రాష్ట్రమంతా పీజీకి ఒకే ఎంట్రన్స్‌ టెస్ట్‌

Common Entrance Test For PG Admission In Telangana - Sakshi

త్వరలో మార్గదర్శకాలు

ఓయూకు నిర్వహణ బాధ్యతలు

ఉన్నత విద్యామండలి నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యు యేషన్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ) నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వైస్‌ చాన్స్‌లర్ల (వీసీలు) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం లోని 6 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు వేర్వేరుగా పీజీ ఎంట్రన్స్‌ టెస్టులు నిర్వహిస్తున్నాయి.

కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో ప్రవేశాలకు కేయూ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుండగా..తెలంగాణ, మహాత్మాగాంధీ, ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఉస్మానియా వర్సిటీయే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. దీంతో విద్యార్థులకు ఆర్థిక భారంతోపాటు ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. రెండు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది. పైగా రెండు యూనివర్సిటీలపైనా నిర్వహణ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఒకే పీజీ ఎంట్రెన్స్‌ నిర్వహించాలన్న ఆలోచనన ఎప్పటినుంచో ఉన్నత విద్యామండలి మదిలో ఉంది. గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి అన్ని వర్సిటీల వీసీల ఆమోదముద్ర పడింది.

రానున్న విద్యా సంవత్సరంలో (2019–20) ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే పరీక్షను నిర్వహించే బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఉమ్మడి పీజీ ప్రవేశపరీక్షకు చైర్మన్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రామచంద్రంను నియమించారు. కమిటీలో మిగతా వర్సిటీల వైస్‌ ఛాన్స్‌లర్లు, ఉన్నత విద్యా మండలి వైస్‌ ఛైర్మన్లు ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణను నియమించారు. ఎంట్రెన్స్‌ టెస్టు కన్వీనర్‌ను నియమించే బాధ్యతను ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రామచంద్రంకు అప్పగించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top