నేడు రాజ్‌నాథ్‌సింగ్‌ రాక

Central Minister Rajnath Singh Coming To Telangana Mahabubnagar - Sakshi

నాగర్‌కర్నూల్‌: శాసనసభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దిలీపాచారికి మద్దతుగా గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నాగర్‌కర్నూల్‌కు రానున్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో 15 వేల మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ పరిధి వరకే నిర్వహిస్తున్న ఈ సభలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రాజ్‌నాథ్‌సింగ్‌ మొదటిసారిగా నాగర్‌కర్నూల్‌కు వస్తుండటంతో పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. దాదాపు 300 మంది పోలీస్‌ సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

హెలీక్యాప్టర్‌ ద్వారా నాగర్‌కర్నూల్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి చేరుకుంటుండటంతో మండలంలోని ఉయ్యలవాడ వద్ద హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కాన్వాయ్‌ ద్వారా సభాస్థలికి చేరుకుని బీజేపీ కార్యకర్తలు, నాయకులనుద్ధేశించి ప్రసంగించనున్నారు. 12 గంటలకు ప్రారంభమయ్యే సభ ఒంటిగంట వరకు ముగించుకుని కాన్వాయ్‌ ద్వారా ఉయ్యలవాడ చేరుకుని అక్కడి నుంచి హెలీక్యాప్టర్‌లో వనపర్తిలో నిర్వహించే బహిరంగ సభకు వెళ్లనున్నారు. సభా ప్రాంగణంలో ఇప్పటికే బాంబ్‌ స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌ ద్వారా తనిఖీలు నిర్వహించారు. సభ ప్రాంగణం వద్ద అంబులెన్స్‌తోపాటు ఫైరింజన్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. హెలీప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణం వద్దకు కేంద్ర మంత్రిని తీసుకొచ్చే కాన్వాయ్‌కు సంబంధించి ఇప్పటికే ట్రయల్స్‌ కూడా చేశారు.  

వనపర్తిలో సర్వం సిద్ధం
వనపర్తి: ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వనపర్తికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రానున్నారు. వనపర్తి బీజేపీ అభ్యర్థి అమరేందర్‌రెడ్డి సారథ్యంలో ప్రచారసభ ఏర్పాట్లు, హెలీప్యాడ్‌ నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. స్థానిక బాలకిష్టయ్య స్టేడియంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ఉదయం నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేస్తున్న ప్రచారసభలో పాల్గొని ఉదయం గంటలు 11.15 గంటలకు వనపర్తికి చేరుకుంటారు. బాలకిష్టయ్య స్టేడియం నుంచి కాన్వాయ్‌లో పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రచారసభకు హాజరై ప్రసంగించనున్నారు.

పదివేలకు పైగా జనాలు వచ్చినా.. సౌకర్యంగా కూర్చునేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేసినట్లు నియోజకవర్గ నాయకులు తెలిపారు. అయితే వనపర్తికి రాజ్‌నాథ్‌సింగ్‌ మొదటిసారి వస్తుండటంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఏఎస్పీ, డీఎస్పీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే బీజేపీకి ఎక్కువ ఓటుబ్యాంకు ఉన్న వనపర్తి పట్టణం నుంచి పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేసేందుకు నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. 

భారీగా జనసమీకరణ 
ఈ సభ ద్వారా నాగర్‌కర్నూల్‌లో బీజేపీ అభ్యర్థి తన బలాన్ని చాటుకునేందుకు ఇప్పటికే గ్రామస్థాయిలో కార్యకర్తలను, నాయకులను సిద్ధం చేశారు. బహిరంగ సభకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొననుండటంతో ఆయనతోపాటు రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు కూడా ఇందులో పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఫ్లోర్‌ లీడర్‌ కిషన్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top