‘ఇంటి’దొంగల ఆటకట్టిస్తాం.. | bhukya swetha respond on fake house tax | Sakshi
Sakshi News home page

‘ఇంటి’దొంగల ఆటకట్టిస్తాం..

Nov 13 2014 2:44 AM | Updated on Sep 2 2017 4:20 PM

భద్రాచలం మేజర్ పంచాయతీ లో నకిలీ ఇంటిపన్నుల వ్యవహారం.....

భద్రాచలం : భద్రాచలం మేజర్ పంచాయతీ లో నకిలీ ఇంటిపన్నుల వ్యవహారంపై ‘ఇంటి దొంగలు’ అనే శీర్షికన బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన పరిశోధనాత్మక కథనం స్థానికంగా పెద్ద సంచలనం కలిగించింది. ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడిచేలా పంచాయతీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును పాల కమండలి సైతం తప్పుపట్టింది.

ప్రస్తుతానికి ఆరు నకిలీ ఇంటిపన్ను రశీదులు బయట పడగా, ఇవిఇంకా ఎక్కువగానే ఉంటాయనే చర్చ సాగుతోంది. దీనిపై ఉన్నతాధికారుల కూడా రంగప్రవేశం చేశారు. డివిజనల్  పంచాయతీ అధికారిణి ఆశాలత ఈ విషయమై ఆరా తీశారు. ఇప్పటికే తన దృష్టికి ఒక నకిలీ రశీదు వచ్చిందని, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తామన్నారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా దీనిపై సీరియస్‌గానే ఉన్నట్లుగా తెలిసింది.

 సాక్షి కథనంలో పేర్కొన్నవన్నీ వాస్తవమే: సర్పంచ్ భూక్యా శ్వేత
 ‘నకిలీ ఇంటిపన్నులు బయటపడిన మాట వాస్తవం. ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తలోని అన్ని అంశాలూ కరెక్టే. ఆ నకిలీ రశీదులు ఎవరు ఇచ్చారనే దానిపై సమగ్ర విచారణ చేయాలని పంచాయతీ అధికారుల ను ఆదేశించాం. బాధ్యులపై క్రిమినల్ చర్య లు తీసుకునేలా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిందిగా ఈవోకు సూచించాం.

నాకు తెలియకుండానే పంచాయతీలో పనులు జరిగిపోతున్నాయి. ఎటువంటి వర్క్ ఆర్డర్ లేకుండా 8, 9, 10 వార్డులలో పనులు చేస్తున్నారు. దీనిలో వర్క్ ఇన్స్‌స్పెక్టర్ ప్రమేయం ఉంది. అతనిపై తగు చర్యలు తీసుకుంటాం. పాలకమండలిలోనూ చర్చిస్తాం. వర్క్‌ఇన్‌స్పెక్టర్ పంచాయతీకి భారమే అతన్ని తొలగించి పీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. ఈ ఏడాది ఇంటిపన్నుల వసూళ్లకు త్వరలోనే డిమాండ్ నోటీసులు ఇస్తాం.

 గతంలో అధికారుల పాలనలో ఎక్కువగా నకిలీ ఇంటిపన్నుల రశీదులు జారీ అయినట్లుగా గుర్తించాం. పట్టణ ప్రజలు వారి ఇంటిపన్ను రశీదులను ఓసారి పరిశీలించుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. ఈ విషయంలో ప్రజలు నేరుగా నన్ను సంప్రదించవచ్చు’ అని సర్పంచ్ భూక్యా శ్వేత అన్నారు. బుధవారం తన నివాసగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూనెం కృష్ణ, బాణోత్ కృష్ణ, సోడె లక్ష్మితో కలిసి ఆమె మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement