నేడు రాష్ట్రానికి అమిత్‌ షా!

BJP President Amit Shah Tour In Telangana - Sakshi

తొలుత లాల్‌దర్వాజ అమ్మవారిని దర్శించుకోనున్న బీజేపీ దళపతి

అటు నుంచి మహబూబ్‌నగర్‌ ఎన్నికల శంఖారావ సభకు షా

తమ పార్టీ వైఖరి.. అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే దానిపై సభలో స్పష్టత

అనంతరం కొత్తూరులో బీజేపీ పదాధికారులతో భేటీ

ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. శనివారం రాష్ట్రానికి వస్తున్న అమిత్‌ షా మధ్యాహ్నం 3 గంటలకు మహబూబ్‌నగర్‌లో ప్రారంభమయ్యే బీజేపీ ఎన్నికల శంఖారావ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు, పదాధికారులతో సాయంత్రం 6:30 గంటలకు శంషాబాద్‌ సమీపంలోని కొత్తూరులో భేటీæ కానున్నారు. వారికి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.

రోజంతా బిజీబిజీగా: ఈ నెల 15న రాష్ట్రానికి వస్తున్న అమిత్‌ షా రోజంతా బిజీబిజీగా గడపనున్నారు. పార్టీ నిర్వహించే బహిరంగ సభకు హాజరవడంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. శనివారం ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత 12 గంటలకు బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లాల్‌దర్వాజ సింహవాహిణి మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. వీలైతే అక్కడ కొద్దిసేపు మాట్లాడి, ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది. మజ్లిస్‌కు కంచుకోట వంటి ఓల్డ్‌ సిటీలో దైవ దర్శనం చేసుకుని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం ద్వారా రాజకీయ వేడిని పుట్టించాలని భావిస్తున్నట్లు తెలిసింది. తర్వాత రోడ్‌ మార్గంలో అమిత్‌ షా మహబూబ్‌నగర్‌కు బయలుదేరి వెళ్తారు.

తెలంగాణలో తమ పార్టీ వైఖరి.. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామన్న అంశాలపై బహిరంగ సభలో స్పష్టత ఇవ్వనున్నారు. బహిరంగ సభ తర్వాత సాయంత్రం 6:30 గంటలకు శంషాబాద్‌ సమీపంలోని కొత్తూరులో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించనున్నారు. గత జూలై 13న రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కేవలం సంస్థాగత విషయాలపైనే దృష్టి పెట్టిన అమిత్‌ షా ఈ పర్యటనతో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

షెడ్యూలు ఇలా..
 ఉదయం 11.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు రాక
 12 గంటలకు బీజేపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌
 1.45 గంటలకు లాల్‌దర్వాజ గుడికి రాక
 3 గంటలకు మహబూబ్‌నగర్‌ బహిరంగ సభకు హాజరు
 6 నుంచి 8 గంటల వరకు కొత్తూరులో ఆఫీస్‌ బేరర్స్‌తో సమావేశం
 9 గంటలకు శంషాబాద్‌ నుంచి తిరుగు పయనం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top