బస్తీమే తోటికోడళ్ల సవాల్‌..!

Co-Sisters Contesting From Kodada Constituency  - Sakshi

  ఒకరు కాంగ్రెస్‌ తరఫున.. మరొకరు టీఆర్‌ఎస్‌ వైపు

  ఆసక్తిగా గమనిస్తున్నకోదాడ వాసులు 

సాక్షి, కోదాడ : ఎన్నికల వేళ కోదాడ పట్టణంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బుధవారం పట్టణంలో ఏ సెంటర్‌లో చూసినా ఇదే చర్చ సాగుతోంది. ఔరా రాజకీయం అంటే ఇదే మరీ అంటూ ప్రజలు గొనుక్కుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే 2014లో కోదాడ మున్సిపల్‌ చైర్మన్‌ బీసీ మహిళకు కేటాయిం చారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున సీనియర్‌ నాయకుడు వంటిపులి గోపయ్య పెద్దకోడలు వంటిపులి నాగలక్ష్మి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా 30వ వార్డులో బరిలోకి దిగారు. ముందుజాగ్రత్తగా ఆయన చిన్న కోడలు వంటిపులి అనిత కూడా 19వ వార్డులో టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పారా సత్యవతిపై పోటీకి నిలబడ్డారు.

అనూహ్యంగా కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి వంటిపులి నాగలక్ష్మి పరాజయం పాలయ్యారు. మరో పక్క టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పారా సత్యవతిని గోపయ్య చిన్నకోడలు ఓడించింది. దీంతో వంటిపులి అనితను చైర్‌పర్సన్‌ పదవి వరించింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో అనిత టీఆర్‌ఎస్‌లో చేరగా, గోపయ్యతో పాటు పెద్ద కోడలు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. బుధవారం పెద్దకోడలు నాగలక్ష్మి, ఆమె భర్త వెంకటేశ్‌  కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా పట్టణంలో ప్రచారం నిర్వహించారు. మరో పక్క టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బొల్లం మల్లయ్యకు మద్దతుగా చైర్‌పర్సన్‌ వంటిపులి అనిత, ఆమె భర్త నాగరాజులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వీరి ప్రచారాన్ని చూసిన ప్రజలు రాజకీయాలు కుటుంబాలను కూడా వేరు చేస్తాయి కాబోలు అనుకోవడం కనిపించింది. 

మరిన్ని వార్తాలు...

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top