ఆరుగాలం శ్రమించి పండించి ధాన్యం అమ్ముకున్న రైతులు....
నిర్మల్ అర్బన్ : ఆరుగాలం శ్రమించి పండించి ధాన్యం అమ్ముకున్న రైతులు, రైతుల నుంచి కొనుగోలు చేసి విక్రయించిన కమీషన్ ఏజెంట్లు దగాకు గురైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. రూ.కోట్లలో మోసం చేశాడంటూ నిర్మల్‌లోని గాజులపేట్‌లో ఉన్న సదరు దళారీ కొనుగోలు కేంద్రం వద్దకు వివిధ ప్రాంతాల బాధితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కేంద్రంలో సదరు వ్యక్తి లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి కోటి వరకు చెల్లించాల్సి ఉందని వారు వాపోయారు.
బాధితుల కథనం ప్రకారం.. నిర్మల్‌లోని గాజులపేట్‌కు చెందిన దళారీ అనీఫ్ కొన్నేళ్లుగా మొక్కజొన్న, వరి, సోయా తదితర పంటలను కొనుగోలు చేస్తున్నాడు. ఆయా గ్రామాల్లో ఇందుకోసం ప్రత్యేకంగా కమీషన్ ఏజెంట్లను ఏర్పరచుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి, నిర్మల్ నియోజక వర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు, కమీషన్ ఏజెంట్లు వరి, మొక్కజొన్న, సోయాను సదరు దళారీకి విక్రయించారు. రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించలేదు. దీంతో డబ్బుల విషయమై రైతులు, కమీషన్ ఏజెంట్‌లు ఒత్తిడి తెచ్చారు. వారం రోజులు గడువుకావాలని కోరడంతో ఓపిక పట్టారు.
ఆది, సోమవారాల్లోనూ నిర్మల్‌లోని గాజులపేట్‌లో ఉన్న కేంద్రం వద్దకు వచ్చి వెళ్లారు. మంగళవారం డబ్బులు చెల్లిస్తానని చెప్పడంతో వారు తిరిగి పెద్ద సంఖ్యలో వచ్చారు. అక్కడ ఎవరూ లేకపోవడం, కేంద్రం మూసి ఉండటంతో అనుమానం వచ్చి సదరు వ్యక్తిని ఫోన్‌లో సంప్రదించారు. ఎంతకీ ఫోన్ లో స్పందించకపోవడంతో విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పట్టణ ఎస్సై రాంనర్సింహారెడ్డి అక్కడి చేరుకుని బాధితులను వివరాలడిగి తెలుసుకున్నారు.
కోట్లలో టోకరా..?
పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేసిన సదరు దళారీ, వారికి చెల్లించాల్సిన డబ్బులు కోట్లలో ఉన్నట్లు రైతులు, కమీషన్ ఏజెంట్లు పేర్కొంటున్నారు. రోజుల తరబడి తిప్పుకుంటూ వస్తున్న దళారీ తీరుపై సందేహం వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని విక్రయించినా డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉందని నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ సాధీక్ అనే కమీషన్ ఏజెంట్ పేర్కొన్నాడు. రూ.2 లక్షల 40 వేలు చెల్లించాల్సి ఉందని కుంటాలకు చెందిన సుదాం పటేల్, అనంతపేట్‌కు చెందిన దశరథ్‌కు రూ.2 లక్షల వరకు, లక్ష్మణచాంద మండలానికి చెందిన చింతకింది రమేష్‌కు రూ.లక్షా 70 వేలు, నిర్మల్‌కు చెందిన భాస్కర్‌రెడ్డికి రూ.2 లక్షలు, గురుగోవింద్‌సింగ్‌కు రూ.2 లక్షలు, పరిమండల్‌కు చెందిన జంగయ్యకు రూ.3 లక్షలు, కుంటాల మండలం లింబా గ్రామానికి చెందిన దత్తురాంకు రూ.2 లక్షల 40వేలు, వైకుంఠాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌కు రూ.8 లక్షలు, ఇలా పలువురికి రూ.లక్షల్లో చెల్లించడం చూస్తుంటే రూ.కోట్లలోనే బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలకు రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉందని వారు ఆరోపించారు. సదరు దళారీ నుంచి స్పందన లేకపోవడం, స్థానికంగా అందుబాటులో లేకపోవడంపై రూ.కోట్లలో టోకరా వేసినట్లు రైతులు, కమీషన్ ఏజెంట్ల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.