ఇంటర్‌’ వ్యవహారంపై 2న బీజేపీ రాష్ట్ర బంద్‌

BJP Calls For State Bandh Over Inter Results - Sakshi

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వెల్లడి

నేడు జిల్లా కేంద్రాల్లో నిరశన 30న ప్రగతిభవన్‌ ముట్టడి

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకల అంశాన్ని ఉద్యమంగా మార్చేదిశగా బీజేపీ అడుగులేస్తోంది. మే 2వ తేదీన బంద్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆదివారం(28న) అన్ని జిల్లాకేంద్రాల్లో నిరాహార దీక్ష, 29న విద్యార్థులు, మేధావులతో హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం, 30న ప్రగతిభవన్‌ను ముట్టడించాలని నిర్ణయించినట్టు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఈలోపు మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని, బోర్డు కార్యదర్శి అశోక్‌ను తొలగించాలని, అవకతవకలపై సిట్టింగ్‌ జడ్జి చేత న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

తాము పెట్టిన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకుంటే మే 2న రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, ఫలితాల్లో భారీస్థాయిలో లొసుగులు చోటుచేసుకోవటం తో ఇప్పుడు ఈ అంశం పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని బీజేపీ నిర్ణయించింది.  

‘టెన్త్‌’పై కూడా ఆరోపణలు...
ఇంటర్‌ వ్యవహారంలో తీవ్ర తప్పిదాలు దొర్లిన నేపథ్యంలో పదోతరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనంపై కూడా ఆరోపణలు వస్తున్నట్టు లక్ష్మణ్‌ చెప్పారు. ఇంటర్‌ వ్యవహారంలో ఫలితాలకు ముందే ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదని, ఇప్పుడు పదో తరగతి విషయంలో ఎలా జరగబోతోందన్న అనుమానాలున్నాయన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం లక్ష లాది మంది విద్యార్థులను ఆగం చేసినందున పదో తరగతి ఫలితాల విషయంలో జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. అనాలోచిత నిర్ణయంతో గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని, ప్లాన్‌ బి లేకుండా గందరగోళం చేశారన్నారు. 23 మంది పిల్లల ఆత్మ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాం డ్‌ చేశారు. పరీక్షలు, ఫలితాలపై కనీసం సమీక్ష చేయలేకపోయిన విద్యాశాఖ మంత్రి ‘పుండు మీద కారం చల్లినట్టు’సమస్యను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top