
పాడి రైతులను నిలువు దోపిడీ చేస్తున్న డెయిరీలు
వెన్న శాతంతో సంబంధం లేకుండా ధరల నిర్ణయం
గేదె పాలపై రూ.30 నుంచి రూ.40 వరకు కోత
ఆవు పాలపైనా రూ.6 నుంచి రూ.10 తగ్గింపు
రోజుకు రూ.250 నుంచి రూ.500 వరకు నష్టపోతున్న రైతులు
ఏడాది కాలంలో ఒక్క పశువును కూడా ఇవ్వని కూటమి ప్రభుత్వం
పోషణ భారమై పాడి పశువులను తెగనమ్ముకుంటున్న రైతులు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి పాలనలో పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. పశుపోషణ భారంగా మారడం, పాల సేకరణ ధరలు తగ్గించడంతో నష్టాల్లో కూరుకుపోతున్నారు. వెన్న శాతం ఎంత ఉన్నా.. ప్రైవేటు డెయిరీలు నిర్దేశించిన ధరను మాత్రమే చెల్లిస్తూ అందినకాడికి దోచుకుంటున్నాయి. ఏడాదిగా గిట్టుబాటు ధరలేక, ప్రైవేట్ డెయిరీల ఆగడాలు తాళలేక జీవనాధారమైన పశు సంపదను అమ్ముకుని పాడి రైతులు ప్రత్యామ్నాయ వృత్తుల వైపు మళ్లుతున్నారు.
అమూల్‌ను తరిమేసి.. ప్రైవేటుకు పట్టం
ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేక అమూల్ పాల సేకరణ నుంచి తప్పుకుంది. ఇప్పటికే 15 జిల్లాల్లో పాల సేకరణను నిలిపివేసింది. మిగిలిన జిల్లాల్లోనూ నామమాత్రపు పాత్రకే పరిమితమైంది. గతంలో అమూల్ సంస్థ రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ చేయగా.. ప్రస్తుతం 40 వేల లీటర్లకు మించి జరగడం లేదు. గతంలో లీటర్‌కు సగటున గేదె పాలకు రూ.89, ఆవు పాలకు రూ.42 చొప్పున ధర లభించేది. ప్రస్తుతం ప్రైవేటు డెయిరీలు గేదె పాలకు లీటరుపై రూ.50 నుంచి రూ.60 మాత్రమే ఇస్తుండగా.. ఆవు పాలకు రూ.28 నుంచి రూ.32 చొప్పున మాత్రమే చెల్లిస్తున్నాయి.
ప్రతి రైతుకు రూ.7,500 నుంచి రూ.15 వేల నష్టం
అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ప్రతి పాడి రైతుకు సగటున 4 ఆవులుంటాయి. రోజుకు 40 నుంచి 80 లీటర్ల పాలను అక్కడి రైతులు సేకరణ కేంద్రాలకు పోస్తుంటారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం లీటర్‌కు రూ.6 నుంచి 10 మేర రోజుకు రూ.250 నుంచి రూ.500 చొప్పున నష్టపోతున్నారు.
తద్వారా ప్రతి రైతుకు నెలకు రూ.7,500 నుంచి రూ.15,000 వరకు నష్టం వాటిల్లుతోంది. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాడి రైతుకు సగటున 2నుంచి 5 వరకు గేదెలుంటాయి. సగటున ఒక్కో గేదె 8 లీటర్ల చొప్పున పాల దిగుబడి వస్తుంది. గతంతో పోలిస్తే లీటర్‌కు రూ.30 నుంచి రూ.40 చొప్పున రోజుకు ఒక్కో రైతుకు రూ.250 నుంచి రూ.350కు పైగా నష్టపోతున్నారు.
నాడు క్షీర విప్లవం
వైఎస్ జగన్ ప్రభుత్వం పాడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతో జగనన్న పాల వెల్లువ కేంద్రాలను 2020 అక్టోబర్‌లో ప్రారంభించింది. 19 జిల్లాలో 4,798 గ్రామాల నుంచి పాల సేకరణ జరిగేది. 4.75 లక్షల మంది నుంచి రోజుకు సగటున అమూల్ సంస్థ 3.95 లక్షల లీటర్ల పాలను సేకరించేది. అప్పట్లో ప్రైవేటు డెయిరీలు 10 శాతం వెన్న ఉండే లీటర్ ఆవు పాలకు రూ.25 నుంచి రూ.28, గేదె పాలకు రూ.56 నుంచి రూ.60 చొప్పున చెల్లించేవి.
అమూల్ ప్రారంభంలోనే గేదె పాలకు (11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్) లీటర్‌కు రూ.71. 47, ఆవు పాలకు (5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్) రూ.34.20 చొప్పున చెల్లించింది. ఆ తర్వాత వరుసగా 8 పర్యాయాలు ధరలు పెంచడంతో గతేడాది మే నాటికి గేదె పాలకు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున సగటు ధర చెల్లించేది. ఇలా 40 నెలల్లో గేదె పాలకు లీటర్‌పై రూ.18.29, ఆవు పాలపై రూ.9.49 చొప్పున పెంచడంతో లీటర్‌కు గేదె పాలపై రూ.15 నుంచి రూ.20, ఆవు పాలపై రూ.10నుంచి రూ.15 వరకు రైతుకు అదనంగా లబ్ధి చేకూరేది.
మరోవైపు వెన్న, ఎస్‌ఎన్‌ఎఫ్ శాతాన్ని లెక్కగట్టి 10 రోజులకు ఒకసారి నేరుగా వారి ఖాతాలకు అదనంగా నగదు జమ చేసేవారు. ఫలితంగా గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవు పాలకు లీటర్‌కు రూ.53.86 చొప్పున గరిష్ట ధర లభించింది. దీంతో ప్రైవేట్ డెయిరీలు అమూల్ పోటీని తట్టుకోలేక గేదె పాలపై లీటర్‌కు రూ.14, ఆవు పాలపై రూ.7 వరకు సేకరణ ధర పెంచక తప్పలేదు.
ప్రైవేట్ డెయిరీల దోపిడీ హద్దుమీరింది
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమూల్ ప్రాజెక్టు అటకెక్కింది. ప్రైవేట్ డెయిరీల దోపిడీకి తెరలేచింది. ఒక్కొక్కటి రూ.లక్షకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన పశువులను రూ.50నుంచి రూ.60 వేలకు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం నెలకు రూ.15 వేలు మిగలడం గగనంగా మారింది. – ఎన్.మురళీమోహన్‌రెడ్డి, మరిమిరెడ్డివారిపల్లె, అన్నమయ్య జిల్లా
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
మాకు మూడు పాలిచ్చే ఆవులున్నాయి. రెండు పూటలు కలిపి 20 లీటర్ల వరకు డెయిరీకి పాలు పోస్తున్నాం. గతంలో లీటర్‌కు రూ.35 నుంచి రూ.42 వరకు వచ్చేది. కానీ.. ఇప్పుడు లీటర్‌కు రూ.30 నుంచి రూ.33 ఇస్తున్నారు. ఈ నెల నుంచి మరో రూ.2 తగ్గుతుందంటున్నారు. పరిస్థితులు ఇలా ఉంటే పశుపోషణ ఏ విధంగా చేయగలం. డెయిరీలు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. పాల సేకరణ ధరలు తగ్గడమే తప్ప పెరగడం లేదు. ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. – భాస్కర్ నాయుడు, అనంతపురం, చిత్తూరు మండలం
పాడిని వదులుకోవడం తప్ప మరో మార్గం లేదు
మాకు మొత్తం ఐదు ఆవులుంటే.. ఇందులో పాలిచ్చేవి రెండున్నాయి. ఇవి రోజుకు 20లీటర్ల పాలు ఇస్తే.. డెయిరీకి పోస్తున్నాం. గతంలో డెయిరీలు లీటర్‌కు రూ.35 నుంచి రూ.40వరకు ఇచ్చేవి. 15 రోజులకు ఒకసారి బిల్లు చెల్లించేవారు. నెలకు రూ.30వేలకు పైగా ఆదాయం వచ్చేది.
కానీ గతేడాది నుంచి పాల సేకరణ ధర తగ్గించేస్తూ వచ్చారు. ప్రస్తుతం లీటర్ పాల ధర రూ.22–30 మధ్య వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.15వేలకు మించి రావడం లేదు. దాణా ఖర్చులు పోనూ పెద్దగా మిగలడం లేదు. ఈ స్థాయిలో ధరలు తగ్గిస్తే పశు పోషణ ఎలా సాధ్యం? – ఎం వెంకటేశ్, తయ్యూరు, ఎస్‌ఆర్‌పురం మండలం, చిత్తూరు జిల్లా