ఎటుచూసినా వరదే..

Breaches Everywhere By The Krishna River - Sakshi

నిండుకుండలా నాగార్జునసాగర్‌ జలాశయం

ఎగువ నుంచి కొనసాగుతున్న వరద ఉధృతి

7,13,531 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. అంతే మోతాదులో దిగువకు విడుదల

మరో మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం

సాక్షి, నల్లగొండ: కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికే మట్టపల్లి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం దాదాపుగా మునిగిపోయింది. కృష్ణానది దిగువ ప్రాం తాలైన దామరచర్ల, సాగర్‌ తిరుమలగిరి, అడవిదేవులపల్లి మండలాల పరిధిలో పంటపొలాల్లోకి నీరు చేరుతోంది. దామరచర్ల మండలంలో కృష్ణమ్మ ఉగ్ర రూపం మూసీ నదివరకు తాకింది. శుక్రవారం నల్లగొండ జిల్లా దామరచర్ల, సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యంపహా డ్‌ల మధ్య ఉన్న మూసీ నదిబ్రిడ్జిపైనుంచి కృష్ణమ్మ ప్రవహిస్తోంది. 2009లో వంతెనపైనుంచి వరద వెళ్లగా, పదేళ్ల తర్వాత మళ్లీ ఆ దృశ్యం ఆవిష్కృతమైంది. 

నాగార్జునసాగర్‌: సాగర్‌ జలాశయం జలసిరితో అలరారుతోంది. ఎగువనుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో నిండుకుండలా మారింది. అదనంగా వచ్చే వరదనీటిని రేడియల్‌ క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు వదులుతుండటంతో దవళకాంతులను వెదజల్లుతూ కృష్ణమ్మ 585అడుగుల పైనుంచి దిగువకు దుముకుతోంది.  శ్రీశైలం జలాశయానికి ఎగువనుంచి  8,05,100 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా 10 రేడియల్‌ క్రస్ట్‌గేట్లు 34 అడుగులు ఎత్తి దిగువకు 7,03,470 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కుడి,ఎడమ విద్యుదుత్పాదనతో కలిసి  నాగార్జునసాగర్‌ జలాశయానికి 7,13,531 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ జలాశయం నీటిమట్టం 585.70అడుగులకు (299.4545టీఎంసీలు)చేరడంతో అంతే మోతాదులో దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులుకాగా 312.0450 టీఎంసీలు. 


క్రస్ట్‌ గేట్ల వద్ద కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తున్న పర్యాటకులు

ఎగువనుంచి కొనసాగుతున్న వరద
ఎగువనగల కృష్ణాపరివాహక ప్రాంతాల్లోనుండి వస్తున్న వరదలకు ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. అల్మట్టికి 4,06111క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా నారా యణపూర్‌ జలాశయానికి 4,94,396 క్యూసెక్కులనీరు వచ్చి చేరుతోంది. జూరాల జలాశయానికి 6,70,966క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా, తుంగభద్రకు 60,034 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.సుంకేశులకు 67,097 క్యూసెక్కులనీరు వస్తుండగా ఆ నీటినంతటినీ దిగువనగల శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. మరో మూడు రోజులపాటు ఇదే రీతిలో వరద పోటెత్తే అవకాశాలున్నట్లుగా అధికారులు తెలిపారు.

నీట మునిగిన శివలింగం


వరద ఉధృతికి శివాలయంలో ఉన్న శివలింగం నీట మునిగింది.  రివిట్‌ మెంట్‌ వాల్స్‌ కింది భాగం కోతకు గురవుతోంది. శివాలయం ఘాట్‌లో వేసిన టయిల్స్‌ నీటి తెప్పల తాకిడికి లేచిపోయాయి. 

కృష్ణమ్మ చుట్టుముట్టింది
మఠంపల్లి: మఠంపల్లి, చింతలపాలెం, పాలకవీడు మండలాల్లో కొన్ని గ్రామాలను కృష్ణమ్మ చుట్టుముట్టింది. ఎటుచూసినా వరదే కన్పించింది. మట్టపల్లి శ్రీలక్ష్మీనసింహస్వామి ఆలయంలోకి నీరుచేరింది. పులిచింతల స్టోరేజీ 40 టీఎంసీలు దాటడంతో బ్యాక్‌వాటర్‌ పెరిగి కరకట్ట లీకేజీలు అధికమయ్యాయి. గర్భాలయంలోకి నడుములోతు నీరుచేరి స్వామి మూలవిరాట్‌ పాదాలను తాకాయి. శివాలయం, అన్నదాన సత్రాలు, అతిథి గృహాలు మట్టపల్లి గ్రామంలోని ఇళ్లు, వీధులు జలమయమయ్యాయి. మధ్యాహ్న సమయంలో గర్భాలయంలో స్వామివారికి నివేదన గావిం చారు. నిత్యపూజలను పైభాగంలోని చెన్నై పీఠంలో నిర్వహించారు.  పులిచింతల ప్రాజెక్ట్‌ దిగువన ఉన్న వజినేపల్లి, బుగ్గమాదారం, ఎగువనపాలకవీడు మండలం రావిపహడ్, గుండెబోయినగూడెం, మహంకాళిగూడెం లలో వరి, పత్తి, మిర్చి, అరటి తో టలు నీట మునిగాయి. శూన్యంపహాడ్‌ – దామరచర్ల మధ్య మూసీపై నిర్మించిన బ్రిడ్జిపైకి నీరు చేరి రాకపోకలు బంద్‌ అయ్యాయి.   


మట్టపల్లి ఆలయంలోకి చేరిన నీరు,(ఇన్‌సెట్‌లో) గర్భాలయం వద్ద వరదనీరు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top