రేషన్‌ ఇక..బయోమెట్రిక్‌ | biometric system in rationshops | Sakshi
Sakshi News home page

రేషన్‌ ఇక..బయోమెట్రిక్‌

Jan 30 2018 4:55 PM | Updated on Jan 30 2018 4:55 PM

biometric system in rationshops - Sakshi

డీలర్‌కు పీవోఎస్‌ యంత్రం అందజేస్తున్న అధికారులు(ఫైల్‌) 

బెల్లంపల్లి : రేషన్‌ సరకుల పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లుగా సరుకుల పంపిణీలో సాగిన అవినీతి, అక్రమాలకు చెక్‌  పెట్టేందుకు బయోమెట్రిక్‌ విధానం ప్రవేశపెడుతుంది. ఈ విధానంతో సరకుల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని ఫౌరసరఫరాల శాఖ భావిస్తుంది. 
బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో సుమారు 200 వరకు ప్రభుత్వ చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా నిర్ధేశించిన ప్రకారం లబ్ధిదారులకు సరకులు పంపిణీ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా అందుతున్న సరకులు నిత్యం ఏదో ఓ రూపంలో పక్కదారి పడుతున్నాయి. ముఖ్యంగా లబ్ధిదారులు రేషన్‌ షాపుకు వెళ్లి సరుకులు తీసుకోకున్నా పంపిణీ చేసినట్లు రికార్డులు రాసుకోవడం, ఏదేనీ కారణంతో సరుకులు ఓ నెల తీసుకెళ్లకున్నా తీసుకున్నట్లు నమోదు చేయడం వంటివి జరుగుతున్నాయి. దీంతో సరుకులు వంద శాతం లబ్ధిదారులకు దక్కడం లేదనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది.


బయోమెట్రిక్‌ విధానం..


రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌ విధా నం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎలాంటి అవకతవకలకు ఆస్కా రం లేకుండా ఎంతో పారదర్శకంగా సరుకులను లబ్ధిదారులకు అందించాలని నిర్ధేశించింది. ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడు ఇకపై విధిగా రేషన్‌ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్‌ యంత్రంపై వేలి ముద్ర వేస్తే కానీ సరుకులు పంపిణీ కావు. కార్డుదారు సంతకం సరిపోలితేనే సరుకులు అందిస్తారు. ఇతరులు మళ్లీ సరుకులు పంపిణీ చేయాలని అడిగినా లేదా డీలర్‌ చేతి వాటం ప్రదర్శించడానికి యత్నించినా కుదరని పరిస్థితులు ఉంటాయి.  


డీలర్లకు అవగాహన..


ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ విధానంపై రేషన్‌ డీలర్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు. బయోమెట్రిక్‌ యంత్రం వినియోగంపై తహసీల్దార్‌ ఆధ్వర్యంలో డీలర్లకు అవగాహన కల్పిస్తున్నారు. యంత్రం వినియోగించే తీరు, లబ్ధిదారు వివరాల నమోదు, వేలి ముద్రలు తీసుకునే పద్ధతి, సరుకుల వివరాలను నమోదు చేసే పద్ధతి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. చాలామట్టుకు డీలర్లకు ఈపాటికే బయోమెట్రిక్‌ యంత్రాలను అందజేశారు. ఆ యంత్రం వినియోగంపై డీలర్లు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అమలులోకి తెచ్చిన బయో మెట్రిక్‌ విధానాన్ని డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. వేతనం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించి బయోమెట్రిక్‌ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


మరోవైపు ఫిబ్రవరి 1 నుంచే రేషన్‌ సరకుల పంపిణీలో బయోమెట్రిక్‌ విధానం రానుంది. దీనివల్ల కొంతవరకైనా సరుకుల పంపిణీలో అవకతవకలు నివారించే అవకాశాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement