
పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేసిన కరుడు గట్టిన టీడీపీ నేత
ఎమ్మెల్యే టికెట్ కోసం చివరి వరకు పోరాటం
కార్పొరేషన్ పదవితో సరిపెట్టిన అధిష్టానం
మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ జిల్లాలో ఉండికూడా అంత్యక్రియలకు హాజరు కాని వైనం
మాలేపాటికి నిరాదరణపై రగులుతున్న కార్యకర్తలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాలేపాటి సుబ్బానాయుడు.. కావలి నియోజకవర్గంలో టీడీపీకి కరుడు గట్టిన సీనియర్ నేత. ప్రభుత్వం ఉన్నప్పుడు పదవులు అలంకరించిన నేతలందరూ అధికారం కోల్పోగానే కాడి వదిలేశారు. ఆ సమయంలో కూడా నియోజకవర్గంలో పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించారు. గడిచిన ఎన్నికల్లో తనకే కావలి సీటు అంటూ విస్తృత ప్రచారం చేసుకున్నాడు. చివర్లో అధిష్టానం మరొకరికి కట్టబెట్టినా.. పార్టీ విజయం కోసం కృషి చేశాడు. అటువంటి కీలక నేత మాలేపాటి అనారోగ్యంతో మరణిస్తే.. పార్టీ జిల్లా అధ్యక్షుడితోపాటు మరి కొందరు నేతలు మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు. పార్టీకి ఎంతో సేవ చేసినా అంత్యక్రియల్లో నాయకులు, మంత్రులు హాజరుకాకుండా ఘోరంగా అవమానించారంటూ ఆయన వర్గీయులు మండిపడుతున్నారు.
ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాటం
గత ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో కేడర్ ఛిన్నాభిన్నమైంది. అలాంటి కష్టకాలంలో బీద రవిచంద్ర అనుచరుడిగా టీడీపీ అజెండాను నెత్తిన పెట్టుకుని కావలి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నాడు. కేడర్‌ను కాపాడుకున్నాడు. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశాడు. లోకేశ్ నిర్వహించిన యువగళం కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశాడు. తన సొంత నిధులు ఖర్చు చేస్తూ ఆర్థికంగా చితికిపోయాడు. అయితే వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కావ్య కృష్ణారెడ్డికి కావలి టికెట్ ఇచ్చి మాలేపాటిని టీడీపీ ఘోరంగా అవమానించింది.
అధికారంలోకి వచ్చాకా అష్టకష్టాలే
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతయినా ఆయన్ను పట్టించుకోలేదు. మాలేపాటిని, ఆయన వర్గాన్ని లోకల్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దూరం పెట్టాడు. ప్రత్యర్థిలా చూశారు. ఇటీవల డీఆర్ చానల్ పనుల విషయంలో ఆయనపై టీడీపీ నాయకులతోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించి అవమానించారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే ఆయనకు ఏ మాత్రం గౌరప్రదం లేని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి చేతులు దులుపుకొంది. పార్టీలో జరుగుతున్న అవమానాలు, పెడుతున్న కష్టాలతో మాలేపాటి మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కోలుకోలేక మరణించారంటూ ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాలేపాటి మరణానికి ముందు రోజు ఆయన సోదరుడి కుమారుడు కూడా గుండెపోటుతో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సమయంలో పార్టీ నేతలు ఆ కుటుంబంపై సానుభూతి చూపించాల్సి ఉన్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంపై మాలేపాటి వర్గీయులు బాధపడుతున్నారు.
హాజరు కాని మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే|
ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ మంత్రులుగా ఉన్నారు. వీరు జిల్లాలోనే ఉన్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కూడా నియోజకవర్గంలోనే ఉన్నాడు. అయినా వారెవరూ మాలేపాటి అంత్యక్రియలకు హాజరు కాలేదు. కనీసం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా వెళ్లలేదు. కుటుంబ సభ్యులను ఓదార్చలేదు. మాలేపాటి అభిమానులు తమ నాయకుడిని పార్టీ నేతలు ఘోరంగా అవమానించారంటూ లోలోన రగిలిపోతున్నారు.