
కేంద్రం ఉచితంగా ఇచ్చే బియ్యం పంపిణీలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం
ఎఫ్‌పీ దుకాణాలకు అలాట్‌మెంట్ ఇచ్చినా ఇంకా కదలని సరుకు
ఎంఎల్‌ఎస్ పాయింట్లలో గింజ కూడా లోడ్ కాని దుస్థితి
స్టేజ్–2 కాంట్రాక్టర్లకు నెలల తరబడి పేరుకుపోయిన బకాయిలు
పాఠశాలలు, వసతి గృహాలకు రవాణాతో ప్రతి నెలా నష్టాలే
సర్కారు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ల సహాయ నిరాకరణ
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు నిర్లక్ష్యం రాష్ట్రంలోని పేదల పాలిట శాపంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా సక్రమంగా పంపిణీ చేయలేని వైఫల్యం కొట్టొచి్చనట్లు కనిపిస్తోంది. అక్టోబరులోనే ఆలస్యంగా ముగియగా, నవంబరులో పేదలకు చేరుతాయా... లేదా... అన్నది ప్రశ్నార్థకంగా మారింది. చౌక దుకాణాల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15 మధ్య సరఫరా చేసిన అనంతరం ఆ దుకాణాలకు 17 నుంచి 30లోగా మరుసటి నెలకు రవాణా చేయాల్సి ఉంటుంది. అయితే, నవంబరు బియ్యం పంపిణీలో భాగంగా కార్డుల లెక్క ప్రకారం చౌక దుకాణాలకు రెండ్రోజుల కిందట అలాంట్‌మెంట్ జారీ చేశారు.
కానీ, ఒక్క గింజ కూడా లోడ్ కాని దుస్థితి కనిపిస్తోంది. మండల స్థాయి నిల్వ కేంద్రాల (ఎంఎల్‌ఎస్ పాయింట్) నుంచి చౌక దుకాణాలకు (ఎఫ్‌పీ) బియ్యం రవాణా చేసే స్టేజ్–2 కాంట్రాక్టర్ల సంఘం తమ సమస్యలకు పరిష్కారం చూపితే తప్ప సరుకు తరలించేది లేదని తేలి్చచెప్పడం ప్రజా పంపిణీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
రూ.50 కోట్లకు పైగా బకాయిలు
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 252 ఎంఎల్‌ఎస్ పాయింట్లున్నాయి. వీటి ద్వారా 1.45 కోట్ల మంది కార్డుదారులకు ఏటా 25.80 లక్షల టన్నుల పీడీఎస్, 1.85 లక్షల టన్నుల మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. చౌక దుకాణాలకు సరఫరా ఒక ఎత్తయితే, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు డోర్ డెలివరీ చేయడంపై కాంట్రాక్టర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. నెలకు ఏకంగా ఒక్కో ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు రూ.30వేల నుంచి రూ.40 వేలు నష్టం వస్తోందని వాపోతున్నారు.
మ పరిధి నుంచి ఈ విధానాన్ని తొలగించాలని ఐదు నెలలుగా కాంట్రాక్టర్లు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనికితోడు నెలల తరబడి బిల్లులు పెండింగ్ పెట్టడంతో ఆరి్థక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వానికి సహాయ నిరాకరణకు దిగారు. ఒక్కో ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు చెల్లింపులు నిలిచిపోయాయి.
⇒ కోస్తా ప్రాంతంలో రెండు నెలలు, రాయలసీమ జిల్లాల్లో ఏకంగా 5 నెలలుగా చెల్లింపులు లేవు. ఫలితంగా రూ.50 కోట్లకు పైగా బకాయిలున్నట్లు సమాచారం. ఇక్కడ 252 ఎంఎల్‌ఎస్ పాయింట్లలో 70 చోట్ల మాత్రమే కొత్తగా టెండర్ల ద్వారా బియ్యం రవాణా చేస్తుంటే, మిగిలినచోట్ల పాత కాంట్రాక్టర్లకే కొనసాగింపు ఇవ్వడం గమనార్హం. మూడు నెలలు కొనసాగించాల్సిన చోట ఏకంగా ఆరు నెలలు ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
మేం చెయ్యలేం!
బియ్యం రవాణా విషయంలో స్టేజ్–2 కాంట్రాక్టర్ల సమస్యలపై పౌర సరఫరాల సంస్థలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎండీ ఢిల్లీరావు దృష్టి సారించారు. కాంట్రాక్టర్లు, పౌర సరఫరాల సంస్థ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం నేరుగా కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని బియ్యం తరలింపు ప్రారంభించాలని కోరారు. కాగా, ప్రతి నెలా ప్రభుత్వం ఇదే సమాధానం చెబుతోందని, తమ గోడు పట్టించుకోవట్లేదని కాంట్రాక్టర్లు తెలిపారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని తేల్చి చెప్పినట్టు సమాచారం.