మామిడి మధురం.. చైనా నుంచి ఇథిలిన్‌ పౌడర్‌ | Chemical Mixing in Market Mango Fruits Hyderabad | Sakshi
Sakshi News home page

మామిడి మధురం... మగ్గించేందుకు కాలకూట విషం!

Mar 18 2020 11:36 AM | Updated on Mar 18 2020 11:53 AM

Chemical Mixing in Market Mango Fruits Hyderabad - Sakshi

మామిడి కాయలను ఇథిలిన్‌ రసాయనం ద్వారా మగ్గిస్తున్న దృశ్యం

వేసవిలో మామిడి పండ్ల కోసం ఎదురుచూసే వారుండరంటే అతిశయోక్తికాదు. ఆరోగ్యపరంగా తినాల్సిన సీజనల్‌ పండు కూడా ఇది. వ్యాపారుల అత్యాశ కారణంగా మధుర ఫలం విషతుల్యం అవుతోంది. త్వరగా పండించి విక్రయించేందుకు రసాయనాలను వినియోగిస్తున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఇథిలిన్‌తో మామిడి పండ్లను మగ్గిస్తూ ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదాన్ని కల్గిస్తున్నారు.

సాక్షి సిటీబ్యూరో: కాలుష్యకారక కార్బైడ్‌ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మామిడి ప్రియులు సంబరపడ్డారు. అయితే కృత్రిమ పద్ధతికి అలవాటు పడిన వ్యాపారులు త్వరితగతిన పండ్లను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఇథిలిన్‌ పౌడర్‌ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్‌తో కాయలను కొన్ని గంటల్లోనే పండించి విక్రయించేస్తున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ ఇందుకు కేంద్ర బిందువుగా మారుతోంది.

కోర్టు ఉత్తర్వులు బేఖాతర్‌...
ఆరోగ్యానికి హాని చేకూర్చే రసాయనాలు, రసాయన పౌడర్‌లను వినియోగించి పండ్లను మగ్గించరాదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కొన్ని రోజులు మార్కెట్‌లలో హడావిడి చేసిన అధికారులు ఆ తర్వాత తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోవడంపై సర్వత్రా విమర్శలున్నాయి.

చైనా, కొరియాల నుంచి దిగుమతి...
కార్బైడ్‌కు ప్రత్యామ్నాయంగా చైనా, కొరియాల నుంచి ఇథిలిన్‌ పౌడర్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి అనుమతి లేకపోయినా కాయలను 24 గంటల్లో నిగనిగలాడే పండ్లుగా మార్చేందుకు ఆపౌడర్‌ను దొడ్డిదారిన వినియోగిస్తున్నారు. పౌడర్‌ను 5 ఎంఎల్‌ ప్యాకెట్లుగా తయారు చేసి, ఒక్కో బాక్స్‌ (15 నుంచి 35 కిలోల మామిడికాయల పెట్టె)లో నీళ్లలో ముంచి మూడు నుంచి ఐదు ప్యాకెట్లు వేస్తున్నారు. ఇథిలిన్‌ ప్యాకెట్ల ద్వారా మగ్గబెట్టేందుకు తమకు అనుమతి ఉందని వ్యాపారులు పేర్కొంటుండటం గమనార్హం. మరోవైపు చైనా నుంచి తీసుకొచ్చి ఇథిలిన్‌ అని చేపడుతున్న పౌడర్‌లో కార్బైడ్‌ ఉన్నట్లు వ్యాపారులు అంటున్నారు. ఎందుకంటే రెండు రోజుల్లోనే కాయ కలర్‌ మారుతుంది. కార్బైడ్‌ వాడినప్పుడు ఏవిధంగానైతే వచ్చేదో అలానే పండు రంగు వస్తుంది.

పౌడర్‌ విక్రయాల్లోనూ బ్లాక్‌ దందా...
చైనా నుంచి దిగుమతి చేసిన ఇథిలిన్‌గా చేప్పే పౌడర్‌ను నాగ్‌పూర్‌ అడ్రస్‌ ముద్రించి రీప్యాకింగ్‌ చేస్తున్నారు. ఇథిలిన్‌ పౌడర్‌ ప్యాకెట్ల విక్రయంలోనూ మార్కెట్‌లో దందా చేస్తున్నారు. పౌడర్‌ ఒక్కో ప్యాకెట్‌ రూ. 1.72లకు కొనుగోలు చేస్తున్న ఓ కమిషన్‌ ఏజెంట్‌ ఆ ప్యాకెట్‌ను ఒక్కొక్కటి రూ. 5 ప్రకారం బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.

ఇలా 4 రోజులు.. అలా 48 గంటల్లోపే...
సహజసిద్ధంగా గడ్డిలో పెట్టి మగ్గించిన మామిడికాయలు ఆరోగ్యానికి మంచివి. ఇలా మగ్గించాలంటే కనీసం 90 నుంచి 96 గంటల సమయం పడుతుంది. ఇంత సమయం దాకా ఆగలేని వ్యాపారులు కాల్షియం కార్బైడ్, ఇథిలిన్‌ పౌడర్‌లాంటి మార్గాలను అనుసరిస్తున్నారు. వీటి ద్వారా 24 నుంచి 48 గంటల్లోపే కాయలు పండ్లుగా మారుతున్నాయి. గడ్డిఅన్నారం మార్కెట్‌లో సుమారు 200 నుంచి 300 మంది మహిళలు, బాల కార్మికులు, హమాలీలు ఇథిలిన్‌ పౌడర్‌ ప్యాకింగ్‌ నిమిత్తం పని చేస్తారు.

రుచిలో తేడా...
కాయలను సహజసిద్ధంగా బట్టీలలో పక్వానికి తెచ్చే పద్ధతులు పాటించేవారు. మధుర తీపి ప్రజలు రుచి చూసేవారు. కృతిమ పద్ధతులు, రసాయనాలతో మగ్గించడం వల్ల రుచిలో తేడాలొస్తున్నాయి.

కఠిన చర్యలు తథ్యం
నిబంధనల మేరకే కాయలను మగ్గించాలి. ఇందుకు మార్కెట్‌లో ఉన్న చాంబర్‌లను సద్వినియోగం చేసుకోవాలి. నిషేధిత రసాయనాలను వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. ఈ సంవత్సరం ఇప్పటికే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రసాయన పౌడర్‌లను వినియోగించరాదని స్పష్టం చేశాం. చైనా నుంచి దిగుమతి అయినా ఇథిలిన్‌ వినియోగించే వారిపై చర్యలు తీసుకుంటాం. మార్కెట్, ఆహార భద్రత, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌తో సమావేశం నిర్వహించనున్నాం. – లక్ష్మీబాయి, డైరెక్టర్, మార్కెటింగ్‌ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement