అనుగ్రహం.....ఉండాలి మరి.. | Candidates Looking For Good Days For Nomination | Sakshi
Sakshi News home page

అనుగ్రహం.....ఉండాలి మరి..

Nov 11 2018 12:33 PM | Updated on Nov 11 2018 12:40 PM

Candidates Looking For Good Days For Nomination - Sakshi

జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్‌) : రానున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఈనెల 12వ తేదీ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. ఈ మేరకు ఇప్పటికే టికెట్లు ఖరారైన టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు మహాకూటమి నుంచి తప్పక టికెట్‌ లభిస్తుందని భావిస్తున్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా సోమవారం నుంచి జరగనున్న నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రధానంగా నామినేషన్ల దాఖలకు ఎనిమిది రోజుల సమయం ఉండగా.. ఇందులో తమ పేరు, జాతకం ప్రకారం ఏ రోజు నామినేషన్‌ దాఖలు చేస్తే మంచిదనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకోసం తమకు నమ్మకస్తులైన వారే కాకుండా ప్రముఖ జ్యోతిష్యులు, పండితులను ఆశ్రయిస్తున్నారు. గ్రహాలు అనుకూలిస్తేనే రాజయోగం సిద్ధిస్తుందనే నమ్మకం ఉన్న ఆశావహులు జ్యోతిష్యులను కలుస్తూ పేరుబలాలపై అంచనాలు వేసుకుంటున్నారు.

నాలుగే మంచివి..
నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉన్న 12వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో కేవలం నాలుగు మంచి ముహూర్తాలే ఉన్నాయని పలువురు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇందులో భాగంగా నాలుగు ముహూర్తాల్లో మొదటి ప్రాధాన్యతగా ఈనెల 14వ తేదీ బుధవారం సప్తమి శ్రవణా నక్షత్రం బాగుంటుందని పలువురు అభ్యర్థులకు సూచిస్తున్నారు. ఇక రెండో ప్రాధాన్యత 17న శనివారం దశమి, మూడో ప్రాధాన్యత 18 ఆదివారం, చివరి ముహూర్తంగా 19వ తేదీ సోమవారం ద్వాదశిని గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు తమను ఆశ్రయించిన అభ్యర్థులందరికీ ఈ నాలుగు ముహూర్తాలనే సూచించినట్లు పలువురు పండితులు తెలిపారు.

మంచి అనేది చూసుకోవాలి 
ఏ పని చేసినా మంచి అనేది చూసుకుని ముందుకు సాగాలి. ఇది అనాదిగా పెద్దలు మనకు నేర్పిన సంప్రదాయం. మంచి అనేది ఆలోచించుకుని చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. అందుకే నామినేషన్లకు కూడా మంచి ముహూర్తాలు, దైవానుగ్రహం కోరుకోవాలి. దైవబలంతో పాటు పెద్దల ఆశీర్వాదం కూడా అవసరమే. ఇది మంచి సంప్రదాయం. 
– ఓరుగంటి సంపత్‌కుమార్‌ శర్మ,  బ్రాహ్మణ సంఘం  ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, నాగర్‌కర్నూల్‌

దైవబలమూ కలిసి రావాలి 
నామినేషన్లకు మంచి ముహూర్తాలు చూసుకోవడం ఎంత ముఖ్యమో రాజకీయ రణరంగంలో దైవబలం సంపాదించుకోవడం అంతకంటే ముఖ్యం. అభ్యర్థులందరూ జాతకరీత్యా  దైవజ్ఞులను సంప్రదించి తమ గ్రహస్థితిలో ఉచ్చ, నీచ స్థానాలు చూసుకుని పరిహార మార్గాలు పాటించాలి. పరిహార మార్గాల ద్వారానే దైవ బలం చేకూరుతుంది. 
– జ్యోషి సత్యనారాయణ శర్మ. వాస్తు జ్యోతిష్య నిపుణులు, ఉంద్యాల 

ముహూర్తం ముఖ్యం కాదు

రాజకీయ రణరంగంలో ముందుకు వెళ్లాలనుకునే వారికి తిథి ప్రామాణికం కాదు. రాజకీయాలకు గురుబలం, శనిబలం, రాహు బలం బాగుండాలి. అమావాస్య నాడు పుట్టిన వారు కూడా రాజ్యాన్ని ఏలుతున్నారు కదా? ముహూర్తం కంటే జాతకంలోని దశలు, గ్రహస్థితులను సరిచూసుకోవాలి. అదే సరైనది.
– ఓరుగంటి నాగరాజ శర్మ, సిద్ధాంతి, పంచాంగకర్త, వనపర్తి

   విశ్వాసానికి సంబంధించినది 
జాతకమనేది వారి వారి విశ్వాసాలకు సంబంధించిన విషయం. ఇందులో నాస్తిక వాదానిక తావు లేదు. శాస్త్రాలన్ని నూటికి నూరు శాతం సరైనవే. ఏ శాస్త్రమైనా వారి కోణాల్లో సరైనదేనేనని చెప్పాలి. మంచి పనితో పాటు జీవితాన్ని మలుపు తిప్పే కార్యాన్ని ప్రారంభించేటప్పుడు జాతక రీత్యా ముందుకు వెళ్లడం ఆమోదయోగ్యమనే చెప్పాలి. రాజకీయాలకు రాహుగ్రహాలకు తప్పక ప్రాధాన్యం ఉంటుంది.
జ్యోషి గోపాలశర్మ, బ్రాహ్మణ పరిషత్‌ రాష్ట్ర సభ్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement