తన జీతంలో 40 శాతం ఉచిత శిక్షణకే ఖర్చు 

CI Giving Motivational Classes For Unemployment Students - Sakshi

ఇప్పటికే 500 మందికిపైగా ప్రభుత్వఉద్యోగాలు

నాన్న ఆశయమే ఊపిరిగా ముందుకు..

ఆదర్శంగా నిలుస్తున్న ఎక్సైజ్‌ సీఐ ఏడుకొండలు 

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : నాన్న ఆశయమే ఆయన ఊపిరి.. సమాజంలో ఉన్నత విలువలతో కూడిన విద్యనందించడమే లక్ష్యం.. అలుపెరగని సేవాభావం.. నిరుద్యోగుల పట్ల ఆయనకున్న అభిమానం వెరసి కొన్ని వేల మంది నిరుద్యోగుల ఇంట ఉద్యోగాల పంట పండుతోంది. తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్న నిరుద్యోగులకు ప్రేరణ కల్పించి.. ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కింది. నాడు బడిబయటి బాలుడు అయిన ఆయన ఓ ఉపాధ్యాయుడు ఇచ్చిన స్ఫూర్తితో మూడు ఉద్యోగాలు సాధించాడు. ఆర్థిక స్థోమత లేని నిరుద్యోగుల కష్టాలు తెలుసుకున్న ఆయన నేడు వేల మందికి ఉచితంగా ఉద్యోగ శిక్షణ అందిస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకకాలంలో రాష్త్రవ్యాప్తంగా 22 ఉచిత కోచింగ్‌ సెంటర్లను నిర్విరామంగా నడుపుతూ వందలాది మంది నిరుద్యోగుల్లో వెలుగులు నింపుతున్నారు. విధి నిర్వహణలో ఒకవైపు సమాజంలో తాగుబోతుల మత్తు వదిలిస్తూ.. మరోవైపు నిరుద్యోగులను ఉద్యోగాల బాటపట్టిస్తున్నారు. ఆయనే నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎక్సైజ్‌ సీఐ ఏడుకొండలు. .

వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా 22 సెంటర్లలో దాదాపు 10 వేల మందిపై చిలుకు నిరుద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. తన ఉద్యోగ విరామ సమయంలో ఉదయం 7 నుంచి 9 గంటలు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రెండు దఫాలుగా శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌లో 2, వనపర్తిలో ఒకటి, మహబూబ్‌నగర్‌లో మూడు, షాద్‌నగర్‌లో ఒకటి, ఖైరతాబాద్‌లో ఒకటి, సిద్ధిపేటలోని వర్గల్‌లో ఒకటి, మహత్మాగాంధీ యూనివర్శిటీ బాలబాలికలకు రెండు, చర్లపల్లిలో ఒకటి, నల్లగొండ టౌన్‌లో మూడు, దేవరకొండలో రెండు, హాలియాలో ఒకటి, సూర్యాపేటలో రెండు, కోదాడలో రెండు, ఖమ్మంలో ఒకటి చొప్పున ఆన్‌లైన్‌ శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇంకా 70 కేంద్రాల ఏర్పాటు కోసం వినతులు వస్తున్నాయని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏర్పాటు చేయలేకపోతున్నానని చెబుతున్నారు ఏడుకొండలు. 

కుటుంబ నేపథ్యం..
ఏడుకొండలు స్వస్థలం నల్లగొండ జిల్లా పెద్దఊర మండలం నాయనవాయికుంట. బాల్‌నర్సయ్య, లింగమ్మల రెండో సంతానం ఏడుకొండలు. వీరిది వ్యవసాయం కుటుంబం. ఎనిమిదో తరగతిలోనే బడి మానివేసి తల్లిద్రండులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్తుండేవాడు. అలా ఏడాదిపాటు చదువుకు దూరంగా ఉన్నాడు. చదువుతున్న సమయంలో ఈయన ప్రతిభను గుర్తించిన లీనస్‌ అనే ఉపాధ్యాయుడు చదువు విలువను తెలిపి ప్రోత్సహించాడు. దీంతో ఏడుకొండలు మళ్లీ బడి లో చేరి మంచి ఉత్తీర్ణతతో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశాడు. వెంటనే 2003లో జైలు వార్డెన్‌కు నోటిఫికేషన్‌ రావడంతో కష్టపడి చదివి ఉద్యోగాన్ని సాధించాడు. విశాఖపట్నంలో జైలు వార్డెన్‌ విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు గ్రూప్‌–2 పరీక్షకు సన్నద్ధమయ్యాడు.  

శిక్షణ లేకుండానే 2007లో ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగాన్ని సాధించాడు. నల్లగొండ ఎక్సైజ్‌ ఎస్‌ఐగా చేరాడు. తర్వాత కొన్నేళ్లకే  సీఐగా ప్రమోషన్‌ పొందాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ ప్రైవేట్‌ శిక్షణ సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఆయనను అతిథిగా ఆహ్వానించారు. అక్కడ ఆయన ప్రసంగాన్ని విన్న వి ద్యార్థులు, సన్నిహితులు ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పిన విధానం ప్రతిఒక్కరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. ఇలాంటి ప్రేరణ నిరుద్యోగులకు కావాలని తన సన్నిహితులు చెప్పిన మాటలతో 2015లో 38 మంది విద్యార్థులతో బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్ష ణ తరగతులు ప్రారంభించారు. ఇలా ఇంతింౖ తె వటుడింతై అన్న చందంగా 38 మందితో ప్రారంభించిన శిక్షణతో పది వేల పైచిలుకు మందికి

మార్గదర్శిగా నిలిచాడు. 
ఏడుకొండలు ఇచ్చే శిక్షణ తరగతులు నిరుద్యోగులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. రూ.వేలకు వేలు ఫీజులు చెల్లించి శిక్షణ తీసుకోలేక ఆర్థిక స్తోమత లేని నిరుద్యోగుల పాలిట ఆయన దేవుడిలా నిలిచారు. పోలీస్, ఫారెస్ట్, రెవెన్యూ, ఉపాధ్యాయ ఇలా పలు శాఖల్లో ఇప్పటి వరకు దాదాపు 500 మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తాను ఇచ్చే శిక్షణకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నత ఉద్యోగాల కోసం శిక్షణకు హాజరవుతుండడం గమనార్హం. ఇప్పుడు తరగుతులకు హాజరవుతున్న అందరినోట గ్రూప్‌– 1 మాటే వినిపిస్తోంది. 

తండ్రి మాటలే స్ఫూర్తిగా.. 
మనకు ఉన్నంతలో కొంత ఇతరులకు పంచడంలో వచ్చే ఆనందం వెలకట్టలేనిదని, ఒకరి నుంచి తీసుకోవడం కాకుండా మనం ఏమివ్వగలం అనే ఆలోచన ఉన్నప్పుడే ప్రతిఒక్కరిలో మార్పు వస్తుందని తన తండ్రి బాల్‌నర్సయ్య ఎప్పుడూ చెబుతుండేవాడని, ఆయనే తనకు స్ఫూర్తి అని చెబుతున్నాడు ఏడుకొండలు. సమాజంలో విలువలతో కూడిన విద్య అందించడమే లక్ష్యమని, దాని కోసం ఎంత ఇబ్బంది అయినా ముందుకు వెళ్తున్నాడు. తనకు వచ్చే జీతంలో 40 శాతం ఉచిత శిక్షణకే ఖర్చు చేస్తున్నారు. కుటుంబం నుంచి కూడా సహకారం ఉండడంతో మరింత ముందుకు వెళ్తున్నారు. ఉన్నదాంట్లోనే సర్దుకుంటూ యువతను మరో ఏడుకొండలుగా మార్చి సమాజ మార్పునకు తనవంతు కృషిచేస్తున్నాని చెబుతున్నారు. 

సోషల్, సైన్స్‌లపై పట్టుసాధించా 
నేను బీటెక్‌ పూర్తి చేశాను. నాకు సోషల్, సైన్స్‌ వాటిపై పట్టులేదు. చాలా భయంగా ఉండేది. కానీ సార్‌ తరగతులకు హాజరయ్యాక వీటిపై పూర్తిగా పట్టు సాధించాను. నేను సాధించిన ఈ ఉద్యోగానికి సార్‌ తరగతులే ఉపయోగపడ్డాయి. 
– జ్యోతి, పంచాయతీ సెక్రటరీ, వనపర్తి 
 
మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యా.. 
నేను సార్‌ తరగతులకు రాక ముందు గతేడాది కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని ఒక్క మార్కు తేడాతో కోల్పోయా. తర్వాత సార్‌ తరగతులకు హాజరయ్యాక అక్కడ ఇచ్చిన మోటివేషన్, శిక్షణతో ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యా. ఏడుకొండలు సార్‌ తరగతులను నేను మర్చిపోలేను. 
– సంతోష, స్కూల్‌ అసిస్టెంట్, గుండాల, యాదాద్రి జిల్లా 
 

మోటివేషన్‌ అద్భుతం.. 
పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ సార్‌ శిక్షణ తరగతులకు హాజరయ్యాను. అప్పుడే వరుస నోటిఫికేషన్లు రావడంతో గ్రూప్‌– 4, పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు ఎంపికయ్యా. ఏడుకొండలు సార్‌ ఇచ్చే మోటివేషన్‌ అద్భుతం. అది ఎంతటి వారినైనా ముందుకు తీసుకెళ్తుంది. ప్రస్తుతం నా ముందు ఉన్న లక్ష్యం గ్రూప్‌– 1.
– సాయిప్రియ, వీఆర్‌ఓ, మాదారం, కల్వకుర్తి 

సహకారం మరువలేనిది.. 


ఉద్యోగ బాధ్యతలు, శిక్షణను ఇంత సమర్థవంతంగా కొనసాగించడంలో నా కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది. ఇతర ప్రాంతాల్లో శిక్షణ అందించడానికి నా భార్య జ్యోతి, అమ్మ లింగమ్మ, సోదరుడు శ్రీనివాస్‌ ఎంతో అండగా నిలిచారు. నా కుమారులు కార్తీక్, కౌశిక్‌ కూడా అవీ ఇవీ కొనివ్వాలంటూ ఇబ్బందులు పెట్టలేదు. ఆన్‌లైన్‌ శిక్షణకు స్క్రీన్లు, ఇంటర్‌నెట్‌ బిల్లు మొత్తం సొంతంగా ఖర్చు పెట్టుకున్నా. ఇంకా సెంటర్లు ఓపెన్‌ చేయాలని పలు ప్రాంతాల నుంచి వినతులు వస్తున్నాయి. కానీ ఆర్థికంగా లేక వెనకడుగు వేస్తున్నా. ఎవరైనా ఆర్థికతోడ్పాటుకు ముందుకు వస్తే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని లక్షల మందికి శిక్షణ అందించవచ్చు. 

– ఏడుకొండలు, ఎక్సైజ్‌ సీఐ, నాగర్‌కర్నూల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top