ఆరా తీసి..  ఆశ చూపి

Child Selling Gang Arrested - Sakshi

పేదల నుంచి శిశువుల కొనుగోలు.. ఎక్కువ డబ్బులకు విక్రయం

అధిక సంతానం ఉన్న దంపతులే టార్గెట్‌

పసికందులందరూ బాలికలే

ఇద్దరు శిశువులు శిశువిహార్‌కు తరలింపు

క్యాబ్‌ డ్రైవర్‌ సమాచారంతో కదిలిన డొంక 

శంషాబాద్‌ : శిశు విక్రయాల ముఠా గుట్టు రట్టయింది. సులభ మార్గంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా శిశువుల విక్రయాన్ని వృత్తిగా మార్చుకున్న వ్యక్తిని ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 12 మంది చిన్నారులను విక్రయించినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బుధవారం శంషాబాద్‌ డీసీపీ పి.వి. పద్మజ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన గంగాధర్‌రెడ్డి (32) మొదటి భార్యకు విడాకులిచ్చి 2013 నుంచి నగరంలోని గాజులరామారంలో నివాసముంటున్నాడు.

సంతాన సాఫల్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఇతడు అక్కడికి వచ్చిపోయే వారిలో అధిక సంతానం ఉన్న వారి వివరాలు సేకరించేవాడు. వారి అవసరాలను గుర్తించి వారి పసికందులను తీసుకొచ్చి విక్రయించే దందాను గత మూడేళ్లుగా కొనసాగిస్తున్నాడు. తాజాగా మాచర్ల శివపురం తండాలోని లక్ష్మీ అనే మహిళకు మూడో సంతానంగా పుట్టిన పదిహేను రోజుల ఆడ శిశువును తీసుకుని ఆమెకు రూ.83 వేలు ఇచ్చాడు. ఆ పాపను తీసుకుని గతంలో ఇలాంటి వ్యవహారంలో తనకు సహకరించిన శంషాబాద్‌ పట్టణంలో రాజీవ్‌ గృహకల్ప సముదాయంలో నివాసముంటున్న సురేష్, మంగ దంపతులకు అప్పగించాడు. శిశువుకు అధిక ధర వచ్చే వరకు ఆలనాపాలనా చూసుకోవాలని అప్పజెప్పాడు.

అయితే అకస్మాత్తుగా ఆ దంపతుల వద్ద చిన్నారి కనిపించడంతో.. అనుమానం వచ్చిన ఎయిర్‌పోర్టులో పనిచేసే ఓ క్యాబ్‌ డ్రైవర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. ఈ నెల 23న రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా మంగను అరెస్ట్‌ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

మొత్తం పన్నెండు మంది చిన్నారులు  
మంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా శిశువుల విక్రయ దందా వెలుగుచూసింది. గంగాధర్‌రెడ్డి గతంలో కూడా ఓ పసికందును తన వద్ద కొన్ని రోజులు ఉంచి ఆలనాపాలనా చూసినందుకు రూ. 10 వేలు ఇచ్చాడని వెల్లడించింది. ఆ పాపను స్థానికంగా తహసీన్‌ పాషా అనే వ్యక్తికి రూ. 1.60 వేలకు విక్రయించినట్లు తెలిపింది. మంగ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గంగాధర్‌రెడ్డిని రెండురోజుల కిందట అతడి స్వగృహంలో అరెస్ట్‌ చేశారు. గతంలో విక్రయించిన చిన్నారితో పాటు మంగ వద్ద ఉన్న చిన్నారిని సైతం బండ్లగూడలోని శిశువిహార్‌కు తరలించారు.

పోలీసుల దర్యాప్తులో మొత్తం 12 మంది పసికందులను తాను విక్రయించినట్లు గంగాధర్‌రెడ్డి వెల్లడించాడు. గతంలో అతడిపై గాంధీనగర్, మాదన్నపేట, ఛత్రినాకా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై వచ్చిన అతడు తిరిగి అదే దందాను కొనసాగిస్తున్నాడు. ఈ కేసులో మంగను రెండురోజుల కిందటే పోలీసులు రిమాండ్‌కు తరలించగా గంగాధర్‌కు విక్రయాలకు సహకరించిన శ్రీను, శిరీష, శారద, అరుణ లక్ష్మీలను రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్, సీఐ మహేష్‌లు పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top