సాగు కాదు.. తాగు అవసరాలకే!

CM KCR promises drinking water to Tamil Nadu - Sakshi

గోదావరికి వరద అధికంగా ఉంటేనే తమిళనాడుకు తాగునీరు 

సాగు అవసరాలకు నీరివ్వాలన్న ప్రతిపాదనకు సీఎం తిరస్కరణ 

సాక్షి, హైదరాబాద్‌:  తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్న తమిళనాడు తాగునీటి అవసరాలను తీర్చే దిశగా లోతైన అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గోదావరి బేసిన్‌లో రాష్ట్ర తాగు, సాగు అవసరాలు తీరాక, వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిలో నుంచే కొంత నీటిని తమిళనాడు తాగునీటి అవసరాలకు ఇవ్వాలని తెలంగాణ సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేంద్రం ప్రతిపాదించిన గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియతో సంబంధం లేకుండా తాగునీటి అవసరాలకే పరిమితమవుతూ సహకార ధోరణితో తమిళనాడుకు చేయూతనిచ్చే దిశగా బాటలు వేసింది. 

సాగుకైతే నో.. తాగుకైతే ఓకే.. 
ఏటా వేసవిలో చెన్నై నగర తాగునీటి కష్టాలు తీర్చేందుకు రైల్వే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కించే క్రమంలో ఏప్రిల్‌ 18, 1983లో తమిళనాడుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు.. చెన్నైకి తాగునీటి అవసరాల కోసం కృష్ణా బేసిన్‌లోని కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చెరో 5 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ వాటా కింద 3.3, తెలంగాణ వాటా కింద 1.7 టీఎంసీలు విడుదల చేయాలి. ఏటా చెన్నై తాగునీటి అవసరాలకు 3 నుంచి 8 టీఎంసీలకు మించి విడుదల కావట్లేదు. దీంతో తాగునీటి కష్టాలు తీరడం కష్ట సాధ్యమవుతోంది. దీన్ని దృష్ట్యా కేంద్రం, గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియను తెరపైకి తెచ్చింది.

ఈ అనుసంధానం ద్వారా కనీసం 200 టీఎంసీల నీటిని తమిళనాడు తాగు, సాగు అవసరాలను తీర్చాలని నిర్ణయించింది. దీనికి రూ.60 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.ఈ ప్రతిపాదనకు ఓవైపు చత్తీస్‌గఢ్‌ అభ్యంతరం చెబుతుండగా, తెలంగాణ, ఏపీలు సైతం తమ అవసరాలు పోయాకే మిగిలిన నీటిని తరలించాలని వాదిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో తమిళనాడు మంత్రుల బృందం కేంద్ర ప్రతిపాదనను ఆమోదించి, తమ కష్టాలు తీర్చాలని సీఎం కేసీఆర్‌ను కలిసింది. సాగు అవసరాలను తెరపైకి తెస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవని, అదీకాక సాగు అవసరాలంటే కేంద్ర సంస్థల నుంచి అనుమతులు అనివార్యం అవుతాయని సీఎం చెప్పినట్లు సమాచారం.

అదే తాగు అవసరాలకైతే పొరుగు రాష్ట్రాలు సహా, కేంద్రం సహకారం అందిస్తాయని సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. కృష్ణాలో తగినంత నీటి లభ్యత లేనం దున గోదావరి నీటిని, అదీ వరద ఎక్కువగా ఉండి వృథాగా సముద్రంలోకి వెళ్తున్న సమయంలోనే 50–60 టీఎంసీల నీటిని తమిళనాడుకు తరలిస్తే తమకు అభ్యంతరం ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గోదావరి నుంచి నీటిని ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై అధ్యయనం జరగాలని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికే చెన్నై తాగునీటి అవసరాలకు శ్రీశైలం నుంచి తెలుగుగంగ ద్వారా నీటిని విడుదల చేస్తున్నా, అవి చెన్నై వరకు చేరట్లేదు.

తెలుగుగంగ కాల్వల పరిధిలో భారీగా వ్యవసాయ మోటార్లు ఉండటంతో 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే అవి తమిళనాడులోని పూండీ రిజర్వాయర్‌కు చేరే వరకు 900 క్యూసెక్కులే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పైప్‌లైన్‌ ద్వారా నీటిని తరలించే అంశంపై అధికారుల స్థాయిలో చర్చలు జరగాలని, వారు అంగీకారానికి వచ్చాక ఏపీతో కలసి 3 రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం చేద్దామని కేసీఆర్‌ పేర్కొన్నట్లు తెలిసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top