భద్రాద్రి ఈఓగా కృష్ణవేణి  

Bhadradri Eo is Krishnaveni - Sakshi

భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ అధికారిణి(ఈఓ)గా కృష్ణవేణి నియమితులయ్యారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారిణిగా పనిచేస్తున్న కృష్ణవేణికి భద్రాద్రి ఆలయ ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ హోదాలో విజిలెన్స్‌ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న కృష్ణవేణి.. అడిషనల్‌ కమిషనర్‌ ఉద్యోగోన్నతి రేసులో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఈఓగా రెండేళ్ల పాటు పనిచేసిన ఆమె, తన సర్వీసులో ఎక్కువ కాలం దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలోనే పనిచేశారు. మరో రెండు మూడు రోజుల్లో భద్రాద్రి ఆలయ ఈఓగా ఇక్కడ అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రస్తుతం ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న ప్రభాకర శ్రీనివాస్‌ను తన మాతృశాఖ(రెవెన్యూ)కు పంపిస్తూ ఈనెల 20న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మరో మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న ఆయన.. ఇక్కడే పని చేసేందుకు మొగ్గు చూపుతూ, తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు.

రూ.100 కోట్లతో ఆలయాభివృద్ధి పనులకు తన హయాంలో శిలాఫలకం వేయించాలనే పట్టుదలతో తన సర్వీసును మరికొంతకాలం పొడిగించుకునేందుకు కూడా తన సన్నిహితుల ద్వారా ఒక దశలో ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించినట్లు ప్రచారం జరిగింది.

ఈ  తరుణంలోనే శ్రీనివాస్‌ను మాతృశాఖకు పంపించటం, మరో అధికారిణికి ఇక్కడ ఈఓగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం దేవాదాయశాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top