‘కాంగ్రెస్ నిషేధిత పార్టీయా?’
కాంగ్రెస్ చేపట్టిన ఛలో మల్లన్నసాగర్‌ను పోలీసులు భగ్నం చేయడాన్ని మల్లు భట్టి విక్రమార్క ఖండించారు.
హైదరాబాద్: తమ పార్టీ చేపట్టిన ఛలో మల్లన్నసాగర్‌ను పోలీసు బలగాలతో భగ్నం చేయించడాన్ని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. మల్లన్నసాగర్ ఈ దేశంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నిషేధిత పార్టీయా? తాము నిషేధిత వ్యక్తులమా? మేమేమైనా తీవ్ర వాదులమా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ముంపు బాధితులను పరామర్శించటం ప్రతిపక్షంగా తమ బాధ్యతని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా మల్లన్నసాగర్ నిర్వాసితులను పరామర్శించి తీరుతామన్నారు. ఈ విషయమై గురువారం డీజీపీని కలవనున్నట్టు తెలిపారు. అక్కడా న్యాయం జరగకుంటే జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామన్నారు.