
ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానం ద్వారా ప్రవేశాలకు మంగళం
ఈ విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలే అడ్మిషన్లు ఇచ్చేలా మార్పులు
పీజీ సెట్ ఫలితాలొచ్చి రెండు నెలలైనా ప్రారంభం కాని అడ్మిషన్ల ప్రక్రియ
ఇప్పటికే ప్రైవేటు కళాశాలల్లో చేరిపోయిన విద్యార్థులు
బీటెక్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్
కోర్సు పూర్తయినా యాజమాన్యాల వద్దే సర్టిఫికెట్లు
ఫలితంగా ఎంటెక్ కౌన్సెలింగ్‌కు దూరమవుతున్న విద్యార్థులు
ఐసెట్ రెండో దశ కౌన్సెలింగ్‌పైనా ఎటూ తేల్చని సర్కారు
ఇంజినీరింగ్ మూడో దశ కౌన్సెలింగ్‌పై తర్జనభర్జన
ఉన్నత విద్య ప్రవేశాల నిర్వహణలో కూటమి సర్కారు ఘోర వైఫల్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కామన్ ఎంట్రన్స్ టెస్ట్–సెట్) ద్వారా ప్రవేశాల కల్పనకు కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. పీజీ విద్యార్థులకు శఠగోపం పెడుతోంది. విశ్వవిద్యాలయాల వారీగా మాత్రమే సీట్ల భర్తీ కోసం జీవోలను సవరించేందుకు కసరత్తు చేస్తోంది. ఫలితంగా 2025–26 పీజీ ప్రవేశాల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పీజీ ప్రవేశ పరీక్షలకు 21,995 మంది హాజరైతే ఇందులో 19,488 మంది అర్హత సాధించారు. వీరంతా వర్సిటీలు, కళాశాలల్లో ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఏ వంటి కోర్సుల్లో చేరికల కోసం నిరీక్షిస్తున్నారు.
పీజీ సెట్ ఫలితాలు విడుదల చేసి రెండు నెలలు గడిచినా ప్రభుత్వం ప్రవేశాలు చేపట్టకుండా వేలాది విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతోంది. ఒక్క పీజీలోనే కాకుండా ఉన్నత విద్యలోని ప్రతి కోర్సుల్లోనూ ఇదే తీరులో విద్యార్థులను ప్రవేశాల కోసం ముప్పుతిప్పులు పెడుతోంది. పీజీఈసెట్‌లో ఎంటెక్ ప్రవేశాలను గాల్లో పెట్టింది. ఐసెట్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ రెండో దశ కౌన్సెలింగ్‌పై ఏటూ తేల్చట్లేదు. చివరికి డిగ్రీ ప్రవేశాలను ఆలస్యంగా చేపట్టడమే కాకుండా వాటినీ వాయిదా వేస్తూ సాగదీస్తుండటం ప్రభుత్వ ఘోర వైఫల్యాలకు నిదర్శనం.
ఇదో తిరోగమన చర్య..
కూటమి ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో విద్యా రంగాన్ని తిరోగమనంలోకి నెడుతోంది. వాస్తవానికి వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఏపీలోని వర్సిటీల్లో సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానాన్ని తీసుకొచి్చంది. తద్వారా ప్రతిభ గల విద్యార్థులకు బోధన సామర్థ్యంలో మెరుగైన పనితీరుతో రాణిస్తున్న వర్సిటీల్లో, వాటి అనుబంధ కళాశాలల్లో సీట్లు దక్కేలా చేసింది.
దీంతోపాటు విడివిడిగా వర్సిటీలకు దరఖాస్తు చేసుకుని అనేక పరీక్షలు రాసేకంటే ఒకే పరీక్ష, ఒకే ఫీజు.. ఒకే దరఖాస్తు ద్వారా అన్ని వర్సిటీల్లో సామర్థ్యం మేరకు సీటు పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ విధానాన్ని మెచి్చన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆ తర్వాతి కాలంలో దేశ వ్యాప్తంగా సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశపరీక్ష విధానాన్ని ప్రవేశ పెట్టి దిగ్విజయంగా నడిపిస్తోంది.
కానీ, ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యలో అభివృద్ధి కంటే రాజకీయ పరపతికే అగ్రతాంబూలం ఇస్తూ విద్యా రంగాన్ని దిగజారుస్తోంది. ఈ ఏడాది పీజీ ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించినా ప్రవేశాలను మాత్రం విడివిడిగా విశ్వవిద్యాలయలు సొంతంగా నిర్వహించుకునేందుకు పావులు కదుపుతోంది. వచ్చే ఏడాది నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్షను రద్దు చేసి పాత పద్ధతిలోనే వర్సిటీ విడిగా ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించుకుని ప్రవేశాలు చేపట్టేందుకు వీలుగా జీఓలను సవరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రైవేటులో పీజీకి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏదీ?
ఎన్నికల సమయంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, కూటమి నాయకులు ప్రైవేటు పీజీ విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని నమ్మబలికి విద్యార్థులను నిలువునా ముంచేశారు. తొలి ఏడాది ఎగ్గొట్టడమే కాకుండా ఈ ఏడాదీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే అవకాశం లేదని తేల్చేశారు. పైగా ప్రైవేటు యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశపూర్వంగా పీజీ ప్రవేశాలను ప్రభుత్వ తాత్సారం చేస్తోంది.
ఫలితంగా పీజీసెట్‌లో అర్హత సాధించిన చాలా మంది విద్యార్థులు విద్యా సంవత్సరం ఆలస్యం అవుతుందనే భయంతో అప్పులు చేసైనా ప్రైవేటు కళాశాలల్లో, ప్రైవేటు వర్సిటీల్లో చేరిపోయారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉచిత సీటు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి తిరోగమన నిర్ణయం తీసుకుంటుందో తెలియక ప్రైవేటు బాట పట్టారు.
పీజీఈసెట్‌లో ఎంటెక్ సంగతేంటి?
పీజీఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలూ విడుదలై రెండు నెలలు దాటింది. కానీ, ఇప్పటి వరకు ఎంటెక్ ప్రవేశాలు షెడ్యూల్ ప్రకారం జరగట్లేదు. ముఖ్యంగా బీటెక్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉండడంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో ఎంటెక్‌లో కౌన్సెలింగ్‌కు సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయలేని పరిస్థితి. ఉన్నత విద్యా మండలి సర్టిఫికెట్లు వెంటనే విడుదల చేయాలని కళాశాలలను కోరినా.. ప్రభుత్వం రూ.4200 కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.2200 కోట్లు హాస్టల్ మెయింటెనెన్స్ బిల్లులను బకాయిలు పెట్టడంతో ప్రైవేటు యాజమాన్యాలు ససేమీరా అంటున్నాయి.
ఇప్పటికీ విద్యార్థులకు సర్టిఫికెట్లు రాకపోవడం, కోర్టు కేసుల దృష్ట్యా వాయిదా పడిన ఎంటెక్ ప్రవేశాలకు సవరణ షెడ్యూల్ ఇంకా రాకపోవడం గమనార్హం. మరోవైపు ఐసెట్‌లో భాగంగా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు రెండో దశ కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ఎదురు చేస్తున్నారు. ఇక ఈఏపీసెట్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాలు తుది దశ(రెండో)కౌన్సెలింగ్ ముగిసినా ప్రైవేటు యాజమాన్యాలు మూడోదశ కౌన్సెలింగ్‌కు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. దానికి షెడ్యూల్ రావాల్సి ఉంది. ముఖ్యంగా ఫార్మసీ కోర్సుల్లో యూజీ, పీజీ విభాగాల్లో కౌన్సెలింగ్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి.