కీలక ఘట్టం

Cable Bridge Works Complete in Durgam Cheruvu - Sakshi

జతకట్టిన ఆ గట్టు.. ఈ గట్టు

పూర్తయిన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి సెగ్మెంట్ల ఏర్పాటు    

విజయవంతంగా చివరి కీ సెగ్మెంట్‌ అమరిక

సాక్షి, సిటీబ్యూరో: దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి పనుల్లో అత్యంత కీలక ఘట్టం తుది సెగ్మెంట్‌ అమరికను ప్రాజెక్ట్‌ టీమ్‌ మంగళవారం రాత్రి విజయవంతంగా పూర్తి చేసింది. అంతర్జాతీయ స్థాయి భద్రత,నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మొత్తం 53 సెగ్మెంట్ల ఏర్పాటును 22 నెలల్లో పూర్తి చేశారు. తెలంగాణ ప్రజారోగ్య శాఖ ఈఎన్‌సీ, జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టŠస్‌ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌.శ్రీధర్‌ నేతృత్వంలో సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ వెంకటరమణ పర్యవేక్షణలో చివరి కీ సెగ్మెంట్‌ అమరికను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పూర్తి చేశారు. సాయంత్రం 4:30గంటలకు శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ హరిచందన సెగ్మెంట్‌ అమరిక పనిని రిమోట్‌ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. సెగ్మెంట్లలో చివరి ఘట్టాన్ని పురస్కరించుకొని టీమ్‌ సభ్యులు ఆనందోత్సాహాలతో బాణసంచా కాల్చారు. 

ఇంజినీరింగ్‌ అద్భుతం...  
ఇప్పటి వరకు హైదరాబాద్‌ అంటే ప్రసిద్ధి చెందిన చార్మినార్, గోల్కొండ గుర్తుకొస్తాయి. ఇప్పుడీ జాబితాలో కేబుల్‌ బ్రిడ్జి చేరనుంది. దుర్గం చెరువుపై ఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ స్టే బ్రిడ్జి పనులు 21వ శతాబ్దపు ఇంజినీరింగ్‌ అద్భుతమని పలువురు పేర్కొంటున్నారు. మూడు మిలియన్లకు పైగా పనిగంటలతో అధునాతన సాంకేతికతతతో ఎక్కడా రాజీ లేకుండా పనులు చేశారు. ప్రపంచంలోనే పొడవైన స్పాన్‌లు కలిగిన కేబుల్‌ బ్రిడ్జిలు జపాన్‌లో 275, 271 మీటర్లతో రెండుండగా... 234 మీటర్లతో మూడోది ఇదేనని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు తెలిపారు. స్టీల్‌ లేకుండా ఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ స్టే ప్రీకాస్ట్‌ కాంక్రీట్‌ బ్రిడ్జిలో మాత్రం ప్రపంచంలో ఇదే పొడవైనదన్నారు.

మన దేశానికి సంబంధించినంత వరకు గుజరాత్‌లోని బరూచ్‌ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్‌ బ్రిడ్డే అతి పెద్దది. ఎస్సార్‌డీపీలో భాగంగా జీహెచ్‌ఎంసీ రూ.184 కోట్లతో ఈ బ్రిడ్జి పనులు చేపట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ఈ బ్రిడ్జి పనులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ బ్రిడ్జికి సంబంధించి ఫినిషింగ్‌ పనులతో పాటు రెయిలింగ్, ప్రత్యేక విద్యుదీకరణ తదితర పనులు చేయాల్సి ఉంది. అన్నీ పూర్తయి వినియోగంలోకి రావడానికి దాదాపు నాలుగు నెలల సమయం పట్టనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఐకియా స్టోర్‌ వరకు సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం సాధ్యం కానుంది. జూబ్లీహిల్స్‌ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు రెండు కి.మీ.ల మేర దూరం తగ్గడంతో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36, మాదాపూర్‌లపై ట్రాఫిక్‌ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top