టెన్షన్‌.. టెన్షన్‌..  

Coalition Politics  Congress In Telangana - Sakshi

సాక్షి, కొత్తగూడెం (ఖమ్మం): వచ్చే నెలలోనే ఎన్నికలు జరుగనున్నట్లు వార్తలు వస్తుండడంతో రాజకీయ       పార్టీల్లో వేడి తారాస్థాయికి చేరుకుంది. గత నెల 6న అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్‌.. అదే రోజున 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు రగులు తున్నప్పటికీ అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలతో కూటమిగా ఏర్పడింది. కూటమి ఏర్పాటు, చర్చల ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. కూటమిలో ఉన్న పార్టీలలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలనే విషయమై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల మధ్య సీట్ల విషయమై ఎటూ తేలడం లేదు. ఈ జిల్లాలో ఈ పార్టీలన్నింటికీ గట్టి ప్రాబల్యం ఉండడంతో సీట్ల విషయంలో ఎవరికి వారు పట్టుపడుతున్నారు.

ముఖ్యంగా సీపీఐ కొత్తగూడెం సీటు విషయమై గట్టిగా పట్టు పడుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, సీపీఐ మధ్య ఈ విషయమై పీటముడి వీడడం లేదు. అశ్వారావుపేట సీటు కోసం టీడీపీ పట్టుపడుతోంది. ఇలా జిల్లాలోని మిగిలిన సీట్ల విషయంలోనూ గందరగోళమే నెలకొంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతి సీటు కీలకం కావడంతో కాంగ్రెస్‌ పార్టీ విడతలవారీగా ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంది. ఏ నియోజకవర్గం ఏ పార్టీకి కేటాయిస్తే గెలుపు సాధ్యమవుతుందనే అంశం ప్రధానంగా ఈ సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. దీంతో ఏ సీట్లు ఏ పార్టీకి కేటాయిస్తారో అనే విషయమై టెన్షన్‌ నెలకొంది. ఇప్పటికే ఎన్నికల ఫీవర్‌ నేపథ్యంలో అన్ని పార్టీలు అటెన్షన్‌ స్థితిలోకి వచ్చాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించడంతో వారు ప్రచార రంగంలో దూసుకెళుతున్నారు. ఇప్పటికే ఒక విడత ప్రచారం సైతం పూర్తి చేశారు. ఈ క్రమంలో కూటమి పార్టీలు అటెన్షన్‌లో ఉన్నప్పటికీ ఆయా పార్టీల శ్రేణుల్లో మాత్రం టెన్షన్‌ నెలకొంది.
 
మథనపడుతున్న ఆశావహులు..  
కూటమిలో సీట్ల కేటాయింపులు మరింత సాగతీతగా ఉండడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. దీని కోసం ఎదురుచూస్తూనే టికెట్ల కోసం ఎవరికి వారు తమవంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా తాము ఆశించే సీటు మరో పార్టీకి వెళితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వారిలో నెలకొంది. మరోవైపు, టికెట్‌ తమకు కాకుండా పార్టీలో మరొకరికి వెళితే ఏవిధంగా ముందుకెళ్లాలి అని ఎవరికి వారు తీవ్రంగా ఆలోచనలు చేస్తున్నారు. పొత్తుల్లో ఇతర పార్టీకి పోయినా, లేదా తామున్న పార్టీలోనే టికెట్‌ మరొకరు దక్కించుకున్నా.. తాము ఇతర పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు కొందరు ఆశావహులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో సమయం మించిపోతుండడంతో ఎటూకాకుండా పోతామోననే ఆందోళన కూడా వారిలో మొదలైంది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు చెందిన పలువురు ఆశావహులు ఇప్పటికే బీజేపీతో టచ్‌లో ఉన్నారు.
  
కూటమిలో ఏ సీటు ఎవరిదో..  
కాంగ్రెస్‌ కూటమికి సంబంధించి ఇతర ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ ప్రత్యేక పరిస్థితి నెలకొంది. ఇక్కడున్న ఐదు సీట్లలో దాదాపు అన్ని సీట్లలో తమకు బలముందని ఆయా పార్టీలు చెబుతున్నాయి. మూడు పార్టీలు గట్టి పట్టుమీద ఉండడంతో ఒక సీటు కాకపోతే మరో సీటులో పీటముడి నెలకొనే పరిస్థితులు ఏర్పాడ్డాయి. కొత్తగూడెం విషయంలో సీపీఐ పట్టుబడుతుండగా, పినపాక, భద్రాచలం స్థానాల్లో సీపీఐకి ఏదో ఒకటి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ అశ్వారావుపేటతో పాటు పినపాక, భద్రాచలంలలో ఒక సీటు ఇవ్వాలని కోరుతోంది. అయితే అశ్వారావుపేట సీటు టీడీపీకి ఇవ్వవద్దని కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి. దీంతో మూడు పార్టీల మధ్య ఐదు ముక్కలాట అనేలా పరిస్థితి తయారైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top