లాక్‌డౌన్‌ 15న ఎత్తేసే చాన్స్‌ లేదు

CM KCR Press Meet In Pragathi Bhavan About Lockdown Condition In Telangana - Sakshi

రాష్ట్రం, దేశం స్థిమితపడాలి

లేకుంటే మళ్లీ వైరస్‌ అంటుకునే ప్రమాదముంటది

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తమా? ఎంత ఇస్తం? తెలియని పరిస్థితి

రెవెన్యూ పూర్తిగా పడకేసింది

కరోనాపై ఏ రోజుకారోజు బులెటిన్‌ విడుదల చేస్తున్నం

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 15న రాష్ట్రంలో ఎత్తేసే అవకాశం అసలు లేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘నలుగురితో నారాయణ మనం. మనది చాలా పెద్ద దేశం. అంతా మంచిగుందని అనుకున్న తర్వాత ఒకరికి వైరస్‌ వస్తే పరిస్థితి ఏంటి? మళ్లీ అంటుకొనే ప్రమాదం ఉంటది. ముందు రాష్ట్రం, తర్వాత దేశం స్థిమిత పడాలి. ఆ విషయాన్ని మన వైద్య నిపుణులు చెబు తరు. ఈ విపత్కర పరిస్థితి నుంచి తొందరగా బయటపడాలని అందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థిస్తున్న. బయటపడే వరకు నియంత్రణ పాటించాలి. మనకు మరో గత్యంతరం లేదు’ అని ఏప్రిల్‌ 15న లాక్‌డౌన్‌ ఎత్తి వేసేందుకు ఉన్న అవకాశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

కరోనా వైరస్‌ ఎంత దూరం పోతదో మనకు తెలియదు. ఎప్పుడు విస్ఫోటనం లాగా విజృంభిస్తదో అంతు చిక్కకుండా ఉంది. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల సేవల కోసం సీఎస్‌ ప్రకటన జారీ చేశారు.100 మంది అవసరమైతే 130 మందిని సిద్ధం చేసుకోవాలి. వారి సేవలు అవసరమైనప్పుడు వారికి డబ్బులిస్తరు. 60 ఏళ్లలోపు వయసుగల సాంకేతిక అర్హతలున్న వారు అర్హులే. పీజీ చేసిన వారు, రిటైరైన డాక్టర్లు, ఎంబీబీఎస్‌ పాసైన వారిని తీసుకుంటం. పరిస్థితి ఎంతవరకు వెళ్లినా ఎదుర్కొనే సత్తా మనకు ఉంది. రిటైరైన ఆర్మీ వాళ్లు.. సేవాభావం ఉన్న వాళ్లు రావాలి’అని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ఆదివారం ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం కేసీఆర్‌ ఆ వివరాలను విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తమా?
ఈపాటికి మనకు రూ. 12 వేల కోట్లు రావాలి. మార్చి 15 నుంచి ఆదాయం అంతా సున్నాలా ఉంది. ఎక్సైజ్, పెట్రోల్, జీఎస్టీ అన్నీ బంద్‌. ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్‌ పెట్టాల్సి వస్తే బంద్‌ పెడ్తం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా కోత కోయాల్సి వస్తే కోయాలి కదా. దీనికి ఎవరూ అతీతులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో భాగం కదా. కష్టం వస్తే అందరూ పంచుకోవాలి. ఇది లగ్జరీ సమయం కాదు. సంక్షోభంలో ఉన్నం. అందరూ తగ్గించుకోవాలి. రెండు బుక్కలకు బదులు ఒక బుక్కనే తినాల. రాష్ట్రంలో బంద్‌ అయితే కేంద్రానికి కూడా బంద్‌ అవుతది. ప్రతిదీ నిలిచిపోతుంది. రెండు నెలలో, మూడు నెలలో, నాలుగు నెలలో ఈ గండం గట్టెక్కే దాకా అందరూ ఊపిరి బిగపట్టుకొని కొంచెం నియంత్రణ పాటించాలి. అందరం రాజీపడితే ఈ సమాజం నడుస్తది. విరాళాల కోసం పిలుపు ఇవ్వాల్సిన అవసరం లేదు. గొప్పవాళ్లు వచ్చి ఇస్తున్నరు. వారికి శతకోటి దండాలు.

దుష్ప్రచారం చేసే వారిని వదలం..
సోషల్‌ మీడియా, ఇతర మీడియాలో దుర్మార్గమైన ప్రచారాలు చేసే వారిని కఠినంగా శిక్షిస్తం. చాలా భయంకరమైన శిక్షలుంటయి. ఇట్ల ఉంటయి నేను చూపిస్త. ఎంత చేస్తే దానికి 100 రెట్ల శిక్ష అనుభవిస్తరు. ఇలా చేసే వారికి అందరికంటే ముందు కరోనా సోకుతది... సోకాలి కూడా. ఆరోగ్య మంత్రి రోజూ 2–3 సార్లు సమీక్ష చేస్తున్నరు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అవసరాన్నిబట్టి బులెటిన్‌ విడుదల చేస్తున్నం. కేసుల వివరాలను ప్రభుత్వమే చెబుతోంది. దాయాల్సిన అవసరం ఏముంది? అందరికీ తెల్వాలి. రెండు సందర్భాల్లో కేసులు పెరిగినయి. ఇండోనేసియా నుంచి 10 మంది వచ్చారు. మరోసారి 10 కేసులు పెరిగినయి. నిన్న ఒక వ్యక్తి చనిపోయిండు. ప్రభుత్వమే అన్నీ బయటపెట్టింది. మరణించిన వ్యక్తి మన కంట్రోల్‌లో చనిపోలేదు. అయినా ప్రభుత్వం సమాచారాన్ని ఆపలేదు. వ్యాప్తి చెందుతుంటే, కంట్రోల్‌ దాటుతుంటే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు మనమే చెబుతం. దుర్మార్గులకు ఫస్ట్‌ కరోనా పట్టుకోవాలని నేను శాపం పెడుతున్న.

ఢిల్లీ నుంచి వచ్చిన వారందరినీ పట్టుకున్నం..
ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారందరినీ పట్టుకొచ్చినం. ఒకచోట 130మందిని, కొత్తగూడంలో 200 మందిని పట్టుకున్నరు. ఒకరు ఏపీలో పెళ్లికి కూడా వెళ్లి వచ్చిండు. అక్కడ వారికి కూడా సమాచారం ఇచ్చినం. 

70 పాజిటివ్‌ కేసులు..
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 70కి పెరిగాయి. ఒక వ్యక్తి మొదట్లోనే డిశ్చార్జ్‌ అయ్యాడు. అతను ఆదివారం ప్రధానితో మాట్లాడిండు. గాంధీ ఆస్పత్రిలో బాగా చూశారు. ఇక్కడ వైద్యులు ఆత్మవిశ్వాసం నింపడంతో బతకడానికి దోహపడిందని చెప్పాడు. చికిత్స పొందుతున్న రోగుల్లో ఆదివారం 11 మందికి నెగెటివ్‌ రావడం మంచి వార్త. వారికి బీమారీ పోయింది. నిబంధల ప్రకారం తుది పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలిన తర్వాతే సోమవారం వారిని డిశ్చార్జి చేస్తారు. డిశ్చార్జికి ముందు వారి ఛాతీ ఎక్స్‌రే తీసుకోవాలి. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యేక మళ్లీ తుది పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌ వస్తే ఇళ్లకు పంపిస్తం. మన దగ్గర ఇక చికిత్సలో 58 మంది మాత్రమే మిగులుతారు. 76 ఏళ్ల ఒక రోగికి కిడ్నీ, ఇతర సమస్యలున్నాయి. ఆయనొక్కడు తప్ప మిగతా వారంతా సక్కగా ఉన్నరు. అందరికందరూ కోలుకొని ఇళ్లకు వెళ్లిలా ఉన్నరు.

క్వారంటైన్‌లో 25,937 మంది...
విదేశాల నుంచి వచ్చిన మొత్తం 25,937 మందిపై నిఘా పెట్టుకున్నం. విదేశాల నుంచి కరోనా వ్యాధి మొసుకొచ్చివారు, విదేశాల నుంచి వచ్చిన వ్యాధి అనుమానితులు, జబ్బు బారినపడినవారు కలిపితే 25,937 మంది అవుతారు. ఇందులో చాలా మంది క్వారంటైన్‌ గడువు మార్చి 30 నుంచి ముగుస్తుంది. ఆ తర్వాత మా పర్యవేక్షణ అవసరం లేదు. వారిలో కరోనా లక్షణాలు కూడా రాలేదు. ఏప్రిల్‌ 7కు క్వారంటైన్‌లో ఉండే వారి సంఖ్య సున్నా అయ్యే పరిస్థితి ఉంది. మార్చి 30న (నేడు) 1,899 మంది, మార్చి 31న 1,440 మంది, ఏప్రిల్‌ 1న 1,461 మంది, ఏప్రిల్‌ 2న 1,887, ఏప్రిల్‌ 3న 1,476, ఏప్రిల్‌ 4న 1,453 మంది, ఏప్రిల్‌ 5న 914, ఏప్రిల్‌ 6న 454, ఏప్రిల్‌ 7న 397 మంది క్వారంటైన్‌ గడువు ముగుస్తుంది. ఏప్రిల్‌ 7 తర్వాత రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన వ్యక్తి ఉండడు. ఆలోగా ఆస్పత్రిలో చికిత్స పొంతుతున్న వారిలో 35 మందికిపైగానే డిశ్చార్జి అవుతారు. ఇక మన దగ్గర 10 మంది ఉంటరు. అంతర్జాతీయ విమానాలు, పోర్టులు బంద్‌ అయ్యాయి కాబట్టి అంతర్జాతీయంగా వ్యాధి వచ్చే ప్రమాదం లేదు. లోకల్‌గా వచ్చి అంటించే అవకాశముందని కొత్తగూడెం, కరీంనగర్‌ కేసుల బాధితులను వివిధ ఆస్పత్రుల్లో పెట్టినం. వారు నిఘాలో ఉన్నరు.

అంతర్జాతీయంగా ప్రశంసలు...
కరోనాపై పోరులో భారత్‌ తెలివిగా వ్యవహరించిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ సైన్స్‌కి సంబంధించిన మేధావులు అంతర్జాతీయ మ్యాగజైన్స్‌లో రాశారు. పేద దేశం, ఇప్పుడే అభివృద్ధి బాటలో పయనిస్తున్న మన దేశంలో ఉండాల్సిన స్థాయిలో పటిష్ట వైద్య సదుపాయాలు లేవు. లాక్‌డౌన్‌ చేయడమనే ఏకైక ఆయుధాన్ని భారత్‌ కరెక్ట్‌గా ప్రయోగించింది. 130 కోట్ల మంది ఉన్న దేశంలో సమస్య పెరగనివ్వలేదని అంతర్జాతీయ స్థాయిలో మెచ్చుకుంటున్నరు. ఈ గండం నుంచి పూర్తిగా బయటపడే వరకు ప్రజలు గుంపులుగా గుమికూడకపోవడం, స్వీయ నియంత్రణ, లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించడం, వైద్య, పోలీసు అధికారులకు సహకరించడం చేయాలి. దక్షిణ కోరియాలో ఒకే ఒక వ్యక్తి తనకు తెలియకుండానే 59 వేల మందికి వ్యాధిని అంటించాడు. ఒక సూది మొన మీద కొన్ని కోట్ల కరోనా క్రిములుంటయి. ఇది చాలా ప్రమాదకర వైరస్‌. ఈ గండం గట్టెక్కే వరకు ప్రజలు బాగున్నమని అనుకోవద్దు. ఏ నిమిషంలో ఏ విధమైన డెవలప్‌మెంట్‌ ఉంటదో తెల్వదు. తీవ్ర క్రమశిక్షణ అవసరం. ఇప్పటివరకు బాగా సహకరిస్తున్నారు. కదలికలు తగ్గాయి. ప్రజలు సహకరిస్తే తక్కువ నష్టంతో బయటపడవచ్చు. 

ఉద్యోగుల జీతాలపై..
ఈ పాటికి మనకు రూ. 12 వేల కోట్లు రావాలి. మార్చి 15 నుంచి ఆదాయం అంతా సున్నాలా ఉంది. ఎక్సైజ్, పెట్రోల్, జీఎస్టీ అన్నీ బంద్‌. ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్‌ పెట్టాల్సి వస్తే బంద్‌ పెడ్తం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా కోత కోయాల్సి వస్తే కోయాలి కదా. దీనికి ఎవరూ అతీతులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో భాగం కదా. కష్టం వస్తే అందరూ పంచుకోవాలి. ఇది లగ్జరీ సమయం కాదు.

ధాన్యం కొనుగోలుపై..
ధాన్యం కొనడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. ఇంత కఠిన పరిస్థితిలో కూడా ధాన్యం సేకరణ కోసం సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు రూ. 25 వేల కోట్లు సమీకరించినం. కార్పొరేషన్‌కు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సమీకరించడం చరిత్రలో ఇదే తొలిసారి. మక్కల కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్‌కు రూ. 3,200 కోట్లు కలిపి రైతుల కోసం సుమారు రూ. 30 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమీకరించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top