టెండర్లు వద్దు.. నేరుగా కొనండి!

CM KCR decision on purchase of subsidized Buffalos - Sakshi

     సబ్సిడీ బర్రెల కొనుగోలుపై సీఎం నిర్ణయం 

     లబ్ధిదారులతో రాష్ట్రాలకు వెళ్లనున్న పశువైద్యులు 

     పథకం మార్గదర్శకాలను ప్రభుత్వానికి పంపిన అధికారులు 

     2.13 లక్షల గేదెలు, ఆవుల కొనుగోలుకు సన్నాహాలు 

     వచ్చే నెలలో పథకం ప్రారంభం!

సాక్షి, హైదరాబాద్‌: పాడి రైతులకు సబ్సిడీపై ఇచ్చే బర్రెలు, ఆవుల కొనుగోలుకు టెండర్లు పిలవకూడదని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాటిని ఎలా కొనాలన్న దానిపై పశుసంవర్థకశాఖ అధికారులు రెండు రకాల పద్ధతులను ప్రభుత్వానికి నివేదించారు. ఒకటి టెండర్లు పిలవడం, మరొకటి నేరుగా లబ్ధిదారులతో వెళ్లి కొనుగోలు చేయడం. ఈ రెండింటిలో నేరుగా కొనుగోలు చేయడం వైపే సీఎం కేసీఆర్‌ మొగ్గు చూపినట్లు పశుసంవర్థకశాఖ వర్గాలు తెలిపాయి. అంటే సబ్సిడీ గొర్రెల మాదిరిగానే బర్రెలను కూడా నేరుగా కొనుగోలు చేయనున్నారు. అలాగే ఈ బర్రెలను ఎలా పంపిణీ చేయాలన్న దానిపై పశుసంవర్థకశాఖ మార్గదర్శకాలు తయారు చేసి సీఎం ఆమోదానికి పంపినట్లు సమాచారం. సీఎం ఆమోదించాక పథకం ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. 

టెండర్ల ప్రక్రియ వైపే అధికారుల మొగ్గు 
సబ్సిడీ గొర్రెల కొనుగోలులో అనేక సమస్యలు వచ్చాయి. అనేక చోట్ల పేపర్‌ పైనే కొన్నట్లు, మరికొన్ని చోట్ల రీసైక్లింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చా యి. దీంతో ఈ బర్రెల కొనుగోలుకు సంబంధించి టెండర్ల ద్వారా వెళితేనే మంచిదన్న అభిప్రాయాన్ని పశుసంవర్థకశాఖ ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల ద్వారా వెళితే ఆవు లేదా గేదె ప్రమాణాల ప్రకారం లేకుంటే కాంట్రాక్టర్‌దే బాధ్యత ఉంటుందన్నారు. పైగా పశు వైద్యులు వివిధ రాష్ట్రాలకు వెళ్లడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వారు చెబుతున్నారు.  

ఆ నాలుగు డెయిరీల పాడి రైతులకే...  
ప్రభుత్వం సబ్సిడీపై బర్రెలు, ఆవులను పాడి రైతులకు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతుల వాటా, ప్రభుత్వ వ్యయం కలిపి రూ.1,600 కోట్లతో ప్రణాళిక రచించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం, ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీతో రైతులకు అందజేయనుంది. రాష్ట్రంలోని పాడి రైతులందరికీ కాకుండా కేవలం విజయ డెయిరీ, కరీంనగర్‌ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, నార్ముల్‌ డెయిరీలకు పాలు పోసే రైతులకే ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో పాడి రైతుకు ఒక గేదె లేదా ఒక ఆవు వారి కోరిక మేరకు ఏదో ఒకటి ఇస్తారు. బర్రెలు కావాలా.. ఆవులు కావాలా ఏదో ఒకటి చెప్పాలని ఆయా డెయిరీలకు పశుసంవర్థకశాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది.  

2.13 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి 
రాష్ట్రవ్యాప్తంగా 2.13 లక్షల మంది పాడి రైతులకు ప్రభుత్వం బర్రెలు లేదా ఆవులను పంపిణీ చేయనుంది. అందులో 31 వేల మంది ఎస్సీ, ఎస్టీ రైతులున్నారు. హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పాడి పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పశు వైద్యులు ఆయా రాష్ట్రాలకు లబ్ధిదారులతో వెళ్లి పాడి పశువులను లారీల్లో తరలిస్తారు. ఒక్కో గేదె లేదా ఆవు యూనిట్‌ ధర రూ.62 వేల నుంచి రూ.75 వేల వరకు ఉండే అవకాశముంది. పాడి పశువులను రెండేళ్లలో పంపిణీ చేయాలని అధికారులు భావిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే పథకం మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుందని చెబుతున్నా ఆచరణలో సాధ్యం కాదని వారంటున్నారు. ఇప్పటికీ మార్గదర్శకాలు ఖరారు కాలేదని, వచ్చే నెలలో పథకం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పశుసంవర్థకశాఖ వర్గాలు తెలిపాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top