తెలంగాణకు బీజేపీ ఏమీ చేయలేదు

 BJP did nothing for Telangana  Says srinivas yadav - Sakshi

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. 2014లో ఏదో ఉద్ధరిస్తారని మోదీని గెలిపిస్తే ఏం చేయలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు మోదీ ఏం చేశారో చెప్పగలరా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శి వల్లభ్, పలువురు ఇతర నేతలు తెలంగాణ భవన్‌లో గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి తలసాని వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో యువతదే కీలక పాత్ర. యువకులు రాజకీయాల్లోకి రావడానికి కేటీఆర్‌ ఆదర్శమవుతున్నారు. టీఆర్‌ఎస్‌కు సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ఎవరూ పోటీ లేరు.

మా నియోజకవర్గంలో మాకు మాకే పోటీ. ప్రచారంలో గులాబీ జెండా తప్ప మరొకటి కనిపించడం లేదు. కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటానికే తప్ప పనులు చేయడానికి పనికి రారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్న ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదే. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలిపిస్తే ఇతర పార్టీలతో కలిపి వాటిని 216 చేసే శక్తి కేసీఆర్‌కు ఉంది. కాంగ్రెస్, బీజేïపీలను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. ఏపీ సీఎం చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆర్‌ కనబడుతున్నారు. ఆంధ్రా వాళ్లను కొడుతున్నారని, వారి ఆస్తులు లాక్కుంటున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఆంధ్రా రాజకీయాలన్నీ కేసీఆర్‌ చుట్టూ తిరుగుతున్నాయి’అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, సికింద్రాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top