మండపాల్లో కేసీఆర్‌ బొమ్మ చెక్కడంపై నిరసన | BJP, VHP, Congress Objects To KCR Image On Yadadri Temple Pillars | Sakshi
Sakshi News home page

మండపాల్లో కేసీఆర్‌ బొమ్మ చెక్కడంపై నిరసన

Sep 7 2019 10:00 AM | Updated on Sep 7 2019 10:43 AM

BJP, VHP, Congress Objects To KCR Image On Yadadri Temple Pillars - Sakshi

సాక్షి, యాదగిరిగుట్ట: ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదగిరికొండపై శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వివరాలు. ఆలయ అభివృద్ధిలో భాగంగా పునర్నిర్మాణ మవుతున్న తూర్పు రాజగోపురం పక్కనే ఉన్న అష్టభుజి ప్రాకార మండపంలో మొదటి స్తంభానికి తెలంగాణ సంక్షేమ పథకాల్లో భాగమైన హరితహారం, పక్కనే ఉన్న పిల్లర్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో పిల్లర్‌కు సీఎం కేసీఆర్‌ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపు అష్టభుజి ప్రాకార మండపంలో కారుగుర్తు, కేసీఆర్‌ కిట్టు, తెలంగాణ లోగోలో చార్మినార్‌ను అమర్చినట్లు చెక్కారు. వీటిని బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండ్రు శోభారాణి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన సుమారు 30మంది నాయకులు,  కాంగ్రెస్‌  జిల్లా నాయకులు బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన 15మంది నాయకులు వేర్వేరుగా వాటిని పరిశీలించారు.

అనంతరం బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. దీంతో సీఐ నర్సింహారావు పోలీసులతో అక్కడికి చేరుకొని ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించరాదని ఆదేశించి వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అగ్రహానికి లోనైనా బండ్రు శోభారాణి, బీర్ల అయిలయ్యలు కొండపైన ఆలయాన్ని సందర్శించే హక్కు మాకు లేదా.. ఇక్కడ ప్రెస్‌మీట్‌ ఎందుకు పెట్టవద్దు.. టీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడడానికి వస్తే ఏమీ కాదుకానీ.. మేము మాట్లాడితే తప్పెంటి అంటూ వాగ్వాదానికి దిగారు. అయినా సీఐ వినిపించుకోకుండా అలానే ప్రవర్తించడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 

ఆగమ శాస్త్రమా.. కేసీఆర్‌ ఆదేశామా..?
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతున్నాయని ఆచార్యులు పదేపదే చెబుతున్నారని, ఇక్కడి పనులు చూస్తే సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారంగా, ఆయన చెబుతున్న సొంత శాస్త్రంగానే జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండ్రు శోభారాణి, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు బీర్ల అయిలయ్య ఆరోపించారు. ఆలయాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణతో పాటు ఆంధ్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో గొప్పగా ఆలయాలు నిర్మించిన ఎంతో మంది ప్రముఖులు ఎక్కడా వారి చిత్రాలు, పార్టీ గుర్తులు , ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల బొమ్మలను చెక్కించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి, రాచరిక పాలనతో యాదాద్రి ఆలయ నిర్మాణం పేరుతో తన చిత్రం, పార్టీ గుర్తు, సంక్షేమ పథకాలను గీయించుకున్నాడని మండిపడ్డారు.  ఆలయాన్ని సందర్శించే భక్తులు దేవుడిని చూడాలా లేక కేసీఆర్‌తో పాటు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను చూడాల అని ప్రశ్నించారు. వారి వెంట బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు రాఘవుల నరేందర్, రచ్చ శ్రీనివాస్, గుండ్లపల్లి భరత్‌గౌడ్, ఎరుకల చైతన్య, శేఖర్, భాస్కర్‌రెడ్డి, బొమ్మగాని రాజమణి, రాయగిరి రాజు, బెలిదె అశోక్, నవీన్‌ఠాగూర్, బెలిదే నవీన్‌ తదితరులు ఉన్నారు. 

హిందుత్వ వాదుల ఆందోళన
యాదాద్రి కొండపైన సీఎం కేసీఆర్, కారుగుర్తు, కేసీఆర్‌ కిట్టు, హరితహారం వంటి చిత్రాలను ఆలయంలో పిల్లర్లపై చెక్కడంతో హిందువుల మనోభా వాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ భజరంగ్‌దళ్, హిం దుపరిరక్షణ సమితి, విశ్వహిందు పరిషత్, హిం దుత్వ వాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు హిందుత్వ వాదులను నిర్మాణం అవుతున్న ఆలయంలో చెక్కిన బొమ్మలవద్దకు పంపించకపోవడంతో వారు గోపురం ఎక్కేందుకు ప్రయత్నిం చారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని కిందికి దించారు. ఈ క్రమంలో తూరు రాజగోపురం వైపు పరుగులు తీస్తున్న క్రమంలో డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ మనోహర్‌రెడ్డిలు అడ్డుకున్నారు.

వారిని సముదాయించి, నచ్చచెప్పి వెనక్కి పంపారు. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో అనంతరం భజరంగ్‌ దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుభాష్‌చందర్, విశ్వహిందు పరిషత్‌ ప్రచార కన్వీనర్‌ బాలస్వామి, మఠం మందిర్‌ రాష్ట్ర ప్రముఖ్‌ అరవింద్‌రెడ్డి, భజరంగ్‌దళ్‌ స్టేట్‌ కన్వీనర్‌ శివరాములు, వీహెచ్‌పీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తోట భానుప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి కర్రె ప్రవీన్, ఈశ్వర్, కోకల సందీప్, బోయిని క్రాంతి, గురుగుల క్రాంతి, శివకుమార్‌ తదితరులున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement