సాగునీటి సమస్యపై జిల్లా నేతలతో చర్చించిన సీఎం | CM KCR Meets with Nizamabad District Leaders on Irrigation Projects | Sakshi
Sakshi News home page

సాగునీటి సమస్యపై జిల్లా నేతలతో చర్చించిన సీఎం

Sep 20 2019 9:35 AM | Updated on Sep 20 2019 9:36 AM

CM KCR Meets with Nizamabad District Leaders on Irrigation Projects - Sakshi

సీఎంతో సమావేశంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: నిజాంసాగర్, సింగూరులో నీటి లభ్యత తక్కువగా ఉన్నందువల్ల, ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది తాగునీరు అందించడానికి ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. సాగునీరు, తాగునీరు, పోడు భూముల సమస్యను ప్రజలతో చర్చించి, శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే నెలలో రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తానని సీఎం ప్రకటించారు. 

‘పునరుజ్జీవం’తో ... 
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో భరోసా లభించినట్లయిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. గుత్ప అలీసాగర్‌ల మాదిరిగానే మరికొన్ని చోట్ల ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి.. బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సాగునీరు అందివ్వాలని సీఎం చెప్పారు. ఇందుకోసం తక్షణం సర్వే చేపట్టాలని, ఏఏ గ్రామాల పరిధిలో ఎన్ని ఎకరాలకు నీరందించవచ్చనేది తేల్చాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి ఏటా 90 టీఎంసీలకు తక్కువ కాకుండా ఎస్సారెస్పీని నింపాలని ప్రభుత్వం నిర్ణయించినందున, దీని నుంచి ఎంత వీలయితే అంత ఆయకట్టుకు నీరివ్వాలని చెప్పారు.  

నిజాంసాగర్‌ ఆధారిత గ్రామాలకు.. 
రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండినా.. సింగూరు, నిజాంసాగర్‌లకు మాత్రం చాలినంత నీరు రాలేదన్నారు. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ సారి మంచినీరు అందించడానికి ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలన్నారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ నుంచి, పరిగి నుంచి, కోమటిబండ నుంచి, ఎస్సారెస్పీ నుంచి.. ఇలా ఎలా వీలయితే అలా.. వీలయినన్ని మిగతా చోట్ల ట్యాంకర్ల ద్వారా, బోర్ల ద్వారా నీరందించాలన్నారు. ఒక్క ఏడాదే సింగూరు, నిజాంసాగర్‌ పరిధిలో ఈ సమస్య ఉంటుందని, వచ్చే ఏడాది నాటికి మల్లన్నసాగర్‌ ద్వారా ఈ రెండు ప్రాజెక్టులకు  నీరందుతుందన్నారు. ప్రజలు వేసవిలో ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలన్నారు. 

పోడుభూముల సమస్యకూ పరిష్కారం.. 
ఉమ్మడి జిల్లాలోని కొన్ని చోట్ల పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇబ్బందులున్నాయని, అటవీ , రెవెన్యూశాఖ మధ్య కూడా వివాదాలున్నాయని సీఎం అన్నారు. వచ్చే నెలలో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులు పర్యటించి స్థానికులతో చర్చించి అటవీ సంబంధమైన సమస్యలన్నింటిని  పరిష్కరిస్తామన్నారు. అదే సందర్భంగా  సాగునీటి కోసం, మంచినీటి కోసం శాశ్వత ప్రాతిపదికన చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామని సీఎం వెల్లడించారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, హన్మంత్‌షిండే, బిగాల గణేష్‌గుప్త, సురేందర్, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ రావు, ఎస్‌ఈలు శంకర్, సుధాకర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ కృపాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement