. పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల సంరక్షణ, పంచాయతీకి సంబంధించిన ఇతర పనులకు వినియోగించుకోవాలని నిర్దేశించింది. ప్రతి జీపీకి ఒక ట్రాక్టర్‌ను పంపిణీ చేస్తున్నందున.. దీన్ని నడిపేలా ఒకరికి కచ్చితంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే, వీధి దీపాల నిర్వహణ, విద్యుత్‌ సరఫరా పనులు చేయడంలోనూ నైపుణ్యం ఉండేలా చూడాలని, లేనిపక్షంలో జాబ్‌ వర్క్‌ కింద ప్రైవేటు సేవలు పొందాలని పేర్కొంది.

ఈ మేరకు గతేడాది అక్టోబర్‌లో పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించిన సర్కార్‌.. ఇప్పటికే గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగించాలని, ఒకవేళ నిర్దేశిత జనాభా కంటే ఎక్కువ మంది కార్మికులుంటే 5 కి.మీ.ల పరిధిలో ఉండే గ్రామాల్లో వీరి సేవలను వాడుకోవాలని స్పష్టం చేసింది. కాగా, విధిగా అదే గ్రామానికి చెందినవారినే వర్కర్లుగా పెట్టుకోవాలని కూడా సూచించింది. ఈ నిబంధన పంచాయతీల్లో గందరగోళానికి తెరలేపింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top