
సాక్షి,భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. భద్రాచలం రామాలయంకు చెందిన భూములు పురుషోత్తపట్నంలో కబ్జాకి గురవుతున్నాయి.
ఈ క్రమంలో స్వామివారి భూముల కబ్జాపై సమాచారం అందుకున్న ఈవో రమాదేవి మంగళవారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆక్రమణకు గురవుతున్న భూముల్ని భూకబ్జాదారుల నుంచి కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భూకబ్జా దారులు ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆలయ ఈవో స్పృహ కోల్పోయారు. అప్రమత్తమైన స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా, భద్రాచలం రామాలయంకు చెందిన భూములు కబ్జా వ్యవహారంలో గత కొద్దిరోజులుగా ఆక్రమణదారులకి, దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఆక్రమణ దారులు స్వామి వారి భూముల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేయగా.. వాటి నిర్మాణాలు జరగకుండా దేవాదాయ శాఖ సిబ్బంది అడ్డుకుంది.