సివిల్స్‌ ర్యాంక‌ర్ల‌కు సీఎం అభినందనలు

CM KCR congratulates all civils rankers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష 2017లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. దేశానికి సేవలందించడానికి సిద్ధమవుతున్న మరో తరంలో తెలంగాణ బిడ్డలు పెద్ద సంఖ్యలో ఉండడం గర్వకారణమని సీఎం అన్నారు.

ఆలిండియా నెంబర్ వన్ ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, 6వ ర్యాంకు సాధించిన ఖమ్మం జిల్లా కోయ శ్రీహర్ష, 144వ ర్యాంకు సాధించిన మహబూబ్‌నగర్ జిల్లాకు పెంట్లవెల్లికి చెందిన గడ్డం మాధురి, 393వ ర్యాంకు సాధించిన కామారెడ్డికి చెందిన సురభి ఆదర్శ్, 624వ ర్యాంకు సాధించిన ఎడవెల్లి అక్షయ్ కుమార్, 721వ ర్యాంకు సాధించిన పెద్దపల్లికి చెందిన బల్ల అలేఖ్య, 724వ ర్యాంకు సాధించిన నిజామాబాద్ జిల్లా సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషులను ముఖ్యమంత్రి అభినందించారు. 9 ర్యాంకు సాధించిన దివ్యాంగురాలు సౌమ్యశర్మతో పాటు ఆలిండియా ర్యాంకులు సాధించిన మిగతా విద్యార్థులకు కూడా సీఎం అభినందనలు తెలిపారు.

ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఏ పోటీ పరీక్షలు పెట్టినా తెలంగాణ విద్యార్థులు విజయదుందుభి మోగిస్తున్నారని కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. సివిల్ సర్వీస్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు తెలంగాణ విద్యార్థులను సిద్ధం చేయడానికి ప్రభుత్వ పరంగా స్టడీ సర్కిళ్లు ఏర్పాటుతో పాటు ఇతర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అత్యుత్తమ శిక్షణ ఇచ్చే సంస్థలను తెలంగాణలోని హైదరాబాద్, ఇతర నగరాల్లో స్థాపించాలని సీఎం పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top