
10 కోట్ల మంది డెయిరీ రైతులకు లబ్ధి
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం
జీఎస్‌టీ తగ్గింపుపై నిపుణుల విశ్లేషణ
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా డెయిరీ రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, కోఆపరేటివ్ రంగం బలోపేతం అవుతుందని కేంద్ర సహకార శాఖ వెల్లడించింది. పాల ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్ ఉత్పత్తులు, వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, బయో–పెస్టిసైడ్లు, రవాణా వాహనాలపై పన్ను తగ్గింపుల వల్ల రైతులు, కోఆపరేటివ్ సంస్థలు, గ్రామీణ వ్యాపారాలు నేరుగా లాభపడనున్నాయి.
ఈ నిర్ణయాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని నిపుణులు విశ్లేíÙ స్తున్నారు. సంస్కరణల్లో భాగంగా పాలు, పనీర్‌పై జీఎస్‌టీని పూర్తిగా మినహాయించగా, వెన్న, నెయ్యిలపై పన్ను 12% నుంచి 5%కి తగ్గుతుంది. పాల డబ్బాల (ఇనుము, స్టీల్, అల్యూమినియం) పైన కూడా పన్ను తగ్గింపుతో పాల ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి.
దీని వలన డెయిరీ రైతులకు ఆదాయం పెరుగుతుందని, గ్రామీణ మహిళా స్వయంసహాయక సంఘాలకు ఇది పెద్ద ఊరట అవుతుందని నిపుణులు తెలిపారు. మొత్తం మీద, ఈ పన్ను తగ్గింపులు కోట్లాది గృహాలకు చౌకైన ఆహార ఉత్పత్తులు అందించడంతోపాటు, రైతుల ఆదాయాన్ని పెంచి, గ్రామీణ వ్యాపారాలు మరింత బలోపేతం కావడానికి దోహదం చేయగలవని పేర్కొన్నారు. ‘నెక్ట్స్‌జెన్ జీఎస్‌టీ సంస్కరణల’ను డెయిరీ కోఆపరేటివ్ రంగం స్వాగతించింది. అమూల్ వంటి ప్రముఖ కోఆపరేటివ్ బ్రాండ్లు దీనిని రైతు–గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా అభివరి్ణంచాయి.
ఆహార ప్రాసెసింగ్‌కి ఊతం: చీజ్, నమ్‌కీన్‌లు, పాస్తా, జామ్, జెల్లీ, ఫ్రూట్ జ్యూస్ డ్రింక్స్, భుజియా వంటి ఉత్పత్తులపై జీఎస్‌టీ 5 శాతానికి పరిమితం కానుంది. చాక్లెట్స్, కార్న్‌ఫ్లేక్స్, ఐస్‌క్రీమ్, బిస్కెట్లు, కాఫీ వంటి ఉత్పత్తులపై పన్ను 18% నుంచి 5%కు తగ్గించడం వల్ల ప్రజలపై భారం తగ్గనుంది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగి, ఆహార ప్రాసెసింగ్ రంగం పుంజుకునే అవకాశం ఉంది.
రైతులకు ఉపశమనం: 1800 సీసీ లోపు ట్రాక్టర్లు, వాటి విడి భాగాలపై జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించడం, అలాగే ఎరువుల తయారీలో వాడే అమోనియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్‌పై పన్ను 18% నుంచి 5 శాతానికి తగ్గించడం వంటి అంశాలు రైతులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. 12 రకాల బయో–పెస్టిసైడ్లు, మైక్రోన్యూట్రియెంట్లపై పన్ను తగ్గింపుతో సేంద్రియ వ్యవసాయానికి ఊతం లభిస్తుంది.
ట్రక్కులు, డెలివరీ వ్యాన్లపై పన్ను 28% నుంచి 18%కి తగ్గించడంతో రవాణాకు సంబంధించి వాహనాలపరమైన భారం గణనీయంగా తగ్గనుంది. రైతుల ఉత్పత్తులు మార్కెట్లకు తక్కువ ఖర్చుతో చేరి, ఎగుమతుల పోటీ సామర్థ్యం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. గూడ్స్ క్యారేజ్ వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌పై పన్ను తగ్గించడం మరో ముఖ్యమైన నిర్ణయమని విశ్లేషకులు తెలిపారు.